ఒకే కుటుంబం, ఒకే పార్టీ దేశాన్ని పాలించడమనేది అటు ప్రజాస్వామ్యానికి, ఇటు దేశ భవిష్యత్తుకు కూడా అనర్థమని లోహియా చెబుతూ ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ తత్వాన్ని విమర్శించేవాడు కానీ, కాంగ్రెస్‌ను కాదు.
తనకు ప్రమాదమని తెలిసికూడా ఆయన కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. జాతికి కొత్త జవజీవాలను తీసుకురావడానికి ఆయన తను చేయగలిగినంత చేశాడు. లోహియా తన 57 ఏళ్ళ జీవితకాలంలో మొత్తం 20 సార్లు అరెస్టయ్యాడు. స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న ఇతర నాయకుల మాదిరిగాకాకుండా 1948 ఆగస్టు 15న ఆయనకు హోదాలేవీ కట్టబెట్టలేదు. ఆయన పేదలకోసం, మహిళలకోసం, సమాజంకోసం తన పోరాటాన్ని అదేవిధంగా కొనసాగించాడు. బహుశా అందునే కాబోలు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగాయి.
బెర్లిన్ నుంచి లోహియా ఎకనామిక్స్‌లో డాక్టరేట్ చేశాడు. అప్పుడు ఆయన వయస్సు 23 ఏళ్ళు. పరిశోధన జర్మనీ భాషలో రాశాడు. బ్రిటన్‌లో చదువుకోడానికి ఆయన ఒప్పుకోలేదు.
లోహియా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా అక్బర్‌పూర్‌లో 1910 మార్చి 23న పుట్టాడు. 13వ ఏటనే అంటే 1923లో తండ్రి హీరాలాల్‌తోపాటు గయా కాంగ్రెస్ సమావేశానికి హాజరై కార్యకర్తగా పనిచేశాడు. కాశీ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంలో చదివిన లోహియా ఉన్నత విద్యకోసం బెర్లిన్ వెళ్ళాడు. 1931లో స్వదేశం తిరిగిరాగానే వెంటనే కాంగ్రెస్ ఉద్యమంలో ప్రవేశించాడు. ఉద్యమ నిర్మాణంపనిలో 1944లో కాంగ్రెస్ ఆయనను బెంగాల్‌కు పంపించింది. తప్పించుకొని నేపాల్ అడవుల్లోకి పారిపోయాడు. చివరకి దొరికిపోయి, బొంబాయి, లాహోర్ జైళ్ళల్లో అనేక చిత్రహింసలకు గురైనాడు. లోహియా కారాగారంలో ఉంటే నేను బయట ప్రశాంతంగా ఉండలేనని గాంధీజీ అన్నాడు.
లోహియా తలచుకుంటే నెహ్రూతో సంబంధాలు నిలుపుకొని ఉన్నత పదవులు పొందగలిగేవాడే. కానీ పదవీ వ్యామోహంలేని లోహియా ఆ పని చేయలేదు. ఆయన నెహ్రూను నిర్ధాక్షిణ్యంగా విమర్శించేవాడు. లోహియా పార్లమెంటులో ఒక ప్రభంజనం. దేశంలో 27 కోట్లమంది రోజుకు మూడణాలతో, 16.5 కోట్లమంది రోజుకు రూపాయితో, 50 లక్షలమంది రోజుకు 33 రూపాయలతో జీవిస్తున్నారని లోహియా లోక్‌సభలో వెల్లడించినప్పుడు ఆ ఆత్మీయతాభిమానం ప్రతిబింబించాయి. లోహియా ఆరంభించిన వివిధ సోషలిస్టు పార్టీలు క్రమంగా బలం పుంజుకుని 1967 సాధారణ ఎన్నికల తర్వాత తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసింది. లోహియా పరాజయం ఎరుగని రాజకీయవేత్త. ప్రజాస్వామిక సోషలిజం ఆయన లక్ష్యం. ఆయన 1967 అక్టోబర్‌లో చనిపోయాడు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లాగా విస్తృత క్యాడర్, బలమైన వ్యవస్థ లేకపోవడంతో సోషలిస్టులు ఊహించినంత ఎదగలేకపోయారు. మేధావులకు నిలయమైన నిలబడలేకపోయారు. సిద్ధాంత విభేదాలు లేకున్నా కలవలేకపోయారు. కలుస్తూ, విడిపోతూ చివరకు కనుమరుగయ్యారు. మహానాయకులను అందించిన సోషలిస్టుపార్టీలు నేడెక్కడ?
మంత్రుల నిరాడంబరత
దేశ సేవకే జీవితాన్ని త్యాగం చేసిన తొలి తరం నాయకులలో ఇంద్రజిత్‌గుప్తా చిట్టచివరి వారు. 1960లో పశ్చిమబెంగాల్‌లో ఓ ఉప ఎన్నికలో ఆయన లోక్‌సభకు పోటీచేసి గెలిచారు. అప్పటినుంచి 1977-80 మధ్యలో తప్ప మరణించేనాటికి ఆయన ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో ఆయన అతిశక్తివంతమైన కేంద్ర హోంశాఖ పదవి చేపట్టారు. ఆయన ఎంతో నిరాడంబరుడు. విదేశాలలో చదువుకున్నారు. వెస్ట్రన్‌కోర్టులో ఓ రెండు గదుల నివాసంలో ఆయన ఉండేవారు. ఇంట్లో ఉన్నప్పుడు లుంగీకట్టుకునేవారు. బయటకు వచ్చినప్పుడు మామూలు ప్యాంటు, షర్టు వేసుకునేవారు. మంత్రి పదవి చేపట్టే వరకు నడిచే పార్లమెంటుకు వెళ్ళేవారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంద్రజిత్‌గుప్తా ఏనాడు తన అధికార వాహనాన్ని విమానాలు నిలిపే చోటువరకు రానిచ్చేవారుకాదు. అక్కడ ఆయన ఎయిర్‌లైన్స్ వ్యాన్‌లో ప్రయాణించేవారు.
జస్టిస్ పార్టీకి నాయకుడిగా ఉండి, మద్రాసు రాష్ట్ర ప్రధానమంత్రిగా నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన బొల్లిన మునుస్వామి నాయుడు మరణానంతరం ఆయనవద్ద నిల్వ ఉన్నది ఆరు రూపాయలు మాత్రమే.
బ్రిటీష్ సంప్రదాయం
1955లో బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకుడైన క్లెమెంట్ రిచర్డ్ అట్లీ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశాడు. ఇతని వయస్సు అప్పుడు 72 ఏళ్ళు. అప్పుడాయన ఇట్లా అన్నాడు. ‘నా తర్వాత పార్టీ నాయకత్వం ఎవరు నిర్వహించాలో నిశ్చయించవలసిన సమయం వచ్చింది. కొత్త వ్యక్తికి తగినంత వ్యవధి ఉండడం అవసరం. నాయకత్వంలో ఉండే సాధకబాధకాలు అర్థం చేసుకుని, అనుభవం సంపాదించుకుంటే ఉత్తరోత్తర ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఉపకరిస్తుంది’ అన్నాడు.
ఓపిక ఉన్నంతవరకు అట్లీ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశాడు. వయసు గడచిపోయింది. ఉదారంగా తప్పుకొని కొత్త తరానికి చోటిచ్చాడు. అది బ్రిటిష్ సామ్రాజ్యం కనుక నాయకులు అటువంటి సంప్రదాయాలు పాటిస్తారు. ఎంత ముఖ్యడైనా వ్యక్తికంటె పార్టీ ముఖ్యం. అలాగే వ్యక్తికంటె సంస్థ ముఖ్యం. తమ తరువాత తరంవారికి కూడా అధికారం, బాధ్యతలుపంచి, వాళ్లుకూడా పైకిరావాలని తోడ్పడుతుంటారు. ఇక్కడ మన సంప్రదాయం వేరు. డెబ్బయోవడిదాటిన, మన నాయకులు ఆ నాయకత్వ బరువుని, ఆ పెద్దరికపు బరువును అలా మోస్తూనే ఉంటారు కానీ, ససేమిరా, యువత దానికి చోటివ్వదు. మన నాయకులకు రిటైర్‌మెంట్ ఉండదు. రిటైరైన తరువాత అట్లీకి ‘ఎరల్ డీమ్’ హోదానిచ్చి బ్రిటిష్ రాణి సత్కరించింది. అంటే బ్రిటిష్ దేశమే తన కృతజ్ఞత చిహ్నంగా ఆయనను ఆ విధంగా సత్కరించిందంటే-బ్రిటిష్ దేశమే తన కృతజ్ఞతా చిహ్నంగా ఆయనను ఆ విధంగా సత్కరించిందన్నమాట.
మన దేశంలో అత్యున్నతమైన ‘భారతరత్న’ పొందిన నాయకులు కూడా ప్రజల్లో కనిపిస్తూనే ఉంటారు ఈ దేశంనుంచి పిలుపు వస్తుందని ఆశిస్తుంటారు. ఉదాహరణకు రాజాజీ, ఆద్వానీలు.
జి. వెంకటరామారావు