tsmagazine
హైదరాబాద్‌ మాధాపూర్‌ లోని హెచ్‌.ఐ.సి.సి లో 2019 లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లను పరిశీలించ టానికి నగరానికి చేరుకున్న స్విట్జర్‌ల్యాండ్‌ లోని ఐ.ఎస్‌.టి.ఎ సెక్రెటరి జనరల్‌ డా. ఆండ్రేయాస్‌ వాయీస్‌, కార్యక్రమాల, సభ్యత్వాల భాధ్యురాలు ఓల్గా స్తోఏకీ హైదరాబాద్‌ నగరంలో పర్యటించారు.

సదస్సు వేదిక కోసం నోవాటెల్‌ హోటల్‌ ను పరిశీలించారు. 93 ఏళ్ల ఐ.ఎస్‌.టి. చరిత్రలో తొలిసారి ఆసియా ఖండంలో జరుగబోయే ప్రతిష్ఠాత్మక సదస్సు వేదిక, అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దూరం, అతిథుల రవాణా, హోటళ్ళు, వసతి సౌకర్యాలు మొదలగు విషయాలను వీరు పరిశీలించారు. 32వ ఐ.ఎస్‌.టి.కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో జరుపుతున్నామని ప్రకటించారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ విత్తన పరిశ్రమ ప్రతినిధులతో నోవాటెల్‌ హోటల్లో సమావేశమయ్యారు. భారత విత్తన పరిశ్రమ అవసరాలను అడిగి తెలుసుకొన్నారు.

డా. ఆండ్రేయాస్‌ వాయీస్‌ మాట్లాడుతూ, ప్రపంచంలో ఐ.ఎస్‌.టి.ఎ అక్రిడిటేషన్‌ ఉన్న విత్తన పరీక్ష కేంద్రాలు 134 ఉన్నాయని, 1000 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సుకు ఐ.ఎస్‌.టి. సభ్యత్వం గల 83 దేశాలనుండి 500 మంది ప్రతినిధులు రానున్నారని, 350 మంది భారత విత్తన పరిశ్రమ నుండి, 150 మంది విత్తన శాస్త్రవేత్తలు, విద్యార్థులు వివిధ ప్రభుత్వ విత్తన సంస్థలు, విత్తనోత్పత్తి కంపనీలు, రైతులు హాజరుకానున్నారని తెలిపారు.

2019 జూన్‌ 26 నుండి జూలై 3 వరకు జరుగే ఈ సదస్సు సందర్భంగా 50 నుంచి 60 దాకా ఎగ్జిబిషన్‌ స్టాళ్ళు ఏర్పాటుచేయాలని, విత్తన పరీక్ష సామగ్రి తయారీదారులకు చోటు కల్పించాలని చర్చించారు. దేశంలోని వివిధ విత్తన పరీక్షా కేంద్రాల అక్రిడిటేషన్‌ విషయం కూడా చర్చించారు.

వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి అతిథులకు స్వాగతం పలుకుతూ దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రమని, అతి పిన్న వయస్సు గల రాష్ట్రమని, దేశానికి విత్తన బాంఢాగారమని, హైదరాబాద్‌ అద్భుతనగరమని తెలిపారు. దేశంలోనే ప్రథమంగా 2016-17లో ఓ.ఇ.సి.డి విత్తన దృవీకరణ చేయబడిన 17 వేల క్వింటాళ్ళ విత్తనం ఎగుమతి చేశామన్నారు. ఈ సంవత్సరం 26 వేల క్వింటాళ్ళ లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ సంస్థ డైరెక్టర్‌, సదస్సు కన్వీనర్‌ డా కే.కేశవులు మాట్లాడుతూ, ఈ సదస్సులో ఐ.ఎస్‌.టి.ఎ , భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, విత్తన పరిశ్రమ మొదలగు నలుగురు భాగస్వాములని తెలిపారు.

జాతీయ విత్తన సంఘం అధ్యక్షులు ఎం. ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ, విత్తన కంపనీల, విత్తన నియంత్రణ విభాగం వారి విత్తన పరీక్ష ఫలితాలలో అంతరం ఎక్కువగా

ఉంటోందని, దీనికై ఒకే పరీక్ష విధానం రూపొందించాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ విత్తన ప్రమాణాలు ఒకేవిధంగా ఉండాలని కోరారు. అతితక్కువ సమయంలో మొలకశాతమే కాకుండా, జన్యు స్వచ్ఛత, విత్తన ఆరోగ్యశ్రీ తెలుసుకొనే పరీక్ష విధానాలను అందించాలని కోరినారు.

ఈ సదస్సులో డా జగన్మోహన్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌ తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్లు, రాష్ట్ర సీడ్స్‌ మెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎ.ఎస్‌.ఎన్‌.రెడ్డి, నూజివీడు, కావేరి, రాశి, ఇండో అమెరికన్‌, మహికో, అంకుర్‌ మొదలగు పలు విత్తన కంపనీల డైరెక్టర్లు, మేనేజింగ్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Other Updates