sunkiఐదారు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు ప్రాణంపోసే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ సమాంతరంగా, అత్యంత వేగంగా జరుగుతుండడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు ఉన్న మార్గంలో 81 కి.మీ. దూరం సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 78.55 కి.మీ. మేర తవ్వకం పూర్తి కావడంపట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు కూడా వేగంగా పూర్తిచేసి, రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందివ్వాలని కోరారు. ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాకముందే కాల్వలద్వారా చెరువులు నింపే పని జరగాలని కోరారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కాల్వలద్వారా గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, ఎస్సార్‌ఎస్పీ సహా ఇతర కాల్వల మరమ్మతులు, నీటి ప్రవాహ సామర్థ్యం పెంపు తదితర పనులు జరగాలని సూచించారు.

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై ‘ప్రగతి భవన్‌’లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి టి. హరీష్‌రావు, జలవనరుల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌, సీఈలు వెంకటేశ్వర్లు, హరేరామ్‌, అనిల్‌, శంకర్‌, నాగేందర్‌, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుసహా ఇతర ప్రాజెక్టులు, వాటి నిర్మాణ దశలపై అధికారులతో సీఎం కూలంకషంగా చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ప్రగతి భవన్‌నుంచే వీక్షించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలను పెట్టి, వాటిని ప్రగతిభవన్‌కు అనుసంధానం చేశారు. ప్రతీక్షణం అక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ఆధారంగానే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి, మంత్రిసహా సమావేశంలో పాల్గొన్నవారంతా వీక్షించారు. గోదావరి నదిలో, నదికి రెండువైపులా జరుగుతున్న బ్యారేజీ, ఇన్‌టేక్‌వెల్స్‌, పంప్‌హౌజ్‌ల నిర్మాణాలను చూశారు. రేయింబవళ్లు పనులు జరుగుతుండడంపట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్‌ నాటికి బ్యారేజీల పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అంతకుముందే కన్నెపల్లి పంప్‌ హౌజ్‌నుంచి నీటిని తోడాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సారెస్పీ, ఇతర కాల్వలద్వారా గ్రామాలకు పంపాలని సూచించారు.

ఆసియాలోనే అతి పెద్ద సొరంగాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నామని, ఈ పనులు వేగంగా పూర్తి కావడం సంతోషకరమని సీఎం అన్నారు. 33 అడుగుల ఎత్తు, 33 అడుగుల అడ్డుతో ఎల్లంపల్లి-మల్లన్నసాగర్‌ మార్గంలో 81 కి.మీ. మేర నిర్మించే ఈ సొరంగమార్గం ప్రాజెక్టుకు అత్యంత ప్రధానమైనదని సీఎం చెప్పారు. లైనింగ్‌ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయని అధికారులు చెప్పారు.

”ప్రాజెక్టుల పనుల విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వర్షాలు లేనప్పుడు ఏ పనులు చేయాలి? వర్షాలున్నప్పుడు ఏ పనులు చేయాలి? వరదలు వస్తే ఎలా వ్యవహరించాలి? అనే విషయంలో ప్రత్యేక కార్యాచరణలు రూపొందించుకోవాలి. బ్యారేజీలు, ఇన్‌టేక్‌వెల్స్‌, పంప్‌హౌజ్‌లు నిర్మాణం జరుగుతుండగానే గేట్లు, పంపుల తయారీ, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, లైన్ల నిర్మాణం సమాంతరంగా జరగాలి. ఎక్కడికక్కడ పనులు సమాంతరంగా చేస్తూ, అంతిమంగా అన్నింటినీ లింక్‌ చేయాలి. ఒకదాని తర్వాత ఒక పనిచేద్దామనే భావన ఉండవద్దు. వర్కింగ్‌ ఏజెన్సీల పనిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వారు కావాల్సిన పనులను సకాలంలో చేస్తున్నారో లేదో కూడా గమనించాలి. అధికారులు, ఇంజినీర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలి. విద్యుత్‌ అధికారులతో కూడా సమన్వయం ఉండాలి. కాళేశ్వరం నుంచి ఎల్‌ఎండీ దాకా ఎన్ని పంపులు పెడుతు న్నాము? దానికి ఎంత కరెంటు కావాలి? అనే విషయాలపై శాస్త్రీయం గా అధ్యయనం చేసి ఏర్పాటు చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చాలా ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపులు తయారు చేపిస్తున్నం. అవి ఆస్ట్రియాలో తయారవుతున్నాయి. అక్కడికి కూడా వెళ్లి రావాలి. వాటి నిర్మాణాన్ని పరిశీలించాలి. వాటి పనితీరుపై అక్కడి తయారీ సంస్థలు, నిపుణులతో చర్చించి నిర్వహణకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

”కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే, అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు గోదావరి నీటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలి. కాల్వల నిర్మాణం జరగాలి. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కాల్వలను వాడుకోవాలి. ఎల్‌ఎండికి ఎగువన ఉన్న సర్వసతి, లక్ష్మి, ఎల్‌ఎండికి దిగువన ఉన్న కాకతీయ కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయాలి. నీటి ప్రవాహ సామర్థ్యం (క్యారీయింగ్‌ కెపాసిటీ) పెంచాలి. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యేవరకు ఈ కాల్వల ద్వారా నీళ్లు పంపాలి. చెరువులు నింపాలి. ఈ నీళ్లను చివరి ఆయకట్టు వరకు పంపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటి పరిధిలోని లిఫ్టులు కూడా వందకు వందశాతం పనిచేయాలి. కాళేశ్వరం దగ్గర పుష్కలమైన నీటి లభ్యత ఉంది. దాన్ని మనం సమర్థవంతంగా వాడుకోవాలి. అవసరమైనచోట లిఫ్టు మరమ్మతులు చేయాలి. దేవాదులను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే దానిపై 8వేల కోట్లు ఖర్చు చేశారు. దానిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి గోదావరిపై బ్యారేజీ కూడా నిర్మిస్తున్నాం. దేవాదులపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి, ఇంకా ఏమి చేయాలో నిర్ణయించాలి. సిద్దిపేట సమీపంలోని ఇమాంబాద్‌లో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలి. 8.5 కి.మీ. పొడవున్న ఈ రిజర్వాయర్‌ బండ్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి అంచనాలు రూపొందించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లు కట్టడానికన్నా ముందే ఆ మార్గంలో కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి. మల్లన్నసాగర్‌, గంధమల్ల, బస్వాపూర్‌, కొండపోచమ్మ పరిధిలోని చెరువులను నింపాలి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని బట్టి లిఫ్టులను వాడాలి. సింగూరుకు లిఫ్టులు పెట్టి నారాయణఖేడ్‌, జహీరాబాద్‌కు నీళ్లు పంపాలి. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను నిర్మించాలి. తీవ్ర వర్షాభావ పరిస్థితులుండే సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్‌, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు చెరువులు నింపడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి” అని సీఎం చెప్పారు.

”తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది. 2024 వరకు రాష్ట్ర బడ్జెట్‌ రూ. 5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. బడ్జెట్‌ పెరుగుతున్న కొద్దీ ఎక్కువమంది ఆధారపడిన వ్యవసాయరంగానికి పెట్టుబడులు ఎక్కువ చేసుకుందాం. రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైతే 15వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా తెలంగాణ రాబోయే కాలంలో సిద్ధంగా ఉంటుంది. సాగునీటి రంగానికి సంబంధించి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి ఏడేళ్ల వరకు కార్యాచరణను, విజన్‌ను రూపొందించాలి” అని కేసీఆర్‌ చెప్పారు.

Other Updates