ద్యాప విజయ్ కుమార్
భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు కూడా ఉన్నాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. జంతు జాతి సుమారు 542 మిలియన్ సంవత్సరాలకు ముందు ‘కాంబ్రియన్ విస్ఫోటనం’ సందర్భంగా సముద్ర జాతి జీవిగా శిలాజం తెలియవచ్చిందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతువులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి, ఇలా జంతుజాతులు అంతరించి పోకుండా వాటిని పరిరక్షించడం, మానవ మనుగడకు అనివార్యం. జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడం జంతువు హక్కును కాపాడటం, ప్రతి సంవత్సరం ప్రపంచమంతా అక్టోబరు 4న జరుపుకునే ‘అంతర్జాతీయ జంతు దినోత్సవం ప్రధాన లక్ష్యం.’
చిన్న, పెద్ద అడవులు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. అడవులలో చెట్లు చేమలు విపరీతంగా ఉంటాయి. ఇందులో నివసించే ప్రాణులకు రక్షణగా వుంటాయి. సాధారణంగా అడవులలో సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు, ఏనుగు, లేడి, జింక, దుప్పి వంటి పెంపుడు జంతువులు ఇవన్ని కలిసి జీవనం చేస్తుంటాయి. అడవి వాతావరణానికి అలవాటు పడినవి అడవి వదలి బయటికి రావు. క్రూర మృగాలు, మాత్రం మనుష్యుల్ని, ఆవులను, గేదెలను, దున్నపోతులను, మేకలను ఆహారంగా భుజిస్తాయి. పెంపుడు జాతికి చెందినవి మాత్రం అడవిలో వుండే ఆకులు, గడ్డి కాయలు, పండ్లు తిని జీవిస్తుంటాయి.
పూర్వం వన్యప్రాణులను రకరకాల కారణాల వల్ల నిర్మూలించడం జరుగుతుండేది. కొందరు బలప్రదర్శన కోసం వీటిని చంపి, పట్టుకొని ధైర్యసాహసాలు గలవారమని చాటుకుంటుండేవారు. ముఖ్యంగా రాజుల కాలంలో ఏనుగు వారికి వాహనాలుగా ఉండేవి. వాటిపై అంబారీలు అమర్చి ఊరేగేవారు. యుద్ధాలలో ఉపయోగించేవారు. దేవాలయాల్లో సేవలకు వినియోగించేవారు. ఈనాడు అవి అన్నీ అంతరించాయి. నేడు యీ వన్యప్రాణులు, ప్రదర్శనశాలల్లో కన్పిస్తున్నాయి. పూర్వం తపోవనాల్లో, రాజమందిరాల్లో వీటికి గొప్ప ప్రాపకం ఉండేది. రానురాను అడవులు ఆశ్రమాలు, రాజమందిరాలు అంతరించి పోయాయి. వన్యప్రాణులకు దుర్దశ ప్రారంభమైనది, తమ స్వార్థం కోసం అడవులను విపరీతంగా కొట్టివేస్తున్నారు. వన్యజీవులకు నివాసం కరువైంది. వాటి స్వేచ్ఛా జీవనానికి ముప్పు వాటిల్లినది. వీటిని పట్టి చంపివేయడం పెరిగిపోతున్నది. సృష్టిలో యీ ప్రాణుల సంఖ్య క్రమక్రమంగా క్షీణించిపోతున్నది. వన్య మృగజాతులు తరిగిపోవటం వలన కొంత కాలానికి ఈ జాతులు పూర్తిగ అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇలా కొనసాగితే కొంతకాలానికి (రాబోయే తరాలవారు) ఫలానా జంతువులు అనగా ఇది అని బొమ్మ పుస్తకాల్లో చూసి తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
వన్యమృగ సంరక్షణకు మానవజాతి దీక్ష బూనాలి. వాటిని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకోకూడదు, చంపకూడదు. తమ స్వార్ధానికి వాటిని బలి చేయరాదు. అంతర్జాతీయ సంస్థలు వన్యమృగ సంరక్షణకు పెద్ద ప్రచారోద్యమాన్ని ప్రారంభించి ప్రతి దేశంలో గల అడవుల విస్తీర్ణం, అందులోగ వన్యజీవుల వివరాలు సేకరిస్తున్నాయి. వాటిని చంపకుండా వృద్ధి చేయటం వలన కొన్ని ప్రకృతి సహజమైన ప్రయోజనాలు కలుగుతాయని బోధిస్తున్నారు. జంతు ప్రదర్శనశాలలో వాటి నివాసం ఏర్పరచి వాటి సంతతి కాపాడవలెనని నిర్ణయించారు.
భారత ప్రభుత్వం వన్యప్రాణుల వినాశనాన్ని అరికట్టి వాటి సంతతిని వృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. వన్యప్రాణులుండే ప్రాంతాలను అరణ్యాలను నిషిద్ధ ప్రాంతాలుగ ప్రకటించినందున అక్కడ చెట్లు కొట్టుట, వేటాడుట శిక్షార్హమని శాసించింది. అటవీ శాఖ అధికారులు, వాటిని కంటికి రెప్పవలె చూచి కాపాడుతూ వాటి సంతతిని పెంపొందించవలెనని ఆదేశించారు. ఈ ఉద్దేశ్యంతోనే వన్యప్రాణి వారోత్సవాలు జరుపుతున్నారు.
అక్టోబరు మొదటి వారం దేశమంతటా జంతుప్రపంచం వారోత్సవాలు జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ఈ వారోత్సవాల ద్వారా ప్రజలకు ‘జంతు’ సంరక్షణ గురించి ఒక అవగాహన రావలసివుంది. ప్రస్తుతం మన దేశం అధిక జనాభా సమస్యలనెదుర్కుంటుంది. కొన్ని పల్లెటూళ్ళలో అడవుల నుండి కలపను రోజువారి వంటకై ఉపయోగిస్తున్నారు. అడవులు, జంతువుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే గాక ప్రతి భారతీయుడిదని తెలుసుకోవాలి. మన రాష్ట్రంలోనే గాక దేశంలోని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు జంతువుల సంరక్షణ బాధ్యతను ఎంతో విజయవంతంగా నిర్వహించడం అందరూ చూస్తున్నదే. అంతర్జాతీయ జంతు దినోత్సవం హ్రీనిచ్ జిమ్మెర్మాన్‌చే ఆవిర్భవించబడిరది. అతను 1925, మార్చి 24న జర్మనిలోని బెర్లిన్‌లో తొలిసారిగా దీనిని నిర్వహించాడు. అనంతరం ఇది 1929 అక్టోబరు 4కు మార్చబడింది. ప్రతి సంవత్సరం హీన్రిచ్ జమ్మెర్మాన్ చేసిన కార్యక్రమాల ప్రచారం కారణంగా 1931, మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జరిగిన అంతర్జాతీయ జంతు రక్షణ సదస్సులో అక్టోబరు 4ను అంతర్జాతీయ జంతు దినోత్సవంగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఈ దినోత్సవం రోజున జంతు సంక్షేమ ప్రచారంతో పాటుగా జంతు పరిరక్షణ శిబిరాఅను నిర్వహించడం జరుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో అడవులు, పచ్చదనాన్ని పెంచడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల జంతుజాలం కూడా వృద్ధి పొందుతోంది. ఇదొక శుభపరిణామం.