వన-సంపదే-మన-సంపదతొమ్మిది నెలలు గర్భంలో మోసి పిల్లను కన్నతల్లి, ఆ బిడ్డ నేలపై పాకుతున్నది మొదలు, ఎదిగే దశలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కాస్త ఎదిగినప్పటినుండే ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని మరికొన్ని జాగ్రత్తలను కూడా చెప్తుంది. అయితే భూమాత సమస్త జీవకోటికి తల్లి, రత్నగర్భ. జీవరాశి మొత్తానికి ఏది కావాలో, ఎప్పుడు కావాలో తెలుసుకొని వాటన్నింటిని సమకూరుస్తుంది. అనేకానేక ఖనిజాలతో పాటు వివిధ రకాల చెట్ల ద్వారా గాలిని, చల్లదనాన్ని ఫలాలను, పుష్పాలను అందిస్తుంది. అంతేకాదు మానవాళి జీవన సరళికి అవసరమైన కలపను, బోలెడన్ని ఔషధులను ప్రతినిత్యం ప్రకృతిమాత మనకు అందిస్తుంది.

మన బతుకులు మనమే బాగు చేసుకోవాలె

వన-సంపదే-మన-సంపదbగ్రామాల మీదికి ఏనుగులు, పులులు, అడవి పందులు వచ్చి పడుతున్నయ్‌. ఏ గుడికాడికో పోతె తప్పించి కోతుల కనపడేటివి కాదు. ఊళ్ళల్ల కోతులు ఆడించేటోళ్ళు వస్తే అందరం తమాషాగ గుమిగూడెటోళ్ళం! కానీ ఇప్పుడు మందకొద్ది కోతులు ఊర్లమీద పడుతున్నయ్‌. ఈ జంతువులు వుండే జాగను మనం చెడగొడుతున్నం, కాబట్టి అవి మన ఊర్ల మీదకొచ్చి పడుతున్నయ్‌. మన దగ్గర డబ్బు దండిగ వుంటే వాటిని రియల్‌ ఎస్టేట్ల్ల పెట్టి కోట్లు గడిస్తున్నం. వెయ్యి కోట్లు వున్నా లాభం లేదు! చెట్లు వుంటేనే మనకు నిజమైన సంపద వున్నట్టు. వన సంపదనే మన సంపద అని చెప్తూ, మన ఇంట్ల చెత్త పక్కింటోడు వచ్చి ఊడుస్తడా? ఏనాటికైనా మన బతుకు మనమే బాగుచేసుకోవాలె అని ముఖ్యమంత్రి కెసీఆర్‌ అన్నారు.

ఎన్నో రకాలుగా ప్రకృతి మనల్ని అంటిపెట్టుకొని చూసుకుంటున్నది. ఇవన్నీ భూమాత మనకందిస్తున్న రక్షణలే. కాని మనిషి మాత్రం తన మానవనైజాన్ని ప్రదర్శిస్తూ పతనం దిశగా పయనిస్తున్నాడు. ప్రకృతిని వికృతపరిచే చేష్టలకు ఒడిగడుతున్నాడు. ఫలితం కాలగమనంలో మార్పు.

ఏడాదికి ఆరు రుతువులను అనుభవించిన తరం ఒకటయితే, ఏడాదికి మూడు కాలాలను (వానాకాలం, చలికాలం, ఎండాకాలం) అనుభవించి ఆరు రుతువులని చదువుకున్న తరం మరొకటి. మరి ఇప్పుడు, ఎప్పుడు ఏ కాలమో తెలియని అయోమయ కాలం. ఇదంతా జరగడానికి మూలకారణం మనమే, మానవాళి సమస్తం నేలవిడిచి సాము చేస్తున్న చందంగా ప్రకృతి విరుద్ధ చర్యలు చేపట్టడమే. ఆధునిక జీవన విధానానికి అలవాటుపడి, పచ్చదనాన్ని పాడు చేస్తూ వెచ్చదనాన్ని పెంచుతూ సాగుతున్న జీవనశైలే కారణం.. మరి ఈ పరిస్థితులలో మార్పు రావాలంటే పచ్చదనం పరిఢవిల్లాలి. వనాలు విలసిల్లాలి. చెట్లు కొట్టడం ఆపాలి. చెట్లు నాటడం పెంచాలి.

వనాలు ఎక్కడుంటే వానలు అక్కడే కురుస్తాయి

వనాు-ఎక్కడుంటే-వాను-అక్కడే-కురుస్తాయిఈ దశాబ్దం చివరినాటికి భూగోళంపై ఉష్ణోగ్రత సగటున ఏడునుంచి తొమ్మిది డిగ్రీల వరకు పెరిగే అవకాశం వుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పు నివేదిక తెలియజేసింది. ఇలాంటి పర్యావరణ పరిస్థితులలో సమూల మార్పును తేవాల్సిన అవసరం వుందని భావించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘హరిత హారం’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని భావించిన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమ రూపకల్పనకు అనేక సమీక్షలు నిర్వహించారు. మొక్కలు నాటడానికి అనుకూలంగా ఎన్నో నెలల ముందు నుండే మొక్కలు మొలకెత్తి, చినుకు పడే కాలానికి సిద్ధం కావాలని ఎన్నో పటిష్టమైన చర్యలు చేపట్టారు.

హరితహారం కార్యక్రమాన్ని జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరు వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మూడు మొక్కలు నాటడంతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాలుగేండ్లలో గ్రామ గ్రామానికి 1.60 లక్షల చెట్లు వుండేవిధంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విరామం లేకుండా కొనసాగించుకుందామన్నారు. వనసంపద, మన సంపద. ఇది ఎవరికొరకో చేసేదికాదు. మనకోసం మనం చేసుకునే సేవ, చెట్ల విలువను గుర్తెరుగుదాం ‘హరిత హారాన్ని’ అద్భుతరీతిలో విజయవంతం చేసుకుందామని కెసీఆర్‌ అన్నారు.

హరిత హారం అంటే ఇదేదో సంస్కృతం కాదు, మనిషికి నాలుగు చెట్లు నాటుడు వాటిని సక్కగ సాదుడు. దీంట్ల బ్రహ్మపదార్థం ఏమీలేదు అని అన్నారు. వనసంపద లేకపోతే మన దగ్గర ఎంత సంపద వున్నా అది దండగనే అన్నారు. చెట్లు నాటడం చాలా చిన్నపని, ఓ మంచి పని. దీంట్ల మతలబు చాలా పెద్దగుంటది. మొక్కలు పెట్టుకోవాలని సర్కారు ప్రత్యేకంగా చెప్పాల్నా? చిన్నతనం మనం పుట్టిందెక్కడ? పెరిగిందెక్కడ? మన అనంతగిరి దగ్గర అద్భుతమైన అడవి ఉండె! కరీంనగర్‌ నుంచో, ఆదిలాబాద్‌ నుంచో ఎవరైనా వచ్చి ఓ నెల రోజులు హైదరాబాద్‌లో వుండి వాపస్‌ పోతే, ఆ మనిషి తెల్లగ నిగనిగలాడేటోడు. గండిపేట నీళ్ళలో అటువంటి మహత్యం వుంది. అనంతగిరి అడవులలో ఔషధ మొక్కలు వుంటయి. దాంట్లనుంచి పుట్టిన మూసీనది నీళ్ళు ఆ ఔషధాల వేర్ల మీదకెళ్ళి వస్తే.. వాటిలో వంద ఇంజక్షన్లు తీసుకున్నంత మందు ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులో చాలా మార్పు వచ్చింది. దీన్ని వేరే దేశమోళ్ళు వచ్చి ఖరాబు చేసిండ్రా? ఎవరూ చేయలె. మనకు తెలివిలేక, ఇదివరకు పన్జేసిన ప్రభుత్వాలకు మనకంటె తెలివి తక్కువుండి.. వాళ్ళు చెప్పక మొత్తం మన సంపదను మనమే నాశనం చేసుకున్నం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు ఆకుపచ్చ దండ

ప్రతి వర్షాకాలంలో నలభైవేల మొక్కల చొప్పున నాటుకుంటూపోతే అవి నాలుగేండ్లకు లక్షా అరవైవేల మొక్కలవుతాయి. ఖాళీ జాగ ఎక్కడ కనపడితే అక్కడ చెట్లు పెట్టాలె. చుట్టూ చెట్లు నాటితే అదే పచ్చ హారంగా మారుతుందని అన్నారు. అప్పుడు మన ఊరికి వచ్చిన మబ్బు మనూళ్ళెనే కురుస్తయ్‌ సీఎం కేసీఆర్‌ అన్నారు.

తెంగాణకు-ఆకుపచ్చదండ‘రాళ్ళ వానలు రావొద్దంటే చెట్లు పెంచాలి. నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒకాయన నా దగ్గరికి బాన్సువాడ నుంచి వచ్చిండు. ఏంది ఇట్ల వచ్చినవే అని అంటే మీరు వ్యవసాయం బాగ చేస్తారని తెలిసి చూసి పోదామని వచ్చిన అన్నడు. ఓ మనిషినిచ్చి మొత్తం తిప్పుకొని రమ్మని చెప్పిపంపిన. ఆయన వచ్చిన తరువాత ఇద్దరం కలిసి అన్నం తింటున్నప్పుడు, మీ ఊరు, మీ జిల్లా ఎట్లా ఉన్నదని, వర్షాలు పడుతున్నయా అని అడిగిన. ఆయన ఎంబడే వర్షాలు పడకపోవుడేంది సార్‌! మా దగ్గర వర్షాలు తప్పకుండ కురుస్తయి అన్నడు. ఇదేందయ్యా దేశమంత కరువు అంటున్నరు. మీ దగ్గర వర్షాలు పడ్డయా! అని అడిగిన. దానికాయన మా ఊరుచుట్టూ జంగల్‌ వున్నది. అందుకే మాకు ప్రతి సంవత్సరం వర్షాలు పడ్తయి. చెరువులు నిండుతయి అని అన్నడు. దీనిలో తెలిసొచ్చిన నీతి ఏందంటే వర్షాలను కురిపించేవి ఖచ్చితంగా చెట్లే! చెట్లు వుంటే రాళ్ళ వర్షాలు కూడా రావు.’

హరితహారం కార్యక్రమం తదుపరి ఘట్టం మేడ్చల్‌ నియోజకవర్గంలోని నారపల్లిలో జరిగింది. నారపల్లిలో వున్న నందనవనంలో మొక్కలు నాటిన తరువాత ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘శివారు గ్రామాలన్ని హరితహారంగా వుండాలి. ఇప్పుడు హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. ఎక్కడా పచ్చదనం, పరిశుభ్రతలేదు. కోటిమంది మెదులుతున్న ఈ సిటీలో పిల్లలను తీసుకొని పార్కుకు పోదామంటే సక్కటి పార్కులేదు. వనభోజనానికి పోదామంటే వనంలాంటి స్థలం లేదు. ఇవన్నీ నిజంగా లేవా ఎవరైనా ఎత్తుకొని పోయారా? ఇదివరకు హైదరాబాద్‌లో ఎన్నో బాగ్‌ లు ఉండేటివి. పూల్‌బాగ్‌, బషీర్‌బాగ్‌, ఇడెన్‌బాగ్‌ చాలా బాగ్‌ లు ఉండేటివి. ఎక్కడికి పోయినయి బాగ్‌ జాగల్ల బంగ్లలు మోపయినయ్‌.’

మనమైతే ఎట్లా చెడిపోయినం. మన పిల్లలు, మనమరాళ్ళు అట్లనే బతకాల్నా? ముందు తరాలకు ఏం చేశామనేది ఆలోచించాలె. మన పెద్దలు మనకెందుకని అనుకుంటే మన కోసం నాగరికత వచ్చేది కాదు. ఎనకటికి బాయిదగ్గర, పొలం దగ్గర మా తాతపెట్టిన మామిడి చెట్టు, మా నాయిన పెట్టిన మామిడి చెట్టు అని గర్వంగా చెప్పుకునేటోళ్ళం. మనల్ని ఎవరో దోచుకోలేదు. సమైక్యపాలకులు అవివేకం వాళ్ళ అనర్థాలు వచ్చిపడ్డయి.

ఇప్పుడు హైదరాబాద్‌ నేను కట్టిన అంటే నేను కట్టిన అంటరు. ఏమున్నది ‘ఊపర్‌ షేర్వానీ అందర్‌ పరేషాని’ అన్నట్టుంది. దీన్ని హైటెక్‌ హైదరాబాద్‌ అంటారు. నేను ఒక్కటే కోరుతున్న ఈ పరిస్థితిలో పూర్తి మార్పురావాలి. ఈ విషయంలో ప్రజందరికీ అవగాహన కలిగే విధంగా చెట్లు, వాటివల్ల కలిగే లాభాలన్నింటినీ తెలంగాణ కవులు కవి సమ్మేళనాలు, రచనలు, గేయాలు, అష్టావధానాలతో ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా సమాచారాన్ని పంపాలని ముఖ్యమంత్రి సూచించారు.

‘ప్రజల భాగస్వామ్యం కానంతవరకు ఏ పథకం కూడా విజయవంతం కాదు. ప్రపంచంలో నెంబర్‌వన్‌ పట్టణం రియోడీజనీరో. అక్కడ ప్రతిరోజు రెండు సార్లు రోడ్లుకడుగుతరు. ఇక్కడ మనకు మొఖం కడుక్కునేతందుకు నీళ్ళు లేవు. జెనీవా పట్టణాన్ని రోజుకు ఒకసారి కడుగుతరు. దీంతో ఎంతో పరిశుభ్రతవస్తుంది. వాళ్ళేం బంగారం తినరు. మనం మన్ను తినం! మనమూ వాళ్ళందరమూ తినేది కార్బోహైడ్రేట్లనే. వాళ్ళలాగా మనమూ చేసుకోవచ్చు. ముఖ్యంగా టీచింగ్‌ స్టాఫ్ కు చెప్తున్నా! దేశనిర్మాతలంటే మీరే. చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రైవేట్‌, ప్రభుత్వరంగ సంస్థలన్నీ తలకెత్తుకోవాలి. అటవీ భూముల పరిరక్షణ ఒక్క సోషల్‌ ఫెన్సింగ్‌తోనే సాధ్యం. ప్రపంచంలో గన్‌ ఫెన్సింగ్‌ కన్నా, సోషల్‌ ఫెన్సింగ్‌ పవర్‌ఫుల్‌. సమైక్య వాదులు బొటానికల్‌ గార్డెన్‌ను అమ్మే ప్రయత్నం చేశారు. కోర్టును ఆశ్రయించి దాన్ని కాపాడుకున్నం.

మనమందరం ఒక్కరుగా బాగున్నం. కుటుంబంగా బాగున్నం. అయితే ఒక సమాజంగా విఫలమవుతున్నం. బజార్లకు పోయి ఏదో ఒకటి కొనుక్కుంటం, తిని పొట్లం చుట్ట చుట్టి కిటికీ నుంచి బయట పడేస్తం. ఇల్లు మనది కానీ రోడ్డు మనదికాదా? ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీకి కథానాయకులు కావాలి. నగరశివారులలో వున్న అటవీ భూములను సోషల్‌ ఫెన్సింగ్‌తో కాపాడుకోవాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

హరితహారానికి రెండవ రోజు జులై 4. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరీంనగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని పలు ప్రదేశాలలో 13 మొక్కలు నాటారు. నిత్య చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచే క్రీడాకారులతో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ముఖ్యమంత్రి కెసీఆర్‌ మొక్కలు నాటారు. షాద్‌నగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఆ తరువాత సిద్ధిపేటకు వెళుతూ సిద్ధిపేట ‘హైదరాబాద్‌ హైవేకి రెండు పక్కలా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు తరువాత కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని ఎల్లమ్మగుడి పూజారులతోనూ, మెదక్‌ జిల్లా సిద్ధిపేట మండంలోని బద్దిపడగ మసీదు ఇమామ్‌తో కలిసి మొక్కలు నాటారు. సిద్ధిపేట మార్కెట్‌లో రైతులతో కలిసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

కరీంనగర్‌ జిల్లా శనిగరం ప్రాంతంలో వున్న రిజర్వు ఫారెస్టులో వీఎస్‌ఎస్‌ సభ్యుతో కలిసి, హుస్నాబాద్‌ అంగడిలో అక్కడి వర్తకులతో కలిసి, అలాగే చిగురుమామిడిలో ఐకేపీ కార్యకర్తలతో ఇలా భిన్న వర్గాల ప్రజలతో మమేకమవుతూ హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించారు.

నేను సిద్ధిపేట నర్సరీ మొక్కను

ఈ సందర్భంగా సిద్ధిపేటలో ప్రసంగించిన ముఖ్యమంత్రి.. ‘‘నేను సిద్ధిపేట నర్సరీలో మొలిచిన మొక్కను.. ఆ మొక్కే ఇప్పుడు తెలంగాణకు నీడనిచ్చే స్థాయికి ఎదిగింది. ఇందుకు సహకరించిన సిద్ధిపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని అన్నారు. హరిత హారం కార్యక్రమం ఇప్పుడు చేపట్టిన కొత్త కార్యక్రమం కాదని, 15 ఏండ్ల కిందనే తాను సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెట్లు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడే పదినిమిషాల్లో పదివేల మొక్కలను నాటి వాటన్నింటిని చెట్లుగా ఎదిగేలా చూశామని, అప్పటి విజయగాథను వివరించారు.

మొక్క ఎండకుండా చూడాలి

ఈ సారి హరితహారంలో నాటే ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోవద్దని అన్నారు. ఒక్క మొక్క ఎండిపోయినా సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చేదిశగానే ఆలోచిస్తూ ముందుకు పోతుందని చెప్పారు. ఇప్పటికే అమలు చేస్తున్న కల్యాణక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను తీసుకరమ్మని మాకు ఎవరూ చెప్పలే. అవసరం కొద్ది పథకాలను ఆలోచన చేసి అమలు చేస్తున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో ఖజానా పరిస్థితి చూసి కల్యాణక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేసే ఆలోచన చేస్తున్నం అన్నారు. కరెంటు కష్టాల నుంచి ఇప్పటికే బయటపడ్డాం. ఒక పూట ఎనకాముందు కల్యాణక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపజేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీనిచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లా లన్నింటిని సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం పథకాన్ని తీసుకొస్తున్నాం అన్నారు. ఈ పథకం పూర్తయితే, కరీంనగర్‌ జిల్లాలో 90 శాతం భూభాగంలో ఏటా రెండు పంటలు పండే అవకాశం కలుగుతుందని చెప్పారు. దాంతో తెలంగాణ ధాన్యాగారంగా, కరీంనగర్‌ బ్రహ్మాండమైన జిల్లాగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకంటే కూడా ధీటుగా రూపుదిద్దుకుంటుందన్నారు.

రూ.5 కోట్ల గ్రాంటు

వన-సంపదే-మన-సంపదఈసారి చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే ప్రతి నియోజకవర్గానికి, ప్రభుత్వం ప్రత్యేకంగా 5 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేస్తుందని ప్రకటించారు. దీనికోసం ప్రజా ప్రతినిధులందరూ కష్టపడాలని సూచించారు. ఈ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసి 50 కోట్ల గ్రాంట్‌ అందుకోండి అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

హరితహారం 3వ రోజున ఆదిలాబాద్‌ జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, తుమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేసి మూడు నియోజకవర్గాలకు నీరందిస్తామని దీనిపై ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. ఈ జిల్లా సమస్యలు సమస్తం తనకు తెలుసునని వీటన్నింటిని పరిష్కరిస్తానని, రాబోయే ఐదారేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి ఇంచుభూమి కూడా వదలకుండా సాగునీరందించే బాధ్యత తనదేనని గట్టిగా చెప్పారు.

కవ్వాల్‌, అభయారణ్య ప్రాంతం. ఇక్కడి కుగ్రామాల్లో మొక్కలు నాటుతూ, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా అధికారులకు ఆదేశాలిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విస్తృతంగా పర్యటించారు సీఎం కెసీఆర్‌.

ముందు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించి పెద్దపల్లి, ధర్మారం, వెలగటూరులో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటి అక్కడి సభలో ప్రసంగించారు ముఖ్యమంత్రి. హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, సమష్టిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. హరితహారం కార్యక్రమానికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా లేకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. మొక్కలు నాటే ప్రణాళికను రూపొందించటంలో కొంతమంది పంచాయతీరాజ్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని అంటూ.. ‘మంచి మాటతో ఒకసారి చెప్తాం’.. పనిచేసే వారిని సమర్ధిస్తాం లేకుంటే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.

కరీంనగర్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు చేరిన ముఖ్యమంత్రి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేశారు. అటునుండి జన్నారం మండలం తపాల్‌పూర్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అటునుండి బయలుదేరి రాత్రి 8 గంటలకు దస్తూరాబాద్‌ గ్రామపంచాయతీ పరిధిలోని దేవుని గూడెం చేరుకున్నారు. ఇక్కడ 200 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడి అటునుండి మామడకు చేరుకుని అక్కడ మొక్కలు నాటి అక్కడి నుండి నిజామాబాద్‌ జిల్లాకు ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్ళారు.

హరితహారం 4వ రోజు జులై 6న నిజామాబాద్‌ జిల్లాలో వేరువేరు చోట్ల ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా పాల్గొన్నారు. వేల్పూర్ మండలం మోతె గ్రామంలో ఉదయం 11 గంటకు మొదలైన హరితహారం కార్యక్రమం, ఆర్మూర్‌, డిచ్‌పల్లి మండలం ధర్మారం, కామారెడ్డిలో రాత్రి 8 గంటవరకు కొనసాగింది. ఆయాసభలలో ప్రసంగించిన ముఖ్యమంత్రి, ప్రతి బస్తీలో ఒక కెసీఆర్‌ పుట్టిండా అన్నట్టుగా ఉద్యమ స్ఫూర్తితో ఈ హరితహారం కార్యక్రమం ముందుకు సాగాలన్నారు.

ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ హరితహారం కార్యక్రమాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి కెసీఆర్‌ను ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి విజయకేతనం ఎగురవేసిన కేసీఆర్‌, ఇప్పుడు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారన్న విశ్వాసం తనకు వుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దేశంలో ప్రస్తుతం 24 శాతంగా వున్న అటవీ సంపదను 36 శాతానికి చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటి పెంపకం బాధ్యత కూడా తీసుకొని, మొక్క బర్త్‌డేను కూడా జరుపుకోవాని ప్రకాశ్‌ జవదేకర్‌ సూచించారు.

నాలుగురోజుల పాటు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 33 శాతానికి వనసంపదను పెంచే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ వర్షాకాలం పొడవునా విరామం లేకుండా కొనసాగించాలన్నారు. తాను స్వయంగా పాల్గొన్న రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రజా ప్రతినిధులకు, కలెక్టర్లకు, అటవీశాఖ అధికారులందరికీ ముఖ్యమంత్రి కెసీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమానికి హాజరై అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు కూడా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

హరిత హారం అంటే ఇదేదో సంస్కృతం కాదు, మనిషికి నాలుగు చెట్లు నాటుడు వాటిని సక్కగ సాదుడు. దీంట్ల బ్రహ్మపదార్థం ఏమీలేదు అని అన్నారు చంద్రశేఖరరావు. వనసంపద లేకపోతే మన దగ్గర ఎంత సంపద వున్నా అది దండగనే అన్నారు. 

 

Other Updates