స్టేషన్‌ఘన్‌పూర్, మల్కాపూర్ వద్ద 10 టిఎంసీల రిజర్వాయర్‌కు క్యాబినెట్ ఆమోదం
వరంగల్ వాసుల దాహార్తికి ముగింపు లభించింది. తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు బీజం పడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జిల్లా మంత్రిగా కడియం శ్రీహరి చేసిన ప్రయత్నానికి ముఖ్యమంత్రి కేసిఆర్ సానుకూలంగా స్పందించారు. బహుళ ప్రయోజనకారిగా ఉన్న మల్కాపూర్ రిజర్వాయర్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫలితంగా జిల్లా నీటి సామర్థ్యం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. దేవాదుల కింద అనూహ్యమైన నీటి స్టోరేజీ సామర్థ్యం పెరిగింది. ఇప్పటి వరకు దేవాదుల కింద ఉన్న 14 రిజర్వాయర్ల స్టోరేజీ సామర్థ్యం ఒక ఎత్తు అయితే… ఆమోదం పొందిన మల్కాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం 10 టిఎంసీలు ఒక ఎత్తు కావడం విశేషం. దీంతో దేవాదుల ఎత్తిపోతల కింద పెద్ద రిజర్వాయర్ కోసం గత కొన్నేళ్లుగా ఉన్న అపరిష్కృత సమస్య, ఇంజనీర్ల డిమాండ్ శాశ్వతంగా పరిష్కారం అయింది.
సచివాలయంలో ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు నాలుగున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. ఇందులో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాదుల ఎత్తిపోతలకు సంబంధించిన మూడు దశల ప్రాజెక్టులపై వివరంగా సమావేశంలో చర్చించారు.
దేవాదుల నీటి సామర్థ్యాన్ని 38 టిఎంసీల నుంచి 60 టిఎంసీలకు పెంచారు. దీంతో పాటు అంచనా వ్యయాన్ని పెరిగిన ధరలకనుగుణంగా 9427 కోట్ల రూపాయల నుంచి 13,445 కోట్ల రూపాయలకు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దేవాదుల నుంచి 365 రోజులు నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకునేందుకు వీలుగా తుపాకుల గూడెం వద్ద బ్యారేజీని నిర్మించాలని, దీనికి 2120 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కూడా క్యాబినెట్ ఆమోదించింది. అదేవిధంగా దేవాదుల మూడోదశ పనుల్లో రామప్ప వద్ద టన్నెల్ నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ధర్మసాగర్ వద్ద నీటిని నింపేందుకు అదనంగా 1101 కోట్ల రూపాయల మంజూరుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేవాదుల నీటి సామర్థ్యం పెంపు జరిగినా..దేవాదుల కింద ఉన్న రిజర్వాయర్లన్ని తక్కువ నీటి సామర్థ్యం కలిగి ఉన్నవే కావడం వల్ల నీటిని ఎప్పటికప్పుడు వాడుకోవడం తప్ప భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. దీంతో నీరు ఉన్నప్పుడు దానిని నిల్వ చేసుకుని తర్వాత వాడుకునేందుకు వీలుగా, ఎక్కువ ముంపు లేకుండా పెద్ద రిజర్వాయర్ ను మల్కాపూర్ గుట్టల వద్ద నిర్మిస్తే వరంగల్ కు శాశ్వతంగా తాగునీటి ఎద్దడిని దూరం చేయవచ్చు. ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా పెద్ద రిజర్వాయర్ అవసరమని గుర్తించి వెంటనే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.
మంత్రివర్గ నిర్ణయాలు మరికొన్ని:
జైళ్లలో తీసుకురావలసిన సంస్కరణలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ. సభ్యులుగా కె. తారకరామారావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి.
శ్రీ ఆసిడ్ దాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠినచర్యలు తీసుకునే విధంగా గతంలోవున్న చట్టంలో మార్పులు, నేరస్తులకు 10 ఏళ్ల నుంచి జీవితకాలం శిక్ష విధించే అవకాశం. నేరస్తులకు జరిమానా విధించి ఆ డబ్బులను బాధితులకు లేదా వారి కుటుంబ సబ్యులకు అందజేసే విధంగా చట్టంలో మార్పులు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం మల్కాపూర్‌లో దేవాదుల ఆయకుట్టు స్థిరీకరణకోసం రిజర్వాయర్ నిర్మాణం.
కంతనపల్లి బ్యారేజ్‌కు బదులుగా తుపాకులగూడెంవద్ద గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం.
రాజీవ్‌సాగర్, ఇంద్రసాగర్ ప్రాజెక్టులను రద్దు చేస్తూ నిర్ణయం.
వివిధ శాఖల్లో వున్న అదనపు ఉద్యోగులను పని ఒత్తిడి ఎక్కువగా వున్న శాఖల్లోకి మార్చాలని నిర్ణయం
కరీంనగర్ ఎల్‌ఎండివద్ద ఫిషరీస్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన తరహాలోనే తక్షణం సాగునీరు అందించే అవకాశం వున్న ఎత్తిపోతల పథకాలను గుర్తించాలని నిర్ణయం. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు అధ్యయనం చేయాలని నిర్ణయం.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కార్యాల యాల నిర్మాణం చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేయాలి.