పరిహారం ఉదారంగా ఇవ్వాలని కేంద్ర బృందాన్ని కోరిన సీ.ఎం.
రాష్ట్రంలో గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు సుమారు రూ. 2740 కోట్లు నష్టం జరిగిందని, కేంద్రం ఉదారంగా సహాయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వర్షాల నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందాన్ని కోరారు. నవంబరు 14న కేంద్ర బృందం సీఎం కేసీఆర్‌ను కలిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నాయకత్వంలోని కేంద్ర బృందం భారీ వర్షాలతో కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నవంబరు 13,14 తేదీలలో రాష్ట్రంలోని సిద్ధిపేట, కరీంనగర్, సంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాల్లో పర్యటించింది. అనంతరం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్రబృందం కలిసింది.
సీఎం కేసీఆర్ కేంద్ర బృందంతో మాట్లాడుతూ సెప్టెంబరు చివరి వారంలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. ఒకేసారి 31 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయని వివరించారు.. దీనితో భారీ నష్టం సంభవించిందని తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చాలా చెరువుల్లో పూడిక మట్టి తీయడం వల్ల పెద్ద నష్టం తప్పిందన్నారు. అయితే ఈ కార్యక్రమంలో చేపట్టని చెరువులకు గండ్లుపడి నష్టం జరిగిందని తెలిపారు. అలాగే పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇవే కాకుండా రోడ్లు, బ్రిడ్జిలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రూ. 2740 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదిక రూపొందించామని సీ.ఎం. కేసీఆర్ తెలిపారు. పూర్తి నివేదికను కూడా తరువాత పంపిస్తామని ఆయన చెప్పారు. తాము ఇచ్చిన నివేదికకు అనుగుణంగా సాయం అందేటట్టుగా కేంద్ర బృందం చూడాలని కేసీఆర్ కోరారు.
హైదరాబాద్‌కు భారీ నష్టం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వర్షాల వల్ల తీవ్ర నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్ర బృందానికి వివరించారు. రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, వాటి మరమ్మత్తులకు ఇప్పటికే రూ. 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాము : కేంద్ర బృందం
తాము క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపామని, నష్టానికి సంబంధించి పూర్తి అంచనాకు వచ్చామని కేంద్ర బృందానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ సీ.ఎం.కు తెలిపారు. పరిస్థితిని కేంద్రానికి విన్నవించి పూర్తి స్థాయిలో పరిహారం వచ్చే విధంగా చూస్తామని వారు సీ.ఎం.కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో కేంద్ర బృందం సభ్యులు, రహదారులు, హైవేలశాఖ రీజనల్ అధికారి ఏ.కృష్ణ ప్రసాద్, ఆయిల్ సీడ్ డైరెక్టర్ ఎస్‌కే కోటేశ్వర్, జలవనరులశాఖ ఎస్.ఈ. ఓఆర్‌కే రెడ్డి, ఆర్థికశాఖ డైరెక్టర్ ఆర్‌బీ కౌల్, రూరల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ కమీషనర్ జగదీష్‌కుమార్‌లతో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.