వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. ఏప్రిల్ 20న సచివాలయంలో వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మనం ప్రారంభిస్తున్న వాటర్‌గ్రిడ్ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలని యావత్ దేశం గమనిస్తున్నదని సి.ఎం. పేర్కొన్నారు. ఈ వాటర్‌గ్రిడ్ ద్వారా అందించే నీటిని మొదట ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, కరువు పీడిత పాలమూరు జిల్లాలలో ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు.
వేగంగా, పారదర్శకంగా పనులు జరగాలి
వాటర్‌గ్రిడ్ పనులు వేగంగా, పారదర్శకంగా జరగాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పథకానికి ఎన్నో సంస్థలు నిధులు సమకూర్చడానికి ముందుకు వస్తున్నాయన్నారు. హడ్కొ, నాబార్డ్ నుంచి రూ. 13వేల కోట్లకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఈ సంస్థలే మరో రూ. 7వేల కోట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తాయన్నారు. ఇవి కాకుండా అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరుస్తుందన్నారు. నిధుల కొరత లేదని పనులు ముమ్మరంగా జరిగేలా చూడాలన్నారు. పనుల టెండర్లలో దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీలు పాల్గొనేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులు అత్యంత నాణ్యత, మన్నిక కలిగి ఉండాలన్నారు. పనుల్లో అవకతవకలు, అవినీతి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
పంచాయతీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 26 ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ 26 ప్యాకేజీలను 5 విభాగాలుగా విభజించుకుని పర్యవేక్షిస్తే పనులు జరగడం సులభమవుతుందని సూచించారు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (సీడీఆర్) తయారైన తరువాత దాన్ని ఎక్స్‌పర్ట్ కమిటీకి పరిశీలన కోసం పంపించాలన్నారు. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద పనులపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. 311 చోట్ల వాటర్‌గ్రిడ్ పైపులైన్లు రైల్వే లెవల్‌క్రాసింగ్‌లను దాటాల్సి ఉంటుందన్నారు. దీనికి వెంట వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా రైల్వే, వాటర్‌గ్రిడ్ అధికారులు సమావేశమై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, అప్పటి వాటర్‌గ్రిడ్ కార్పోరేషన్ ఎం.డి. శాలినీమిశ్రా, తదితర అధికారులు పాల్గొన్నారు.