తెలంగాణ తాగునీటి పథకం భారతదేశానికే ఆదర్శమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికి కోట్లాదిమంది దాహాన్ని తీర్చేందుకు బృహత్ పథకాన్ని మొదలుపెట్టడం అసామాన్యమన్నారు..తెలంగాణ స్ఫూర్తిగా ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లో తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామని అఖిలేష్ చెప్పారు.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించి వివరించడానికి లక్నో రావాలన్న అఖిలేష్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన పంచాయితీరాజ్ మంత్రి కె.తారకరామారావు బృందానికి ఆత్మీయ స్వాగతం లభించింది.. ముఖ్యమంత్రి అఖిలేష్ తో సమావేశమైన మంత్రి కేటీఆర్…తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు..18 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో కేసీఆర్ ప్రారంభించిన తాగునీటి పథకమే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు స్ఫూర్తి అని వివరించారు..
వచ్చే మూడున్నరేళ్లలో ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలున్న జనావాసాలకు నల్లాతో సురక్షిత మంచినీటిని అందిస్తామన్నారు..అలా అందివ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు..వాటర్ ప్రాజెక్టులో పారిశ్రామిక అవసరాల కోసం 10 శాతం నీటిని కేటాయించామని, వాటర్ ప్రాజెక్టు కోసం వేస్తున్న పైప్ లైన్లతోనే పైబర్ కేబుల్స్ వేసి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు.. తాగునీటి కోసం ఆడబిడ్డలెవరూ బిందెలతో రోడ్డు పైకి రాకూడదన్న లక్ష్యంతో తమ ఇంజనీర్లు పగలు,రాత్రి పనిచేస్తున్నారన్నారు.. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆర్థిక వనరుల గురించి అఖిలేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.. హడ్కో, నాబార్డ్‌తో పాటు దేశంలోని ప్రఖ్యాత బ్యాంకులు రుణ సహాయానికి ముందుకొస్తున్న విషయాన్ని చెప్పారు.
ప్రాజెక్టు ఫైనాన్షియల్ మోడల్ ఆచరణాత్మకంగా ఉందని.. దాన్ని తమకు పంపించాలని కేంద్ర తాగునీటి శాఖ జాయింట్ సెక్రటరీ సత్యబ్రత సాహూ అడిగిన విషయాన్ని అఖిలేష్ కు చెప్పారు.. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఉత్తరప్రదేశ్ సిఎం అఖిలేష్…తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును త్వరలోనే తమ రాష్ట్రంలోనూ ప్రారంభిస్తామన్నారు..ఇందుకు సాంకేతిక సహాయం అందించేందుకు తెలంగాణతో ఎం.ఓ.యు. కుదర్చుకుంటామన్నారు.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని, తమ రాష్ట్రానికి చెందిన కీలక ఇంజనీర్లందర్నీ తనతో పాటు తీసుకొస్తానని అఖిలేష్ చెప్పారు. వాటర్ ప్రాజెక్టు డిజైన్, పనులను పర్యవేక్షణపై తమ ఇంజనీర్లకు తెలంగాణ ఇంజనీర్లతో అవగాహన కల్పించాలని కేటీఆర్ ను కోరారు.
యువకుడైన మంత్రి కేటీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని, ఆయన ఆలోచనల్లో దార్శనికత, నిజాయితీ కనిపించిందని అఖిలేష్ ప్రశంసించారు..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో తెలంగాణ ఎన్నో మైలురాళ్లు అందుకుంటుందన్న విశ్వాసం తనకుందన్నారు..ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, జల్ నిగమ్ ఎండీ, తెలంగాణ పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, ఆర్‌డబ్లుఎస్ అండ్ ఎస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ పాల్గ్గొన్నారు..
ములాయం, కేటీఆర్ భేటీ
తనను కలవడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ బృందానికి యూపి సిఎం అఖిలేష్ యాదవ్ విందు ఏర్పాటుచేశారు..ఈ సమయంలోనే అక్కడకు వచ్చిన ములాయం సింగ్ యాదవ్ తో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ చొరవ, మాటతీరు,దేశ రాజకీయాలపై ఆయనకున్న అవగాహనను చూసి ములాయం సింగ్ ముగ్దుడయ్యారు.