water‘‘ఏ తెగువ, పౌరుషంతో తెలంగాణ రాష్ట్రం సాధించామో, అదే స్ఫూర్తితో పనిచేద్దాం. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రేయింబవళ్ళు కష్టించి పూర్తి చేసి, దేశానికి ఒక మోడల్‌ స్టేట్‌గా తెలంగాణాను రూపొందిద్దాం. రాష్ట్రాన్ని విజయవంతమైన రాష్ట్రంగా నిలబెడదాం’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. డిసెంబరు 10న మెదక్‌ జిల్లాలో జరిగిన ‘సిద్దిపేట వాటర్‌గ్రిడ్‌’ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు సమైక్యంగా అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారని యావత్‌దేశం ప్రశంసించేలా కలసిమెలసి పనిచేద్దామని ఇంజినీరింగ్‌ అధికారులకు చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకంలో పాలుపంచుకోబోతున్న పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌. ఇంజినీర్లకు సిద్దిపేట నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహిస్తున్న మంచినీటి పథకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకం పూర్వాపరాలను సాంకేతిక అంశాలతోసహా వివరించి ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

అధికారులు, ఇంజినీర్ల మీద నమ్మకంతోనే వచ్చే ఎన్నికలలోపు ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తానని శాసనసభ సాక్షిగా ప్రతిజ్ఞ తీసుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. పట్టణాలు, పల్లెలేకాదు, పది గుడి సెలున్న ఆవాసాల్లో సైతం ప్రతి ఇంటికి, గుడిసెకి మంచినీరు అందించి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

నిధుల సమస్యేలేదు

‘వాటర్‌ గ్రిడ్‌’ పథకం అమలు చేసేందుకు నిధులసమస్య లేదని, అధికారులు కోరే సదుపాయాలన్నీ సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు.

‘తెలంగాణాలో వజ్రాల్లాంటి అధికారులున్నారు. అంతాకలిసి ‘‘రేయింబవళ్ళు కష్టపడదాం’’ అని అధికారులకు పిలుపు నిచ్చారు. సిద్దిపేట పథకం మొదలుపెట్టినప్పుడు తనను చాలామంది అవమానపరిచారని చెప్తూ ‘ఈయన గుట్టలమీద నీళ్ళు తెస్తుండు. అయితదా, పోతదా’ అన్నారని, కానీ, తానుమాత్రం అధికారుల సహకారంతో నిజాయితీగా కష్టపడి పథకం పూర్తి చేయగలిగానన్నారు.

‘‘మనం చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. చాలా అవమానాలు పడ్డం. చాలామంది ఎక్కిరించిండ్రు, ఈ కె.సి.ఆర్‌. బక్కగ, చీపురుపుల్లోలె ఉన్నడు. ఊదితె ఎగిరిపోతడు అని మాట్లాడిరడ్రు. కానీ తెలంగాణ ఇప్పుడు సాకారమైంది. రేపు ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకం కూడా ఖచ్చితంగా సాకారమైతది. మనం తెలంగాణ బిడ్డలం. తెగువ, పౌరుషం ఉన్నవాళ్ళం. పట్టుదల కలిగిన బిడ్డలం. అనుకుంటే సవ్యసాచిలా పనిచేస్తం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘మీ చెమట చుక్కలు రాలితేనే మన ప్రజలకు మంచినీరు చుక్కలు పడతయి. ఇంజినీర్లుగా మీ అందరి శ్రమపైనే ఈ పథకం ఆధారపడి ఉంది. మీకు వసతులు ఏమి కావాలో అన్నీ తీసుకోండి. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నం’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో ఇది ప్రథమ ప్రాధాన్యతగల పథకం. నిధులగురించి భయపడొద్దు. సవాల్‌గా తీసుకొని ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని నూటికి నూరుపాళ్ళు విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

కాంటూర్‌ ఓ భగవద్గీత…

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఆయా జిల్లాల, నియోజకవర్గాలు, గ్రామాల్లోని ట్యాంకుల కాంటూర్‌ లెవెల్స్‌ను వెంటనే సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుకు కాంటూర్‌ పుస్తకం భగవద్గీత వంటిదని అన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు తన జేబులోని ‘తెలంగాణ కాంటూర్‌’ పుస్తకాన్ని తీసి చూసిస్తూ… ప్రతి ఇంజినీర్‌ జేబులో ఈ పుస్తకం ఉండాలని చెప్పారు.

ఈ వాటర్‌గ్రిడ్‌ పథకంకోసం తొమ్మిది జిల్లాలకు సంబంధించిన డిజైన్లు సిద్ధమయ్యాయని, వాటిలో కొన్ని జిల్లాల వివరాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

సాంకేతికంగా అభివృద్ధి చెందినందువల్ల సిద్దిపేట పథకంకంటే ఇంకా మెరుగైన పద్థతులను పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, టి. రాజయ్య, పలువురు మంత్రులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.

స్థానిక కార్యక్రమాలలో సీఎం

సిద్దిపేటలో తాగునీటి సరఫరా తీరును వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులకు స్వయంగా వివరించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ తర్వాత సిద్దిపేటలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పబ్లిక్‌ సర్వెంట్స్‌ హోమ్‌ స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సిద్దిపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని, కొత్తపల్లి`మనోహరాబాద్‌ రైల్వే లైను  పనులకు ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించిందని సీఎం చెప్పారు. పట్టణంలో న్యాయవాదులకు ప్రత్యేకంగా ఓ మోడల్‌ కాలనీ ఏర్పాటు చేస్తామన్నారు. ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించి పలువురు వృద్ధులకు ముఖ్యమంత్రి పింఛన్లు అందించారు.

అంతకుముందు కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి మండలం హన్మాజీపల్లి పరిధి దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండి)లో ఉన్న సిద్దిపేట త్రాగునీటి పథకం పైపులైను, జలగర్భ బావి (ఇన్‌టేక్‌ లెవెల్‌) పంపు హౌస్‌ను సందర్శించారు. మైలారం గుట్టపై ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను హెలికాఫ్టర్‌ ద్వారా గగనతలంనుంచి పరిశీలించారు.
పథకం ఎందుకు ఆదర్శం?

మెదక్‌ జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన నీటి సరఫరా పథకం విజయోత్సవ (2000-2014) సభ డిసెంబరు 10న సిద్దిపేటలో వైభవంగా జరిగింది. రాష్ట్రంలో ఇంటింటికీ కుళాయిలద్వారా మంచినీరు సరఫరా చేసే ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకానికి సిద్దిపేట నీటి సరఫరా పథకమే ఆదర్శం కావడం విశేషం.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసనసభ్యునిగా, రశాణాశాఖామంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ సిద్దిపేట నీటి సరఫరా పథకాన్ని సాధించి, విజయవంతంగా అమలు చేయగలిగారు.
ఆ కాలంలో సిద్దిపేటలో ఎండాకాలం వచ్చిందంటే భయంకరమైన నీటి సమస్య ఉండేది. ఈ పరిస్థితిని ఎట్ల అధిగమించాలని చంద్రశేఖరరావు సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులతో సంప్రదించి సిద్దిపేట నీటి సరఫరా పథకానికి డిజైన్‌ రూపకల్పన చేశారు. మొదట 145 గ్రామాలకు నీరు సరఫరా చేసేలా ఈ పథకాన్ని చేపట్టారు. కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో రాత్రింబవళ్ళు కష్టపడి కేవలం 16, 17 నెలల్లో పథకాన్ని పూర్తి చేశారు. ప్రస్తుత సిద్దిపేట నియోజకవర్గంలోని ఫ్లోరైడ్‌ పీడిత 180 గ్రామాలకు విజయవంతంగా తాగునీరు సరఫరా అవుతోంది.
ఈ పథకాన్ని కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేరు డ్యాంపై నిర్మించారు. ఈ డ్యాంలో ఎం.డీ.డి.ఎల్‌. (మినిమం డ్రా డౌన్‌ లెవెల్‌) ప్రతి ఆఖరిచుక్క నీటిని కూడా ఉపయోగించుకునే విధంగా బెజ్జంకి మండలం హన్మాజీపల్లివద్ద ‘ఇన్‌ టేక్‌ వెల్‌ కం పంప్‌ హౌస్‌’ను నిర్మించారు. పక్కనే ఉన్న మైలారం గుట్టలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరును ఎత్తుగా నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

సిద్దిపేట నీటి సరఫరా రూపకర్త, విజయసారధి

water2

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాటల్లో…. ‘‘రాత్రింబవళ్ళు కష్టపడి 16, 17 నెలల రికార్డు టైంల పూర్తిచేసినం. మానేరు డ్యాం దగ్గరికి 37 సార్లు పోయిన. సిద్దిపేట పట్టణం భౌగోళికంగా చాలా ఎత్తు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో భౌగోళికంగా కాంటూర్‌ లెవెల్స్‌ అన్నీ తెలుసు. సిద్దిపేట దాకా నీళ్ళు తెస్తే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గ్రావిటీద్వారా పోతాయని నిర్ధారణకు వచ్చినం. నేనేం ఇంజినీరును కాదు. కానీ, నాతో పనిచేసిన ఇంజినీర్లు ఇచ్చే ఇన్‌పుట్స్‌, విజ్ఞానం ఆధారంగా ఈ పథకంల 99 శాతం డిజైన్‌ చేసిన. ముందు నీళ్ళు తీసుకున్నచోటనే మంచి గుట్టవెతకమని అధికారులకు చెప్పిన. నా ఉపాయమేందంటే, ఎత్తయిన గుట్టమీదకు నీళ్ళు తీసుకుపోతే అక్కడినుంచి ఎంత దూరమైనా గ్రావిటీతో నీళ్ళు వస్తయి. ప్రకృతికి అనుగుణంగా ఏవైనా పథకాలు రూపొందిస్తే అవి చాలా కాలం మన్నికగా ఉంటాయి. ఈ పథకం 16-17 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తోంది’’ అని వివరించారు.

నిజమే! చంద్రశేఖరరావు పూనికతోనే సిద్దిపేట నీటిపారుదల పథకం విజయవంతంగా నడుస్తూ విజయోత్సవాలు జరుపు కొంది. అందుకే, ఈ పథకం రూపకల్పన, నిర్మాణం, అమలులో నిరంతరంగా కృషి చేసిన అనుభవంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రంలో చేపడుతున్న వాటర్‌గ్రిడ్‌ పథకానికి సిద్దిపేట పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నారు.

ఈ పథకం గురించి ముఖ్యమంత్రి సహచర మంత్రులకు, అధికారులకు సోదాహరణంగా వివరించడంతో ఇది ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా మారింది. ఇదే తరహాలో ‘వాటర్‌గ్రిడ్‌’ పథకాన్ని విజయవంతంగా సాధించి తీరాలన్న ముఖ్యమంత్రి ప్రతిజ్ఞకు అధికారులు తమ సంసిద్ధతను వ్యక్తం చేయడం శుభ పరిణామం.

వాటర్‌గ్రిడ్‌పై సీఎం పాఠాలు!

kcr

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొద్దిసేపు ఉపాధ్యాయుని పాత్ర పోషించారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్‌’ పథకానికి రోల్‌మోడల్‌ అయిన సిద్దిపేట సమగ్రనీటి సరఫరా పథకం గురించి ఇంజినీర్లకు, అధికారులకు, మంత్రులకు, శాసనసభ్యులకు ఆయన సోదాహరణంగా వివరించిన తీరును ఉపాధ్యాయుని మరిపించేదిగాఉంది. ఓ ఉపాధ్యాయుడు ఎంతో ఓపికతో పిల్లలకు అర్థమయ్యేలా ఎలా వివరిస్తారో, అదే రీతిలో సిద్దిపేట పథకం గురించి ముఖ్యమంత్రి వివరిస్తుంటే పెద్దపెద్ద ఇంజినీర్లే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్‌ పథకం ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్టు , విడమరచి చెప్పారు. ఇన్‌టేక్‌వెల్‌, కాంటూర్‌లు, గ్రావిటీ, పంపుసెట్లు అమరిక, ఇందులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ముఖ్యమంత్రి వివరిస్తుంటే అధికారులు విస్తుబోయారు. మధ్యమధ్యలో ‘‘అర్థమైందా? లేదా?’’ అని ప్రశ్నిస్తూ, సమాధానాలు రాబట్టారు. ‘‘వాటర్‌గ్రిడ్‌’’ పథకంలో మహబూబ్‌నగర్‌ జిల్లా మన రాష్ట్రంలోనే అత్యంత క్లిష్టమైంది. ఎల్లోర్‌ గుట్ట ఉంది… కాలేర్‌ గుట్ట… అక్కడినుంచి నీటిని గ్రావిటీ ద్వారా క్రిందికి పంపాల్సి ఉంటుంది’’ అంటూ వివరించారు. ఈ పథకంలో ఎదురుకాగల సమస్యలని ఊహాజనితంగా ప్రస్తావిస్తూ వాటిని ఎలా పరిష్కరించాలో కూడా ముఖ్యమంత్రి వివరించడం సీనియర్‌ ఇంజినీర్లనీ ఆశ్చర్యపరిచింది.

Other Updates