తెలంగాణా ప్రాంత వ్యవహారంలో శరీర సంబంధóపదాలు చాలా వరకు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో శరీరము, దేహము, వపువు, గాత్రము మొదలైన దేహ సంబంధమైన పదాలకు బదులుగా ‘పెయ్యి’ అనే మాట బాగా ప్రచలితమై వుంది. ఇది అచ్చతెనుగుపదం. ఈ మాటను ఇతర ప్రాంతాల్లో ”మెయి” అంటున్నారు. తెలంగాణలో వ్యవహృతం అవుతున్న ”పెయ్యి” నిఘంటువుల్లోకి ఎక్కలేదు. ఈ ‘పెయ్యి’ కొత్తమాట ఏమీ కాదు. ఆంధ్రులు వాడుతున్న ”ఒళ్ళూ పై తెలియకుండా మాట్లాడుతున్నాడు” అన్న వాక్యంలోని ”పై” ఈ ”పెయ్యే!”. ఒళ్ళు అన్నా పై అన్నా అర్థం ఒకటే. ”నోరూ వాయీ లేని మూగజీవాలు” అనే వాక్యములోని నోరు, వాయి ఏకార్థబోధకాలే! జంట పదాల్లో ఈ ఒకే అర్థం యిచ్చే పదాలు రావడం భాషలో పరిపాటి. కనుక ”పెయ్యి” అనేది పరమ ప్రామాణికపదం. తెలంగాణలో అందుకే స్నానం చేయడాన్ని ”పెయ్యి కడుక్కునుడు” అంటారు కొందరు. మరి కొందరు తానంగా వ్యవహరిస్తారు. స్నానం చేసేందుకు వాడే సబ్బును ”పెయ్యి సబ్బు’ అనీ, జ్వరం వచ్చినప్పుడు ”పెయ్యికాక వచ్చింద”నీ అంటుంటారు. తెలంగాణలో శరీరాన్ని జానపదులు ”చెత్త” అని కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తారు. ”వాడు ఉత్త చెత్త చూసుకొని మురుస్తడు. వీడు అద్దంల అద్దగంట మొకంపెట్టి చెత్తను సింగారిచ్చుకుంటడు” వంటి మాటలు తాత్విక ధోరణితో వెలువడుతాయి. శరీరం బుద్భుదప్రాయం, నీటిబుగ్గ (బుడగ) వంటిది, క్షణ భంగురం మొదలైన అభివ్యక్తులకు దీటుగా జానపదులు ఇది ఉత్త చెత్త అనితోసి పారేస్తారు. పోతన ‘కంజాక్షునకుగాని కాయంబు కాయమే/పవన గుంఫిత చర్మ భస్త్రికాగ’ అనలేదా? ఇంకా తత్వాలుగాని రాసినవాళ్ళు ”తొమ్మిది తూటుల తొలుతిత్తియిది తుస్సుమనుట ఖాయం-ఓ జీవా తుస్సుమనుట ఖాయం’ మరింత ముందుకు వెళ్ళి అన్నారు.
ఇంక ఈ శరీరానికీ సంబంధించిన యితర పదాల్ని చూద్దాం. ముఖంతో పెదవులకింద ‘చిబుకము’ ఉంటుంది. దీన్ని తెలంగాణలో ”గదువ” అంటారు. ఈ ‘గదువ’ పదమే నిఘంటువుల్లో లేదు. మరి ఈ గదువకు దిగువన అటూయిటూ వుండే బిళ్ళల్లాంటి వాటిని ఏమంటారు? అవే ఆంధ్రలో ‘గవదబిళ్ళలు’ అంటే తెలంగాణలోని గదువ వర్ణవ్యత్యాయంవల్ల ‘గవద’ అయ్యింది. ఈ గవద బిళ్ళల్నే తెలంగాణవాళ్ళు కుతికెలు వచ్చినయనీ, చెంపలు వచ్చినయనీ అంటారు. ఇవే ఆంగ్లంలో టాన్సిల్స్. మరి తెలంగాణలో ”గదువ” అని పిలిచే భాగాన్ని ఆంధ్రలో ‘గడ్డం’ అంటున్నారు. తెలంగాణలో మాత్రం గడ్డం అంటే గదువ, చెంపలు మొదలైన భాగాల్లో పెరిగిన వెంట్రుకలే! ఇక ”ముక్కు” గురించిన ముచ్చట ”ముక్కు” అనే ముక్క అన్ని తెలుగు ప్రాంతాల్లో ఒక్కటే తీరుగా ఉంది. అయితే ఆంధ్ర ప్రమాణ భాషలో ముక్కు’పుటాలు’ మాత్రం తెలంగాణలో ”ముక్కుచెలిమెలు”. పుటం అంటే దోణి, దొప్ప. చెలిమె అంటే వాగులు వంకల్లో యిసుకను తవ్వగా ఏర్పడిన గుంత. ఈ ముక్కుచెలిమెల మధ్యలో ఉన్నది ముక్కు ”దూలం”. మరి ఈ దూలం యితర తెలుగు ప్రాంతాల్లో ఎలా ఉందో తెలియదు.
శరీరంలోని పక్కటెముకల్ని తెలంగాణలో ”బరిబద్దబొక్కలు” అంటారు. ఎముకల్ని బొక్కలు అనడమే తెలంగాణ వ్యవహారం. ఆంధ్రలో ‘బొక్క’ అంటే తెలంగాణలో ‘పొక్క’. మరి ఈ తెలంగాణ ‘బొక్క’ తెలుగు భాషలోని ‘బొమిక’ నుండి వర్ణసమీకరణం జరిగి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలోని ”బుర్ర”కు సమానార్థకం తెలంగాణలో ”పుర్రె”. ”వాడికి బుర్ర లేదు, ఉన్నా అది మట్టి బుర్ర’ వంటి వాక్యాలు వాడికి తలలేదు, మెదడులేదు అనడానికి వాడుతారు. తెలంగాణలో ”పుర్రె”నే వ్యవహృతం. కొన్ని సందర్భాల్లో ”వాని తల్కాయల పెండవుంది. దమాక్ లేదు వానికి” అని కూడా అంటుంటారు. తెలంగాణ అంతటా సాధారణంగా ”తల”ను ”తలకాయ”అనే వ్యవహరిస్తారు. కారణం అది కాయలాగా ఉండటమే!
”అరచేతి”కి పై భాగంలో ఉన్న అంటే పృష్ఠ భాగాన ఉన్న శరీరభాగాన్ని తెలంగాణ ప్రాంతవాసులు ”మట్ట” అంటారు. ఈ అర్థంలో ఈ పదం నిఘంటువుల్లోనే లేదు. తల వెంట్రుకలు చిత్రంగా ఎంటికెలు, నెత్తెంటికెలు అయినై. ”వెంట్రుకలు” పదంలో వకారలోపం మొదటే జరిగి యింకా అనేక పరిణామాలతో ఎంటికెలు అయ్యింది. ”ఎంటికెలున్న కొప్పు ఎట్ల ముడిసినా అందమే” అనే సామెత ఉంది. ”వెన్నెముక” అనేది ”ఎన్నుబొక్క”గా మారింది. వెన్నుపూసలు ”ఎన్నుపూసలు” అయినై. గొంతుముందరిపక్క పోకలాగా ఉండే ఎముక అయిన గొంతుకపోక తెలంగాణలో ”బొండి క్కాయ”గా పిలువ బడుతుంది. కంఠాన్ని ”బొండిగె” అంటారు. శరీరంలోని ఎముకల్లో కొన్ని ”కంటెబొక్కలు, పక్కబొక్కలు” మొదలైనవి వున్నాయి.
తెలుగు భాషలోని కాలేయం అనే గ్రంథిని తెలంగాణలో ”కార్యం, కార్జం” అంటారు. ”కార్యం” అంటే నైఘంటికార్థం మాత్రం పని, వాతువు, శోభనం. తెలంగాణ ”కార్జం” నిఘంటువుల్లో ‘కారిజము, కార్జము” అనే రెండు రూపాల్లో ఉంది. తెలంగాణ ”కార్జం” మాటను ఆ తెలంగాణలోనే ”కలేజా” అని కూడా అంటారు. దీనికి అర్థము కాలేయం అనేకాక, దమ్మూ, ధైర్యం అనే అర్థాలు సైతం వున్నాయి. ”చెంపలు” మాత్రమే తెలంగాణాలో వుంటే ఇతర తెలుగు ప్రాంతాల్లో చెంపలతోపాటు లెంపలు, బుగ్గలు, చెక్కిళ్ళు ఉన్నాయి. కపోలాలు గ్రాంథికం. శరీర సంబంధ పదాల్లో ముఖ్యంగా తలను తెలంగాణలో తల అని మాత్రమేగాక తల్కాయ, నెత్తి అని కూడా వాడుతుంటారు. తల వెంట్రుకల్ని ”బాల్” అని కూడా అంటారు. ఎన్కటివాళ్ళు ఇప్పటికీ ”తానం చేసినవు గదా! బాల్ దూసుకో” (దువ్వుకో అనే అర్థంలో) అంటుంటారు. ఉదరముపై భాగాన్ని ”ఛాతీ” అంటారు.
నడుమును ”కమ్మర్” అని కూడా పలుకుతారు. భుజాల్ని జబ్బలు అనీ, ఎడమ చెయ్యిని ఎడమతోపాటు తొంట, రొడ్డ, పుర్ర చెయ్యి అనీ, కుడిచేతిని కుడితో సైతం బువ్వ చెయ్యి అనీ, తలమీది పిలకను పిల్క జుట్టు, జుట్టు అనీ, నోటిలోని పన్నును పన్నుతోపాటు పల్లు అనీ, కణతను ”కంత” అనీ, నుదురును నదుటితోపాటు నొసలు, నొష్ట అనీ, బొటనవ్రేలుని బొటిమెనేలు అనీ, కాలిలోని పెద్దవేలును పెద్దనేలు అనీ వ్యవహరిస్తారు. అసలు శరీరాన్నే మొత్తంగా ”చెత్త” అని భావించడం, సంభావించడం తెలంగాణ జానపదుల తాత్వికదృష్టికి తార్కాణం.
శ్రీ డా|| నలిమెల భాస్కర్