”రాజు లే…
చాలా పొద్దెక్కింది..
నిద్ర ఇంకా ఎంతసేపు?”
”..అబ్బా! అప్పుడేనా…
ఓ గంట తర్వాత లేస్తా!”
”రాజా ఆ చాటింగ్ ఆపి చదువుకో…”
”అప్పుడేనా ఇంకొంచెం సేపయిన
తర్వాత చదువుతాను లే…”
”అమ్మాయి! టిఫిన్ పెట్టాను తిను…”
”అమ్మా! 5 నిమిషాల తర్వాత తింటాను…”
”స్నానం చెయ్యి టైమ్ అవుతోంది…”
”తర్వాత చేస్తానులే…”
”టి.వి. ఆపేయ్ ఇంకా ఎంతసేపు చూస్తావ్…”
”సరే! 10 నిమిషాల తర్వాత ఆపేస్తాను”
”అరెరె(! మర్చిపోయాను రేపు ప్రాజెక్టు వర్క్ సబ్మిట్ చెయ్యాలి. ప్చ్!.. టైం ఎంతయ్యింది… 7 అయ్యిందా! ఇంకా చాలా సమయముందిలే… ఏడే కదా అయ్యింది…”
”ఏంటి పరీక్షలు వచ్చేవారం నుండా… ఒక వారం వుంది కదా! రేపటినుండి చదువు మొదలు పెడతాను.”
టీనేజ్‌లో వున్న పిల్లలు వున్న ఇంట్లో తప్పకుండా పై సంఘటనలు తరుచుగా జరుగుతునే వుంటాయి. తల్లిదండ్రులు సమయం దొరికిన ప్రతిసారి… పిల్లలను కోప్పడడం, వీలయితే తిట్టడం.. ఇంకా ముదిరితే కొట్టడం కూడా అప్పుడప్పుడు చేస్తూనే వుంటారు.
అయినా, కొంతమంది పిల్లలు ‘వాయిదాలు’ మాత్రం ఆపకుండా.. వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే వుంటారు.
చదవాల్సినవి, గుట్టలుగుట్టలుగా పేరుకొనిపోతూనే వుంటాయి. ఫలితంగా పరీక్షల్లో ఫెయిల్ కావడం లేదా కనీస మార్కులతో పాస్ కావడం జరుగుతుంది.
నిజానికి వాయిదా వేయడం అనేది బద్ధకంవల్ల, ఆసక్తి లేకపోవడం కారణంగా అనుకుంటారు చాలామంది.. కాని దానికి చాలా కారణాలుంటాయి.
దానిని వాయిదా వేస్తే ఆ పని/సమస్య దానంతట అదే పరిష్కారమౌతుందేమో!
పనిని ఎప్పుడన్న చెయ్యొచ్చు, అదెంత పని… చిటికెలో చేసేస్తాను…
పనిని తక్కువగా అంచనా వేయడం, తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకోవడం.
చాలా ఎక్కువ గంటలు ‘ఇంటర్‌నెట్ ఛాటింగ్, వీడియో గేమ్స్, సినిమాలు, వాట్సప్ మెసేజ్‌లు చెయ్యడం.
నేను అనుకుంటే వెంటనే ఈ పని చెయ్యగలను అనుకోవడం. తక్కువ మార్కులు వచ్చినా సరే! తెలివి తేటలు కదా ముఖ్యం అని మభ్యపెట్టుకోవడం.
అవసరమైనవి చదువుకోవడం, వ్రాయడం వదిలేసి.. పుస్తకాలు సర్ధటం… అనవసరమైన పనులను చేయడం
ఎక్కడికైనా ఊరికి వెళ్ళాల్సిన అవసరం వుంటే పుస్తకాలు కూడా తీసుకొని వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా పుస్తకాన్ని తెరచి చూసే ప్రయత్నం చేయకపోవడం,
చెయ్యాల్సిన హోమ్‌వర్క్ ఎంత వున్నా, తర్వాత చెద్దాంలే అనుకొని చెయ్యకపోవడం.
వాయిదాకు కారణాలు:
ఏకాగ్రత నిలుపుకోలేకపోవడం
సరైన మార్కులు రావేమోనని ఆందోళన
పరీక్షలను సరిగ్గా వ్రాయలేనేమోననె భయం
నెగెటివ్ భావనలు.
నేనెన్నటికీ అనుకున్నంత సక్సెస్ సాధించలేను అనే భావన
డబ్బుల సమస్యలు
స్నేహం, ప్రేమ సమస్యలు
విసుగు, చిరాకు
అవాస్తవిక లక్ష్యాలు
ఏ పనిచేసినా ‘పర్‌ఫెక్ట్’గా చెయ్యాలనే ఆలోచన
బాగా చెయ్యగలను అని అనిపించినప్పుడే చేస్తాను అని అనుకోవడం
చేస్తే ఫెయిల్ అవుతాననే భయం
పెద్దల పట్ల అంతర్గత ద్వేషం
‘వాయిదా’ నుండి బయటకు రావడానికి మార్గాలు:
వాయిదా వెయ్యడం నుండి బయటకు రావాలంటే ముందు ‘ఇది’ సమస్యగా గుర్తించడం, సమస్య అని గుర్తిస్తేనే పరిష్కారం కోసం కసరత్తు మొదలౌతుంది.
లక్ష్యాలను గుర్తించండి. వాయిదాలవల్ల లక్ష్యం సాధించడం కష్టం అవుతుందని తెలుస్తుంది. లక్ష్యాలు పెద్దగా వుంటే వాటిని చిన్న లక్ష్యంగా విడగొట్టితే, వాటిని పూర్తి చేయగలమని విశ్వాసం వస్తుంది.
ఉదా: రెండు రోజుల్లో ఒక ఛాప్టర్ పూర్తిచెయ్యాలి. అమ్మో! అనిపిస్తే వెంటనే, చదవగలిగే గంటలు ఎన్ని, చదవాల్సిన ప్రశ్న జవాబులు ఎన్నో తెలుసుకోవాలి.? చదవాల్సిన ప్రశ్నలు 8, చదువుకోసం ఉన్న సమయం 20 గంటలు. అంటె 2 1/2 గంటలకు ఒక జవాబు నేర్చుకోవాలి. అరె!! ఈజీగా నేర్చుకోగలను. అప్పుడు వెంటనే ఆత్మవిశ్వాసం వస్తుంది. చదివితే పని పూర్తి అవుతుందని అనిపిస్తుంది.
ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి, అనుకున్న పని చెయ్యాలి. సమర్థత ఉన్నదని నమ్మాలి. ముందుగా పనిని, చిన్న చిన్న పనులుగా విడగొట్టడం వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది.
సెల్‌ఫోన్ వల్ల, స్నేహితులవల్ల చెయ్యాల్సిన పని చెయ్యలేక పోతున్నామనిపిస్తే, ఎప్పుడూ మాట్లాడే స్నేహి తులకు, ”నేను గంటసేపు చదవాలనుకుంటున్నాను, తర్వాత మాట్లాడతాను’ అని మెసేజ్ పెట్టి సెల్‌ఫోన్ ఆఫ్‌చేసి, చదవడం మొదలుపెట్టాలి.
ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా సరే, వీడియోగేమ్, టి.వి., మొబైల్‌గేమ్ ఏవైనా అందుబాటులో లేకుండా చేసుకోవడం… లేదా! ఒక గంట చదివిన తర్వాత పైవన్నింటిని చేసిన పనికి రివార్డు లాగా ఉపయోగించు కోవడం మొదలుపెట్టాలి. 20 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఒక వీడియోగేమ్ 20 నిమిషాలు ఆడతాను. 5 గంటలు చదివినతర్వాత ఒక గంట సేపు టీవీ, వాట్సప్‌మెసేజ్ పంపుతాను, అని అనుకోవాలి.
ఏ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత చేద్దాం అని అనిపించగానే, లేదా ఇప్పుడే ఒక గంటసేపు చేస్తాను, నేను చెయ్యగలను, నేను ఇప్పుడు చెయ్యకుంటే నేనెప్పుడు చెయ్యలేను. ఇప్పుడు మొదలుపెడతాను కనీసం 45 నిమిషాలపాటు చదువుతాను అని చదవాలి. 45 నిమిషాల తర్వాత విరామం తీసుకోవాలి. ‘నేను చదవగలను. చదవడం నాకు ఉపయోగం, దానివల్ల నేను సంతోషంగా ఉండగలను’ అనుకోవాలి.
‘వాయిదా’లతో బాధపడే విద్యార్థులు ‘వాయిదా’ వెయ్యడాన్ని వాయిదా వెయ్యగలిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
డాక్టర్ సి. వీరేందర్