ప్రస్తుత ఆర్థిక మాంద్యం దృష్టిలో పెట్టుకుని తాము వాస్తవాలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ అనంతరం జవాబిస్తు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల కొన్ని శాఖలకు నిధుల కేటాయింపు తగ్గుతుందన్నారు. అయితే సంక్షేమ పథకాలకు మాత్రం తగ్గించలేదన్నారు. ఎఫ్‌ఆర్‌బియం అనుమతులకు లోబడే తాము రుణాలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. రైతుల అభ్యున్నతికై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు చేసిన అప్పులే కాకుండా అవసరమైతే మరిన్ని అప్పులు కూడా చేస్తామని కుండబద్దలు కొట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుకున్న స్థాయిలో నిధులు సమకూరే సూచనలు కనిపించడం లేదన్నారు. రాష్ట్రం ద్వారా కేంద్రానికి 2.7 లక్షల కోట్ల రూపాయలు వెళుతుంటే కేంద్ర నుంచి రాష్ట్రానికి రూ. 31వేల కోట్లు మాత్రమే వస్తున్నాయని తెలిపారు.
ఆర్థిక మాంద్యం వల్ల అనుకున్న స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరపలేక పోయామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరైన సహాయ సహకారాలు అందడం లేదన్నారు. అయినా సంక్షేమ రంగానికి ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉందని, కానీ గత అయిదు సంవత్సరాలలో మాత్రం అద్భుత మైన ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. తాము అమలు చేసిన ప్రజోపయోగ పథకాలన్నీ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. అన్ని రంగాల్లోనూ సమతుల అభివృద్ధిని సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర సంపద విలువ రూ. 8,65,688 కోట్లుగా నమోదు కావడం, స్వరాష్ట్రంగా మారిన తరువాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ధృఢంగా మారిందో తేల్చి చెబుతుందన్నారు. ప్రస్థుత సంవత్సరం మాంద్యం వల్ల కొంత కోత విధించక తప్పడం లేదన్నారు.
మొత్తంగా ఈ సారి 2019-20 సంవత్సరానికి గాను ప్రతిపాదిత వ్యయం రూ. 1,46,492,30 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఇందులో రెవిన్యూ వ్యయం 1,11,055.84 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 17,274.67 కోట్ల రూపాయలు, బడ్జెట్ అంచనాలలో మిగులు 2,044,08 కోట్లు కాగా ఆర్థిక లోటు 24,081.74 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనాగా ప్రాతిపాదించారు.
సభ్యులు చేసిన విమర్శలు, సూచనలపై స్పందిస్తు సీఎం అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యంకాదన్నారు. అప్పులు, పతారా ఉన్నవాళ్ళకే ఇస్తారని, అలాగే తెలంగాణకు అప్పులు కట్టే సమర్ధత ఉంది కాబట్టే అప్పులు పుడుతున్నాయన్నారు. తాము మూడు లక్షల కోట్లు అప్పులు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అది నిజం కాదన్నారు. ఫైనాన్స్ కార్పోరేషన్లకు పూచీకత్తు ఇచ్చి అప్పులు ఇప్పిస్తే అది ప్రభుత్వం చేసిన అప్పు ఎలా అవుతుందని సీఎం ప్రశ్నించారు. తాము రెండు లక్షల కోట్లు అప్పుచేస్తే, ఒకేసారి లక్షకోట్లు పెంచేసి 3 లక్షల కోట్లు అని చెబుతున్నారన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా గ్రామాలలో తాగునీరు, సాగునీరు సమకూరుస్తున్నామన్నారు. ఈ పథకాలను నీతిఆయోగ్ సభ్యులు కూడా ప్రశంసించా రన్నారు. ఈ పథకాలకు నిధులు సమకూర్చాలని ఆ సభ్యులు చెప్పినా కూడా కేంద్రం నిధులు ఇవ్వడంలేదన్నారు. అయినా తాము ఆ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికి 54లక్షల ఇండ్లకు మంచినీరు అందించామన్నారు. ఈ పథకాలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయన్నారు. అలాగే రైతుబీమా, రైతుబంధు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలో ఇప్పటికి ఏ రాష్ట్రం ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ తెలంగాణ పథకాలను తాము ఆదర్శంగా తీసుకున్నామని బాహాటంటానే చెప్పారన్నారు. గుంట భూమి ఉన్న రైతుకైనా రైతుబీమా వర్తింప చేశామన్నారు. ఏ రైతైనా చనిపోతే వారంలోపు అయిదులక్షల రూపాయలు వారి ఇంటికి తీసుకుపోయి ఇస్తున్నారన్నారు. అందుకే మాకు ప్రజల్లో ఇంతటి ఆదరణ వస్తుందన్నారు. 2014లో 63 సీట్లతో గెలిస్తే 2018లో ఈ సంఖ్య 89కి చేరిందన్నారు. తెలంగాణలో ఎన్నో పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని సీఎం తెలిపారు.
ఇక ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను తాము డైవర్ట్ చేయలేదని, అలాంటిది ఎదైనా ఉంటే తన దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ నిధులను ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీల పథకాలను, వారి అభ్యున్నతికే ఉపయోగిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించి ఇప్పుడు ట్రయల్‌రన్ నడుస్తున్నదన్నారు. అది పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభమయితే 40లక్షల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. జరుతుతున్న అభివృద్ధి కండ్లముందే ఉంటే ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని సీఎం ప్రశ్నించారు. తాము ఇన్ని సంవత్సరాల పాలనలో ఒక్క మంచిపని కూడా చేయలేదా అన్నారు. ప్రతిపక్షాలు మెచ్చుకుంటే ఇంకిత ఉస్సాహంతో పనిచేస్తామన్నారు. కానీ అలాంటి గొప్ప బుద్ధి ప్రతిపక్షాలకు లేదని సీఎం విమర్శించారు. ఇకనైనా రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రతిపక్ష నేతలకు సూచించారు.
రాబోయే పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం
రాబోయే పదేండ్ల కాలంలో తామే అధికారంలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశార. తాము చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు సభ్యులు సహకరించాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. బడ్జెట్‌పై చర్చను ముగిస్తు సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలోను, రాష్ట్రంలోను ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగానే ఉన్నా ఇచ్చిన హామీలన్నీ తీరుస్తున్నామన్నారు. లక్ష రుణమాఫీ విడతల వారీగా తీరుస్తామని, రైతులు తమ పంటరుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచిం చారు. ప్రస్థుతం మన సహజ వనరులైన నీరు, ఖనిజసంపద, వనరులు, సముద్రసంపద సరిగా వినియోగించుకోలేక పోతున్నామని తెలిపారు. అందుకై ఎన్నొ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తాము ప్రజలను నమ్ముకుని ఉన్నామని, పదవులను కాదన్నారు. అందుకే ప్రజలు మాపై ఎంతో నమ్మకముంచి గెలిపిస్తున్నారన్నారు. ప్రస్థుత పరిస్థితుల్లో తాము బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా కోత పడొచ్చన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశ్యంతోనే వాస్తవ బడ్జెను ప్రవేశపెట్టామన్నారు. ఎన్ని కష్టాలు ఎదురరైనా సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిరోజుల పాటు సజావుగా సాగాయి.
మూడు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. పలు అంశాలపై సభలో రసవత్తర చర్చ జరిగింది. స్పీకర్ సభను హుందాగా నడిపించారు. మున్సిపల్ పాలనా సంస్కరణల బిల్లు, కోర్టుల ఆర్థిక పరిధి పెంపు బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులను సభ ఆమోదించింది. బడ్జెట్ పద్దులపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయం గంటన్నర కేటాయించి పలువురు సభ్యులకు అవకాశం కల్పించారు. ఈ సమావేశాల్లో పలు కమిటీలు ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసీ) ఛైర్మన్‌గా ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రకటించారు. అలాగే అంచనాల కమిటీ ఛైర్మన్‌గా సోలిపేట రామలింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నియమిస్తూ స్పీకర్ సభలో ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.