టి. ఉడయవర్లు
tsmagazine
తొలి రోజులలో ఆకలితో అలమటించే మనిషిని, ఆ తర్వాత పనిపాటలతో పస్తులు లేకుండా బతికే మనిషిని, ఇప్పుడేమో మనిషిని కటాక్షించే దేవుణ్ణి వస్తువుగా చేసుకుని చిత్రాలు – శిల్పాలు రూపొందిస్తున్న సృజన్మాతక యువ కళాకారుడు – అప్పం రాఘవేంద్ర.

కృష్ణుడిని గీసినా, శివుణ్ణి చిత్రించినా, వినాయకుణ్ణి వేసినా, ఆంజనేయుడిని ఆవిష్కరించినా అప్పం రాఘవేంద్రది. తనదంటూ ఒకానొక బాణి. మనిషి కన్నా భిన్నమైన కొలతలతో, రంగులతో, రేఖలతో ఒక్క వాక్యంలో నయన మనోహరమైన, వైవిధ్యమైన రూపులతో ఆయా చిత్రాలు విచిత్రానుభూతిని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి ఆయన చిత్రాలు వింతగా తోస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏమైనా అవి పలువిధాలుగా ఉన్నా, సుందరం గా ఉంటాయి. అందుకే ఆయనను విచిత్ర చిత్రకారుడు అనవచ్చు.

రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన అప్పం భద్రయ్య, లక్ష్మమ్మల కుమారుడు అప్పం రాఘవేంద్ర కళాకారుడైన తండ్రి ప్రభావానికిలోనై నాలుగైదు తరగతులు చదువుతున్న బాల్యంలోనే బొమ్మలు వేయడం ప్రారంభించాడు. తండ్రి డాక్యుమెంట్లు వ్రాసే సివిల్‌ ప్లానర్‌ అయినప్పటికీ చిత్ర శిల్పకళలో ఎంతో ప్రావీణ్యంతో వినాయకుడు తదితర దేవతల విగ్రహాలు చేసేవాడు.
tsmagazine

చిత్ర శిల్పకళలో తండ్రి చూపే ప్రావీణ్యానికి ముగ్ధుడై అందులోని మెళకువలు చిరుప్రాయంలోనే ఒంటపట్టించుకున్నాడు. అమన్‌గల్‌లో ఇంటర్‌ మీడియట్‌ పూర్తి చేసేనాటికే డ్రాయింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు లోయర్‌, హయ్యర్‌ రెండింట్లోను ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఆలోచించకుండా జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన లలితకళల కళాశాలలో 1992లో చేరి 1997 నాటికి పెయింటింగ్‌లో బి.ఎఫ్‌.ఎ. పట్టా సాధించాడు.

ఈ లోపే తనకంటూ ఒకానొక చిత్రకళా విధానాన్ని రూపొందించుకునే క్రమంలో ఎన్నెన్నో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. 1995లోనే హైద రాబాద్‌లోని కళాభవన్‌లో మొట్టమొదటిసారి ”ఆకలి” అనే అంశంపై వ్యష్టి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి, పలువురు కళా హృదయుల ప్రశంసలు పొందాడు. మరోవంక డ్రాయింగ్‌లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేశాడు.

ఇది ఇట్లా ఉండగా ఆయన కుడ్య చిత్రలేఖనంలో ఎక్కువ కృషి చేశాడు. మస్కట్‌ వెళ్ళి నాలుగైదు కుడ్యచిత్రాలు రూపొందించి వచ్చాడు.

ఆ తర్వాత పెయింటింగ్‌లో అయితే కత్తి చేతబట్టి కమనీయ చిత్రాలు వేశాడు. శిల్పాలైతే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో ఉబ్బెత్తు రూపాలు చేయడంలో తన ముద్ర వేశాడు.

జల వర్ణాలతో గిరిజనులు, వారి జీవన శైలిపై పలు చిత్రాలు వేశాడు. ఇట్లా చిత్రకళా రంగంలో కృషి చేస్తూనే 2011లో జవహర్‌ లాల్‌ నెహ్రూ లలిత కళలు వాస్తు విశ్వవిద్యాలయంలో చేరి 2013 ఎంఎఫ్‌ఎ పూర్తి చేశాడు.

అనంతర కాలంలో ఒకసారి గిరిజనుల జీవితాలను ప్రతిబింబిస్తూ గీసిన చిత్రాల వ్యష్టి చిత్రకళా ప్రదర్శన నిర్వహించాడు. మరోసారి. కన్ను చూడదగిన దృశ్యం శీర్షికన పలు సృజనాత్మక చిత్రాలతో వ్యష్టి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ”భావ చిత్రాలు” శీర్షికన, ”మహిళా శీర్షికన”, ”ఏకదంత” శీర్షికన, ”ప్రకృతి” శీర్షికన ఆయన నిర్వహించి చూపిన కళా చాతుర్యానికి ఎందరో ముగ్ధులై ఆయన అభిమానులైపోయారు.
tsmagazine

కేవలం వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలకే పరిమితం కాకుండా 1993 నుండి హైదరాబాద్‌ నగరంలో పలు సంస్థలు నిర్వహించిన పది సమష్టి చిత్రకళా ప్రదర్శనలలోను ఆయన పాల్గొన్నాడు. అట్లాగే జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసిన టెర్రకోటా శిల్పాల శిబిరం మొదలుకొని ఆర్ట్‌ ఎట్‌ రెట్‌ ఆఫ్‌ తెలంగాణ, ప్రపంచ తెలుగు మహాసభలు 2017 సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రకళా శిబిరం దాకా ఏడెనిమిది చిత్ర కళాకారుల శిబిరాల్లో పాల్గొని చూడచక్కని కళాఖండాలు అక్కడికక్కడే రూపొందించాడు. హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో ఆయన పెయింటింగ్‌, స్కెచింగ్‌పై డెమాన్‌స్ట్రేషన్లు ఇస్తున్నాడు. కొంతకాలం హైదరాబాద్‌లోని వివేకానంద పాఠశాలలో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఆ తర్వాత యుఎస్‌ఎ గ్రీటింగ్‌ డాట్‌ కామ్‌లో ఇమెయిల్‌ గ్రీటింగ్‌ ఆర్టిస్ట్‌గా కొంత కాలం ఉన్నాడు.

ఎప్పటికప్పుడు సమకాలీన చిత్రకళారంగాన్ని దృష్టిలో ఉంచుకుని పాటుపడుతున్న అప్పం రాఘవేంద్ర వేసిన చిత్రాలకు అనేక సంస్థల నుంచి బహుమతులు కూడా లభించాయి. వాటిలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం 1992లో ఏర్పాటు చేసిన స్కెచింగ్‌ పోటీలో గెలుచుకున్న ప్రథమ బహుమతి, ఆ తర్వాత ఎన్‌కామ్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ వారు నిర్వహించిన డ్రాయింగ్‌ – పెయింటింగ్‌ పోటీల్లో సాధించిన ప్రథమ బహుమతి చెప్పుకోదగినవి. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు – 2015లో ఉత్తమ కళాకారుడుగా మండలస్థాయిలో ఆయనను సత్కరించడం, అదే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహించిన బతుకమ్మ చిత్రాల పోటీలోను ఈయన వేసిన చిత్రానికి ఉత్తమ చిత్రం బహుమతి వచ్చింది. శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు (తిరుపతి) వారు రాఘవేంద్రను ఉత్తమ చిత్ర కారుడుగా ఎంపిక చేశాడు.
tsmagazine

ఏది ఏమైనప్పటికీ 10I10 పరిమాణంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌లో ఆయన రూపొందించిన ”రాధాకృష్ణ”ను 5I3 ప్రమాణంలో ఉన్న ”బుద్దుడు” లోని పనితనం, పంచభూతాలతో కూడిన గణపతిని రూపకల్పన చేసిన పద్ధతి చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తోనే 20I4 పరిమాణంలో ఆయన తయారు చేసిన ”ఎడ్లబండి” కళా హృదయులను అనుభూతి తీరాలకు చేర్చుతుంది. జొన్నచేను, కర్రలు, వడిసెల తీరుతెన్నులు ప్రస్తుతించదగినవి.

వినాయకుడిని వివిధ రూపాల్లో ఎంతో వైవిధ్యంగా ముఫ్పైదాకా చిత్రాల్లో చూపారు. ఆర్కాలిక్‌లతో, నైఫ్‌ టెక్నిక్‌తో ఆయన మంచి ఫలితాలు సాధించాడు. మహిళలను ముఖ్యంగా బతుకమ్మ ఆడే మహిళలను, ముచ్చట్లాడే మహిళలను ఆయన ఎంతో వైవిధ్యంగా ఇరవై పై చిలుకు తైలవర్ణ చిత్రాల్లో శివుడు రాముడిని, హనుమంతుడిని, విష్ణువును, వినాయకుడిని, ఏ పౌరాణిక చిత్రాన్నైనా వేసే తీరు వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఇవ్వాళ్ళ రాఘవేంద్ర ఏ చిత్రం గీసినా, ఏ శిల్పం చెక్కినా చిత్ర కారుడుగా తన శక్తియుక్తులను ఆయన వాటిలో రంగరిస్తాడు.

ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని కాపాడమని కోరుతూ వేసిన చిత్రం, గెలుపు గుర్రాలపై వేసిన చిత్రం రాజకుమారుడు శీర్షికన వేసిన చిత్రాల్లో ఆయన ముద్ర ప్రస్ఫుటంగా కన్పిస్తుంది.

tsmagazine

Other Updates