”చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతిలోకి రాష్ట్రప్రజలను నడిపిస్తున్నాం” అని తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఐదవ బడ్జెట్‌ ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్‌ చేసిన ప్రసంగానికి రాష్ట్ర బడ్జెట్‌ అద్దం పట్టింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రతిబింబిస్తూ, 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్‌ రూ.1,74,453.84 కోట్లు గా ప్రతిపాదించారు. అందులో ప్రగతి పద్దు రూ.1,04,757.90 కోట్లు, నిర్వహణ పద్దు రూ.69,695.94 కోట్లుగాను పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత పరిస్థిని గమనిస్తే, ఆర్థిక పురోగతి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. స్వరాష్ట్రం సాధించుకున్నతర్వాత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయప్రగతి సాధించాం. జి.డి.పి వృద్ధిరేటులో జాతీయ సగటును అధిగమించ గలిగాం. రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా మెరుగుపడింది. 2016-17 సంవత్సరంలో 1,54,734 రూపాయలుగా వున్న తలసరి ఆదాయం 2017-18 సంవత్సరంలో 1, 75, 534 రూపాయలుగా ఉంటుందని అంచనా. గత సంవత్సరంతో పోలిస్తే ఈ వృద్ధిరేటు 13.4 శాతంగా వుంది. ఇది జాతీయ వృద్ధిరేటు అయిన 8.6 శాతంతో పోల్చితే ఎంతో ఎక్కువ.

ఎప్పటిలాగానే, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేవిధంగా వ్యవసాయం, సాగునీటి రంగాలకు ఈ బడ్జెట్‌ లో భారీ కేటాయింపులు చేశారు. నీటిపారుదల రంగానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది నుంచి రైతులకు కొత్తగా అందిస్తున్న పంటపెట్టుబడి పథకానికి ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది.

బడ్జెట్‌ సమావేశాలలోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మరికొన్ని వరాలను కూడా ప్రకటించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల క్రింద చెల్లిస్తున్న మొత్తాన్ని లక్షా నూటపదహారు రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంటి మహాలక్ష్మిగా భావించే ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కారాదన్న ఉద్ధేశ్యంతో దేశంలోనే తొలి సారిగా మన రాష్ట్రప్రభుత్వం ఈ పథకాన్ని 2014 అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రారంభంలో 51,000 రూపాయలు అందించేవారు. ప్రభుత్వం ఆ మొత్తాన్ని 75,116 రూపాయలకు, తిరిగి ఇప్పుడు లక్షా నూటపదహారు రూపాయలకు హెచ్చించింది. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనకు ఎల్లెడలా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులపై కూడా ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. తాటిచెట్లపై పన్నువిధానాన్ని రద్దుచేయడం, పెన్షన్‌ సౌకర్యం, హైదరాబాద్‌ నగరంలో గౌడభవనం నిర్మాణం తదితర వరాలు ఆ వర్గాల ప్రజలలో ఆనందాన్ని నింపాయి.

ఏ రంగాన్ని విస్మరించక, ఏ ఒక్క వర్గాన్ని తక్కువగా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందించాలనే ఆశయంతో, బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్‌ సర్వజన ఆమోదాన్ని పొందుతోంది.

Other Updates