అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలనే ఉద్దేశ్యంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, పరిపాలనా విభాగాలు వికేంద్రీకరించుకున్నామని, వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రగతిభవన్‌లో డిసెంబర్ 14న కలెక్టర్ల సదస్సు జరిగింది. సీఎం కేసీఆర్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘అనేక భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అనేక కార్యక్రమాలు చేపట్టాయి. అయినా సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉన్నట్లు వుంది. లోపం ఎక్కడుందో గుర్తించాలి. ప్రజలకు నిజంగా ఏమి కావాలో తెలుసుకోవాలి. పరిష్కారాలు వెతకాలి. ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలి’ అన్నారు. ‘ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు ఇవ్వడంకోసం మాత్రమే అనే అభిప్రాయం వుంది. కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావు. మంచి పాలసీలు, పథకాలు రావాలి. అవి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. ‘టీఎస్ ఐపాస్’ చట్టం తేవడంవల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా వచ్చింది. 2500 పరిశ్రమలు వచ్చాయి. ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు గొప్పగా పునరుద్ధరించుకొంటున్నాం. ‘హరితహారం’ద్వారా పచ్చదనం పెంచుకుంటున్నాం. పేకాటను అరికట్టగలిగాం. గుడుంబా తయారీ మానేసిన మహిళలకు ఉపాధి చూపించాలి. సంక్షేమరంగంలో నెంబర్ వన్‌గా నిలిచాం. 30వేల కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నాం. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురాచారాలను రూపుమాపడంలో మనం విజయవంతమయ్యాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలి’ అని సీఎం చెప్పారు.
‘పరిపాలన సమర్థవంతంగా సాగడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. మూడు నాలుగు లక్షల కుటుంబాలకు ఓ జిల్లా వుంది. కలెక్టర్లు, ఎస్పీల దగ్గర అన్ని వివరాలు ఉండాలి. పాలన మరింత బాగా సాగాలి. మూస పద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలి. నో యువర్ డిస్ట్రిక్ట్-ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్, ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక వుండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్బన్, రూరల్, వ్యవసాయ, పారిశ్రామిక గనుల పరంగా జిల్లాలవారీగా ప్రాధాన్యాలు మారుతాయి. దాన్నిబట్టి ప్లాన్ వేయాలి. ఇలా ప్రతీ జిల్లా జరుగాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘మిషన్ కాకతీయ బాగా జరుగుతోంది. మంచి వర్షాలవల్ల జలకళ ఉట్టి పడుతోంది. చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మిషన్ భగీరథ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర పేదలకోసం అమలు చేసే కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాలి. గతంలో అసైన్డ్ చేసిన భూములు ఏ స్థితిలో ఉన్నాయో చూడాలి. అవి ఉపయోగంలోకి వచ్చే కార్యాచరణ రూపొందించాలి. జాతీయ రహదారులు పెద్దఎత్తున మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలి. భూసేకరణ జరపాలి. ప్రాజక్టులకు అవసరమైన భూమిని సేకరించాలి’ అని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీమానిటైజేషన్ ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే మనపైనా వుంది. నగదు రహిత లావాదేవీల వైపు మనం పోవాల్సిందే. సిద్ధిపేటలో నగదు రహిత లావాదేవీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఇలాగే జరుగాలి. బ్యాంకు లావాదేవీలు ఆన్‌లైన్ వినియోగం, మొబైల్ యాప్‌ల వినియోగం పెరగాలి. అన్నివర్గాలకు అవగాహన కల్పించాలి. ప్రజలను చైతన్యపరచాలి. బ్యాంకులు కూడా స్వైప్ మిషన్లు అందుబాటులోకి తేవాల్సి వుంది.నేను బ్యాంకర్లతో మాట్లాడుతున్నాను. మీరు కూడా బ్యాంకర్లతో సమావేశాలు పెట్టుకుని అవసరమైన నేపథ్యం ఏర్పాటు చేయాలి. అంతిమంగా తెలంగాణను ‘క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ స్టేట్’గా మార్చాలి. కలెక్టర్లు పోటీపడి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘జిల్లా పరిధి తగ్గింది. కాబట్టి పర్యవేక్షణ పెరగాలి. ప్రభుత్వం ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలి. ప్రతీ బెడ్‌కు రూ. 5వేలకు పైగా నెలనెలా నిర్వహణ ఖర్చు ఇస్తున్నాం. బెడ్‌షీట్స్, బెడ్స్ మారుస్తున్నాం. మందుల కొనుగోలు బడ్జెట్ రెట్టింపు చేశాం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలి. కలెక్టర్లు పర్యవేక్షించాలి’ అని సీఎం చెప్పారు.
‘సాదా బైనామాలను ఉచితంగానే రిజిస్టర్ చేయించాలని విధానం తెచ్చాం. హైదరాబాద్ హెచ్‌ఎండీఏ, వరంగల్ ‘కుడా’ పరిధిలోని వ్యవసాయ భూముల సాదా బైనామాలను ఆమోదించడానికి అనుమతి ఇస్తున్నాం’ అని సీఎం ప్రకటించారు.
‘గ్రామాల్లో స్మశానవాటికలు నిర్మించాలి. ముస్లింలు, క్రిస్టియన్‌లు ఎక్కువగా ఉండేచోట ఖనన వాటికలు (బరేల్ గ్రౌండ్స్) నిర్మించాలి. నరేగా నిధులతో ఈ పనులు చేయవచ్చు. స్మశాన వాటికలు నిర్మించడం పుణ్యకార్యం. దాతలనుండి విరాళాలు సేకరించండి. సీఎస్‌ఆర్ పథకం వినియోగించు కోవాలి. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలను అడగాలి, వారి సహకారం తీసుకోవాలి. స్మశాన వాటికల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకోవాలి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా జరగాలి. ప్రతీ గ్రామంలో, పట్టణంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి’ అని సీఎం సూచించారు.
కలెక్టర్లకు నిధులు
ప్రతి జిల్లా కలెక్టర్‌వద్ద రూ. 3 కోట్ల నిధులు పెడతాం. అత్యవసరమైనవని వారి దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఈ నిధులు ఖర్చు చేసే విచక్షణాధికా రం ఇస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫండ్‌ను, ఎంపీల సీడీఎఫ్‌ను కూడా ఉపయోగించుకోవాలి. హాస్టళ్లు, ఆసుపత్రుల కనీస వసతులపై దృష్టి పెట్టాలి’ అని సీఎం అన్నారు.
‘తెలంగాణకు హరితహారం చాలా ముఖ్యమైన కార్యక్రమం. గ్రీన్ కవర్ పెంచాలి. సహజంగా పెరిగిన అడవులను నరకడంవల్ల వాతావరణ అసమతౌల్యం ఏర్పడింది. కాబట్టి 33 శాతం అడవులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలి. నర్సరీల పరిస్థితి సమీక్షించాలి. నర్సరీలు సందర్శించాలి. పెట్టిన మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలి. నేషనల్ హైవేస్‌పై విధిగా మొక్కలు పెంచేలా వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడాలి. మొక్కల పెంపకానికి నరేగా నిధులు వాడాలి. సామాజిక వనాలు పెంచడంతోపాటు అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలి’ అని సీఎం చెప్పారు.
‘గ్రీవెన్స్ డే మొక్కుబడిగా సాగవద్దు. వినతుల పరిష్కారం కావాలి. దీనిపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో పెద్దఎత్తున గోదాముల నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా మెరుగైంది. ‘షీ టీమ్స్’ బాగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేశాం. జిల్లాల్లో కూడా ‘షీటీమ్స్’ను ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ అరికట్టాలి’ అని కేసీఆర్ సూచించారు.
‘కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు ఒక టీమ్‌గా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సమైక్యంగా పనిచేసి ప్రజలకు మేలైన సేవలందించాలి’ అని సీఎం చెప్పారు.
జిల్లాల్లో అవసరాలు గుర్తించండి
నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ గైడ్ లైన్స్ బుక్‌లెట్, సీడీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.కలెక్టర్లు గత రెండు నెలలుగా ఎదుర్కొన్న అనుభవాలను ఒక్కొక్కరుగా వివరించారు.
‘రాష్ట్రాన్ని ఆయా ప్రాంతాల్లోని భూమి స్వరూపం, స్వభావాన్ని బట్టి క్రాప్ కాలనీలుగా మార్చాలి. భూమి రకం, వాతావరణం, వర్షపాతం ఆధారంగా ఆ భూములు ఏ పంటకు అనుకూలమో నిర్దారించాలి. భూసార పరీక్షలు నిర్వహించాలి. నగర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భూముల్లో వ్యవసాయం ఎలా వుండాలి? మైక్రో ఇరిగేషన్ విస్తరణ.. తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి’ అని సీఎం చెప్పారు.
‘బడ్జెట్ రూపకల్పనలో జిల్లా ప్రణాళికలు చాలా ముఖ్యం. జిల్లాల ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలి’ అని సీఎం చెప్పారు.
‘ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పౌష్టికాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారు. ప్రజలకు ఆహారపు అలవాట్లపట్ల అవగాహన కల్పించడానికి సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి’ అని సీఎం సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతివల్ల కలిగే ప్రయోజనాలను హెల్త్ కమిషనర్ కరుణ వివరించారు.
‘తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతికోసం పరికరాలు ఉన్నందున ఎక్కువ డెలివరీలు అక్కడే జరుగాలి. పేదలకు ఇదెంతో ఉపయోగకరం. ఆసుపత్రిలో చనిపోయిన వారికోసం మృతదేహాల తరలింపు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సరిగ్గా ఉపయోగించు కోవాలి’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
‘అవసరం లేకున్నా డెలివరీల కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారు. దీన్ని నివారించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతికి ప్రాధాన్యమివ్వాలి. ప్రజల్లో అవగాహనకోసం ప్రచారం నిర్వహించాలి’ అని సీఎం చెప్పారు.
‘చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది వంద కోట్లు ఇచ్చాం. నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపల పెంపకంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు.
‘పాఠశాలల్లో కూలిపోయే దశలో వున్న తరగతి గదులకు వెంటనే రిపేర్ చేయాలి. అన్ని బడుల్లో టాయిలెట్లు నిర్మించాలి’ అని సీఎం ఆదేశించారు.
‘గద్వాల జిల్లాలో బాల కార్మికులు, బాల్య వివాహాలు ఎక్కువ.వీటి నివారణకు అధికారులు చొరవ చూపాలి’.
మరిన్ని నిర్ణయాలు
సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, కోర్టుల సముదాయం నిర్మించడానికి అనువైన స్థలాలు గుర్తించాలి.
జిల్లాల్లో మానవ వనరులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి. మొబైల్ యాప్‌లు వినియోగించే పద్ధతులు నేర్పాలి.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున భవనాల నిర్మాణం కోసం స్థలం గుర్తించాలి.
సాదా బైనామాలను ఆమోదించి, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే విషయంలో కఠినంగావున్న నిబంధనలు తొలగించాలి. కాయితాలపై జరిగిన క్రయ, విక్రయాల ఆధారంగా వ్యవసాయ భూములు రెగ్యులరైజ్ చేసి, పేరు మార్పిడి చేయాలి.
ఎరువులు, విత్తనాలు నకిలీవి, కల్తీవి అమ్మే వారిపై పీడీ యాక్టు ప్రయోగించాలి. ఆహార పదార్థాల కల్తీ నూటికి నూరు శాతం ఆగిపోవాలి. ఈ విషయంలో స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి, దోషులను పట్టుకోవాలి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోవున్న ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టాలి.
ఎస్టీ, ఎస్సీ జనాభా 50శాతానికిపైగా మహబూబాబాద్ జిల్లాలో ఆసుపత్రులు, వైద్యం మెరుగుదలకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో గర్భసంచుల తొలగింపు ఆపరేషన్లు ఎక్కువ జరుగుతున్నాయి. అవసరం లేకున్నా జరిగే ఆపరేషన్లు ఆపాలి. చైతన్యం కలిగించాలి.
అవసరం లేకున్నా వివిధ రకాల ఆపరేషన్లు చేసే దందా చాలాసార్లు జరుగుతున్నది. దీనిని అరికట్టడానికి కఠినమైన వైఖరి తీసుకోవాలి. కేబినెట్ సబ్ కమిటీ వేసి విధి విధానాలు రూపొందించాలి.
మారుమూల ప్రాంతాలు, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు వేతనం (అలవెన్సు) ఇవ్వాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువున్న జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇలాంటి ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలి.
వరంగల్ రూరల్ జిల్లా గూడెప్పాడ్‌లో కూరగాయల మార్కెట్, నర్సంపేటలో మిర్చి రీసెర్చి సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలి.
కాళేేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎస్సార్సీపీ కాలువల మరమ్మత్తులు పూర్తి చేయాలి
వరంగల్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి. హైదరాబాద్ మాదిరిగా వరంగల్ అడ్డదిడ్డంగా పెరగవద్దు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. అనేక విద్యాలయాలు పెడుతున్నాం. నగరంకోసం మంచి ప్లానింగ్ వేయాలి. రింగురోడ్డు నిర్మించుకుందాం. రూ. 300 కోట్లు మంజూరు చేశాం. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. సెంట్రల్ జైలు, కేఎంసీని కలుపుకుని హెల్త్ యూనివర్సిటీ నిర్మించాలి. హెరిటేజ్, అమృత, స్మార్ట్ సిటీలుగా ఎంపికైనందున అన్ని నిధులు కలిపి మంచి ప్లాన్‌తో ఖర్చు చేయాలి. వరంగల్‌లో శాస్త్రీయ పద్ధతిలో కూరగాయల, మాంసం మార్కెట్లు నిర్మించాలి. కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి. అన్ని కార్పొరేషన్లలో ఇదే విధంగా లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిచాం. వరంగల్ సీకేఎం, మెటర్నిటీ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలి. మమునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకోసం కేంద్రంపై వత్తిడి తెస్తాం అని ముఖ్యమంత్రి తెలిపారు.
సమావేశం ముగింపులోకూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులకు పలు సూచనాలు చేశారు.
పదకొండుగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశం.. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం ఇది మొదటిసారి జరిగిన మీటింగ్.. ఒక అవగాహనకోసం కలిశాం. భవిష్యత్తులో ఇటువంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయి’. – సీఎం
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేద్దాం.రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ కవర్ అభివృద్ధి చేయాలే.
రెసిడెన్షియల్ పాఠశాలల పర్యవేక్షణలో కలెక్టర్ల భాగ స్వామ్యం కావాలి. పాఠశాలల్లో వీలునుబట్టి రాత్రి నిద్రలు చేయడం ద్వారా విద్యార్థుల సమస్యలను తెలుసుకోండి.
విద్యుత్, పరిశ్రమల రంగాలలో రాష్ట్రానికి దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చినయి.
చాలా జిల్లాల్లో యువ అధికారులుగా వున్నారు. అతిపిన్న వయస్సులోనే కలెక్టర్లుగా అవకాశం వచ్చింది. అటువంటి అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మీరు కృతజ్ఞతతో వ్యవహరించాలె.
కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కలెక్టర్ల బలమే రాష్ట్రానికి బలం.
అవసరమని భావించిన సందర్భాల్లో మీ విచక్షణాధికారాన్ని పాలనాధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయండి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇంటి ముంగిటికి పాలన రావడంద్వారా ప్రతీ వ్యక్తి తానే కలెక్టర్ అయినట్లు భావిస్తున్నారు.
డిమానిటైజేషన్ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల దిశగా ప్రజలను సమాయత్తం చేయండి.
మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన విలువలతోకూడిన రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం.