దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ నాల్ళుగేళ్ళ క్రితం ఆవిర్భవించింది. రాష్ట్ర నాల్గవ అవతరణోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. నాలుగేళ్ళ కాలం చరిత్రలో అనల్పమైనప్పటికీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం.రాష్ట్రం వయసు రీత్యా చిన్నదే కావచ్చు. కానీ, రాష్ట్రం ఏర్పడిన నాడు వున్న అస్థవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది , దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగించడం, ఏక్కడా లేని, ఎవరూ ఉహించని పథకాలకు రూపకల్పనచేసి, వాటిని దిగ్విజయంగా అమలుచేయడం, ఆ పథకాలు దేశానికే ఆదర్శప్రాయం కావడం చిన్న విషయం కాదు.
ప్రజలే లక్ష్యంగా, వారి సమస్యలే ప్రాతిపదికగా పథకాల రూపకల్పన, ఆ పథకాలను తు.చ తప్పక పాటించే నిజాయితీ, సాధించే కార్యదక్షత ఏ ప్రభుత్వానికైనా జన సామాన్యంలో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడతాయి.పాలకుల ప్రతిమాట, ప్రతికదలిక, గుండె చప్పుడూ ప్రజలే అయినప్పడు ఆ ప్రభుత్వాలను కూడా ప్రజలు గుండెల్లోనే పెట్టుకొని ఆరాధించడం సహజం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే.
ప్రజల నాడి మాత్రమేకాదు, వారి సమస్యలు సయితం తెలిసిన ఉద్యమ నాయకుడు
కె. చంద్రశేఖరరావు పాలకుడు కావడం, పరిపాలనాదక్షుడుగా ఎదగటం తెలంగాణ ప్రజలకు కలసివచ్చిన వరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత పరిస్థితిని గమనిస్తే సాధించిన పురోగతి కళ్లకు కట్టినట్టు కనుపిస్తుంది. విధానాల రూపకల్పనలో, ప్రజాహిత కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన గుణాత్మకమైన మార్పువల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఏ రంగాన్నీ విస్మరించకుండా, ఏ ఒక్కవర్గం నిరాదరణకు గురికాకుండా, అభివద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రథం పరుగులు తీస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో అంథకారంలో, విద్యుత్ కోతలతో అలమటించిన ఎవరైనా, ప్రత్యేక రాష్ట్రంలో కేవలం ఆరు మాసాల్లోనే కరెంటు కష్టాలనుంచి గట్టెక్కుతామని, అసలు కోతలేలేని నిరంతర విద్యుత్ రైతులతోసహా అన్ని వర్గాలవారికీ అందుబాటులోకి వస్తుందని ఊహించారా.
కాయకష్టంచేస్తేనేగానీ కుటుంబం గడవని నిండుగర్భిణికి ఇట్లోనే విశ్రాంతినిచ్చి, అవసరమైన మందులిచ్చి, పోషకాహారం అందించి, నష్టపోయిన కూలిడబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, హాస్టళ్ళలో ముతక బియ్యం తినలేక బడిమానేస్తున్న నిరుపేద బాలబాలికలకు సన్నబియ్యం బువ్వ వండివారుస్తారని, ప్రాథమిక విద్యనుంచి ఉన్నతస్థాయి విదేశీవిద్యవరకూ ప్రభుత్వం వెన్నుదట్టి ప్రోత్సహిస్తుందని ఎవరిమైనా కలగన్నామా.
కళ్ళముందే నదులు ప్రవహిస్తున్నా సాగునీరు అందక, పంటపొలాలు బీళ్ళుగా మారి పంట పండక అన్నదాతే పస్తులుండి, ఉరికొయ్యలను ఆశ్రయించిన దుర్దశనుంచి రైతు బతికి బట్టకడతాడని ఎంతమంది ఊహించారు. నేడు కోటిఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో పరుగులు తీస్తున్న ప్రాజెక్టులు ఒక వైపు, రైతుచేతికే పెట్టుబడి అందించే రైతుబంధు పథకం, రైతు కుటుంబానికి కూడా భరోసా ఇచ్చే రూ. 5 లక్షల బీమాపథకం మరోవైపు రైతును రాజును చేస్తున్నాయి. గ్రామసీమలపై ఆధారపడి జీవించే అన్నివర్గాలవారికీ అందుబాటులోకి వచ్చిన సంక్షేమ పథకాలు, అభివద్ధి ఫలాలు రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చివేస్తున్నాయి. ఒకటా, రెండా… ప్రజలు కోరినవేకాదు, ఎవరూ అడగకపోయినా ప్రభుత్వం మానవతా కోణంతో ప్రవేశపెట్టిన పథకాలను వాటిద్వారా లబ్ధిపొందుతున్నవారు ఎలామరచిపోతారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి వయసు ఉడిగి, శరీరం అలసి పనిచేయలేని స్థితిలో వున్న నేతకార్మికుని వరకూ ప్రభుత్వ సాయం పొందని వ్యక్తులు ఏవరూ లేరనడంలో అతిశయోక్తి ఏముంది.
అందుకే, ఈనాడు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో సంబురాలు జరుగు తున్నాయి. స్వరాష్ట్రంలో సాధించిన, సాధిస్తున్న విజయాలలో తామూ పాత్రధారుల మవుతున్నందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ శుభ వేళ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును రాష్ట్ర ప్రజానీకం విజయీభవ అని దీవిస్తున్నారు.