శ్రీ డాక్టర్ సి.వీరేందర్
సంతోష్ ‘టెట్’ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. తీవ్రమైన నిరాశతో నాదగ్గరకొచ్చాడు. ”నేను బాగా కష్టపడి చదివాను, ఎన్నో ప్రశ్నలను సాధన చేశాను. అయినా నాకు ఫలితం రాలేదు, ఇంతే సార్, నాకు దేంట్లోను అదృష్ఠం లేదు… ఎక్కువ చదవకూడదు, అనవసరంగా ఎక్కువ చదివి టైమ్ వేస్ట్ వేసుకున్నాను. ఇహ నుంచి ఏ పరీక్షకు కూడా ఎక్కువ కష్టపడి చదవను… ఎలాగూ రానిదాని కోసం ఎందుకు సార్ కష్టపడడం…” బాధలో, దుఃఖంతో మాట్లాడాడు.
ఇలా ఎంతో మంది విద్యార్థులు రకరకాల పోటీ పరీక్షల్లో అనుకున్నన్ని మార్కులు రానప్పుడు తప్పకుండా పై విధంగానే స్పందిస్తున్నారంటే, వారి ఆలోచనల్లో, ప్రిపరేషన్‌లో లోపాలు జరిగాయన్న మాట…
ఒకాయన వాళ్ళబ్బాయితో, వేగంగా నడవాలంటే కాలు చాలా పైకి ఎత్తి క్రిందకు వేస్తే అప్పుడు వేగంగా నడవగలవు అన్నాడట. అలాగే అని అబ్బాయి తండ్రి చెప్పినట్టుగా కాలు కదపడం మొదలెట్టాడు. వీడు ఎంత దూరం వెళ్ళాడో చూద్దాం అని తండ్రి వచ్చి చూస్తే ఏముంది… అక్కడే నిలబడి ‘కదమ్‌తాల్’ చేస్తున్నాడు. ఒక్కోసారి మనం పడే కష్టం, చేసే పని, అర్థం చేసుకునే విధానం కూడా ఇలానే వుంటుంది.
పరీక్షల్లో ఉత్తీర్ణత కాని వారు, అనుకున్నన్ని మార్కులు సాధించని వారు చెప్పుకోవలసిన మంత్రం ‘నేను ప్రిపేర్ అయినది పరీక్షకు సరిపోలేదు కాబట్టి ఈ సారి నిపుణుల సలహా తీసుకుని పరీక్షకు సరిపోయే విధంగా సిద్ధమవుతాను, విజయం సాధిస్తాను’ అనుకోవాలి. పోటీ పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థులు ముందుగా పరీక్షను, పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారో, ఎందుకు ఇలా ఇస్తారో అర్థం చేసుకోవాలి. విద్యార్థుల నుండి పరీక్ష ఏమి ఆశిస్తుందో’ ఎలాంటి లక్షణాలను కోరుకుని ఈ పరీక్ష నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడు దానికి అనుగుణంగా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ క్రింది దశలను అర్థం చేసుకోవాలి.
1.లర్నింగ్ ఫేజ్, 2.రిటైనింగ్ ఫేజ్, 3. స్ట్రెంథెనింగ్ ఫేజ్, 4. ఫినిషింగ్ ఫేజ్
లర్నింగ్ ఫేజ్ (నేర్చుకునే దశ):
పరీక్ష సిలబస్ ప్రకారం పుస్తకాలు చదవాలి. ప్రతి అంశాన్ని కూలం కషంగా చదవాలి. ‘సిలబస్ అయిపోవాలి, వెంటవెంటనే అయిపో వాలి’ అనే ఆలోచన కన్నా… ‘చదివిన దాంట్లో చాలా లోతుగా చదవాలి, దీని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి’ అనుకొని చదవాలి. మొదటి సారి ఎప్పుడు చదివినా నింపాదిగా ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకుంటూ చదవాలి. చదివిన తర్వాత, ఈ అంశానికి సంబంధించిన సమస్యలను, ఆబ్జెక్ట్ ప్రశ్నలను సాధించాలి. సాధించిన తర్వాత సమస్య స్థాయిలను నిర్ణయించే దిశలో చదవండి, తర్వాత ప్రశ్నల స్థాయిని ఈ క్రింది విధంగా విభజించండి.
సులభం, కఠినం, అతి కఠినం
వీటిని అర్థం చేసుకున్న తర్వాత కఠినం ప్రశ్నలు పరిష్కరించాలంటే మీకు ఉండాల్సిన నైపుణ్యాలు ఏమిటో తెలుసుకోవాలి. అతి కఠిన ప్రశ్నలు పరిష్కరించాలంటే ఉండాల్సిన విజ్ఞానం, సమాచారం ఎంతో తెలుసుకోవాలి, అప్పుడు మన ప్రిపరేషన్ ఆ దిశలో కొనసాగించాలి. అర్థం కాని పక్షంలో తప్పకుండా అధ్యాపకుని సంప్రదించాలి. మనం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కోసం అడగాలి. నైపుణ్యం నేర్చుకున్న తర్వాత మన ప్రిపరేషన్ కొనసాగాలి.
రిటైనింగ్ ఫేజ్ :
సులభం, కఠినం, అతి కఠినం విభజన అయిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయకుండా, నైపుణ్యం, సమాచారం నేర్చుకున్న తర్వాత వాటిని సాథన చేయండి. ‘పరీక్షల్లో ఇంత ‘టఫ్’ ప్రశ్నలు అడగరు, ఇలాంటివి చదవాల్సిన అవసరం లేదు. ఇలా ఉచిత సలహాలు ఇచ్చి తప్పుదోవ పట్టించేవారుంటారు. వారిని పట్టించుకోకుండా ప్రిపరేషన్ కొన సాగించాలి. ఈ దశ చాలాముఖ్యమైనది. అన్ని తెలుస్తుంటాయి. కాని శ్రమించ డానికి మనస్సు ఒక్కసారి మొరాయి స్తుంది. మనలో మనం ప్రతికూల సంకేతాలు ఇచ్చుకోవాలి. అప్పుు డు మళ్ళీ పని చేయడం మొదలౌతుంది. చదివిన ప్రతి అంశానికి ఛాయిస్ ప్రశ్నలను సాధన చేయాలి. చదివిన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సాధించిన తర్వాత సమాధానాలు చూసుకుని, ఎందుకు తప్పులు పోయాయో తెలుసుకోవాలి, జ్ఞాపకశక్తి సమస్యనా? లేదా అర్థం చేసుకోవడంలో తప్పు చేశారా? అస్సలు ఆ జవాబు ఏమిటో తెలియకుండా ఊహించి పెట్టావా తెలుసుకొని’ ఆ ప్రశ్నలు మళ్ళీ చదవాలి. ఇలా ప్రతి రోజు కొన్ని వందల ప్రశ్నలు సాధించడం వలన వేగం పెరుగుతుంది. ఖచ్చితత్వం వస్తుంది. తప్పులను అంగీకరించడం జరుగుతుంది. కూర్చుని చాలా సేపు పనిచేసే లక్షణం పెరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏకాగ్రత లభిస్తుంది. శరీరం అన్ని గంటలు తదేకంగా ప్రశ్నలు సాధించడం కోసం సహకరిస్తుంది.
నిరంతరం శ్రమించడం, శ్రమించిన దానిని వ్యక్తీకరించడం, ఎంత బాగా చేస్తున్నామో తెలుసుకోవడం, అనుకున్నంత సాధించడానికి మళ్లీ సన్నద్ధం కావడం చాలా అవసరం. ఈ స్థితి కోసం ప్రయత్నించడమే విజయానికి మార్గం.
స్ట్రెంథెనింగ్ ఫేజ్ :
పై రెండు దశలను దాటి, నేర్చుకున్న దానిని, జ్ఞాపకం ఉండేలా నిక్షిప్తపరుచుకునే దశ అంటే లాంగ్‌టర్మ్‌లో పంపించే దశ. ప్రశ్నలు సాధించిన తర్వాత స్కోర్ 50శాతం మాత్రమే వచ్చింది అంటే, మనం నేర్చుకున్న అంశాలు సరిగ్గా గుర్తుకు రావటం లేదు అని. అంటే షార్ట్ టర్మ్ మెమొరీ నుండి లాంగ్ టర్మ్ మెమొరీకి రాలేదు. అప్పుడు మళ్ళీ పాఠ్యాంశాన్ని చదివి మళ్ళీ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని అదే అంశంలో పరీక్ష పెట్టుకోవాలి. అప్పుడు 70 శాతం వచ్చిందంటే మన ప్రిపరేషన్ సరియైన దారిలో వున్నట్టు, అలా అనుకున్న శాతం వచ్చేంత వరకు చదివి స్వీయ పరీక్షలు పెట్టుకుంటూ సంతృప్తి చెంది, తర్వాత ఇంకొక పాఠ్యాంశంను చదవడం మొదలు పెట్టాలి. అప్పుడు బలాబలాలు, బలహీనతలు తెలుస్తాయి. బలహీనతలు కూడా బలాలుగా మారుతాయి. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో పరీక్షకు ప్రిపెర్ అయినట్టు లెక్క. అప్పుడు రెండవ దశలోని సులభం, కఠినం, అతి కఠినం ప్రశ్నలకు కూడా సులభంగా మీరు జవాబులు చెప్పగలుగుతారు. ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే పై విషయాలు తెలియటం ఒక్కటే సరిపోదు. నిజాయితీ అవసరం, దానికి సరిపోయే శ్రమను జోడిస్తే విజయం మీ సొంతం అవుతుంది.
ఫినిషింగ్ దశ :
పై పద్ధతులను పాటించడానికి సంసిద్దులు కావడం, పాఠ్యాంశాలపై పట్టు సాధించడం, దానికి అవసరమైన శ్రమను జోడించడం, అంకిత భావాన్ని పెంపొందించుకోవడం మొదలు పెడితే మీరు సక్సెస్ సాధించడానికి లక్షణాలు అలవరుచుకున్నారని అర్థం. రాబోయే పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించి మీరు కోరుకున్న వృత్తిలో స్థిరపడడమే తరువాయి.
ఆల్ ది బెస్ట్.