పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఒలింపిక్స్ లో రజతం సాధించిన పివి సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ ఆగస్టు 22న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తాను సాధించిన పతకాన్ని సింధు ముఖ్యమంత్రికి చూపించారు. పివి సింధును హృదయపూర్వకంగా అభినందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, అమెను ఘనంగా సన్మానించి, రూ.5కోట్ల చెక్కును అందించారు. కోచ్ గోపిని కూడా అభినందించి, కోటి రూపాయల చెక్ అందించారు. పివి సింధు దేశం గర్వపడే విధంగా ప్రతిభ ప్రదర్శించి పతకం సాధించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. కోచ్ గోపీ చంద్ కూడా తన అకాడమీ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారన్నారు. సింధును క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులు పివి రమణ, విజయలను కూడా సిఎం అభినందించారు.
పివి సింధు రజతం సాధించడం గొప్ప విషయమని, అదే సందర్భంలో ఇంత పెద్ద దేశం కేవలం రెండు పతకాలే గెలిచిందనే విమర్శ కూడా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో క్రీడాకారులు ఎవరికి వారుగా ఎదిగి పతకాలు సాధిస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం లభించడంలేదనే భావన ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, కోచ్‌లు, క్రీడా సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేయాలన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామని చెప్పారు. గతంలో అన్నిప్రాంతాల్లో పాఠశాలల్లో ఆటలు ఆడేవారని, కానీ ఇప్పుడు పరీక్షల్లో మార్కులు సంపాదించడమే లక్ష్యంగా మారి క్రీడలను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రభుత్వ పరంగా కూడా మరింత చొరవ అవసరం అని సిఎం చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులున్నారని, ఇంకా పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉందన్నారు. వారందరికీ తగిన చేయూత, ప్రోత్సాహం అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా క్రీడా ప్రాంగణాలున్నాయని, వాటిని ఉపయోగంలోకి తేవాలని సీిఎం అన్నారు. జిల్లాల్లో కూడా క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామన్నారు. హకీంపేటలో క్రీడల కోసం కేటాయించిన 300 ఎకరాలను కూడా సంపూర్ణంగా వినియోగించాలన్నారు. విశ్వ క్రీడా పోటీలకు వేదికగా హైదరాబాద్‌ను మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అదే సందర్భంలో తెలంగాణ పిల్లలు అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం పూనుకుంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్ పాల్గొన్నారు.
శ్రీకాంత్, కిరణ్‌లకు చెరో రూ. 25 లక్షలు
పివి సింధుకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన చల్లగుండ్ల కిరణ్‌కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒలింపిక్స్ లో ప్రతిభ కనబర్చిన కిడాంబి శ్రీకాంత్ కు కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని టాప్ 50 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఆరుగురు గోపీ చంద్ అకాడమీకి చెందిన వారే కావడం గర్వకారణమన్నారు. అకాడమీకి అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తామని సీిఎం చెప్పారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
సింధును అభినందించిన ప్రముఖులు
సిఎం క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు పివి సింధును అభినందించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ చీఫ్‌్ విప్ కొప్పుల ఈశ్వర్, ఖనిజాభివద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీలు కొండా మురళీధర్ రావు, పూల రవీందర్, వెంకటరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సలీం తదితరులు సింధును అభినందించారు.
విజయోత్సవ ర్యాలీ
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పి.వి. సింధూకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అపూర్వ స్వాగతం లభించింది. రియో ఒలింపిక్స్ 2016 బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రజత పతకం సాధించిన పి.వి.సింధుకు స్వదేశ ఆగమన సందర్భంగా ఆగస్టు 22న గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జిహెచ్‌ఎంసీ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆమెకు అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగేందుకు సింధుకు తర్ఫీదునిచ్చిన ఆమె గురువు పుల్లెల గోపిచంద్‌ను, ఆమెలో క్రీడా స్ఫూర్తిని నింపిన ఆమె తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిచారు. క్రీడారంగం వైపు చిన్నారులందరూ కూడా దృష్టిని సారించి తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.
కేంద్ర కార్మిక శాఖా మాత్యులు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పి.వి. సింధూ అనితరమైన కృషితో రజత పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిందన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్, సాక్షి, పి.వి. సింధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ముగ్గురు మహిళలు దేశ కీర్తిని నిలపడంతో పాటు భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.
రాష్ట్ర హోం శాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టిన క్రీడాకారిణి సింధు అని కొనియాడారు. ఆమె విజయం ఎంతో మంది క్రీడాకారులకు ఉత్తేజాన్ని కలిగించిందన్నారు.రాష్ట్ర ఐ.టీ. శాఖామాత్యులు కె. తారకరామారావు మాట్లాడుతూ భారత ప్రధాని ”బేటీ బచావో బేటీ పడావో” అని ఇచ్చిన నినాదానికి నిలువెత్తు తార్కాణంగా ఒలింపిక్స్‌లో ప్రతిభను కనపర్చిన మన మహిళా క్రీడాకారులు నిలుస్తారన్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో సింధుకు మెలకువలు నేర్పి విజయానికి చేరువ చేసిన కోచ్ పుల్లెల గోపిచంద్‌ను ఆయన అభినందించారు.2020, 2024లో జరిగే ఒలింపిక్స్‌పై దృష్టి సారించి క్రీడాకారులు కృషి చేయాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ పరిశ్రమల విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అదే విధంగా త్వరలో క్రీడా విధానం కూడా ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పి. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం మంచి సదుపాయాలతోపాటు వారు ప్రతిభ కనపర్చినప్పుడు వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
ఒలింపిక్స్ రజత పతక విజేత పి.వి. సింధు మాట్లాడుతూ ప్రజలందరి సహకారం, ఆశీర్వచనాలతో తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ ఆట బాగా ఆడేందుకు శిక్షణనిచ్చిన తన గురువు పుల్లెల గోపిచంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నతనం నుండి తన వెన్నంటి ఉంటూ స్ఫూర్తినందించిన తల్లిదండ్రులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి దేశానికి మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆహ్వాన సభ మరువలేనిదన్నారు. భారతదేశం నుండి వివిధ విభాగాల్లో ఆడి విజయాలు సాధించిన మహిళలను ఆయన ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్స్ సంరంభానికి క్రీడాకారులకు మరింత శ్రద్ధతో శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడా విధానాన్ని కూడా రూపొందించాలని ఆశాభావం వ్యక్తంచేశారు.
పి.వి. సింధూ ఆగమన అనంతరం క్రీడాభిమానుల హర్షాతిరేకాల మధ్య శంషాబాద్ విమానాశ్రయం నుండి గచ్చిబౌలి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కళాకారులచే ప్రదర్శింపబడిన డప్పు, పేరిణి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ విజయోత్సవ సభకు ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, నగర మేయర్ బొంతు రామ్మోహన్, హోం శాఖ సెక్రటరీ అనితారాజేంద్ర, జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్దన్‌రెడ్డి, అడీషనల్ కమీషనర్ సురేంద్ర మోహన్, హైద్రాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ సైనీ, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, క్రీడాభిమానులు, అర్జున అవార్డీలు పాల్గొన్నారు.