VignaanaVeechikaluవ్యాస సంపుటాలన్నీ కలిపి ఒక పుస్తకంగా ఒక దగ్గర చేర్చడం బహు చక్కని ప్రయత్నం. పోలీస్‌శాఖ వారి పత్రికలో ప్రచురించబడిన వ్యాసాలన్నింటినీ ఒక దగ్గర గుదిగుచ్చి అందించిన సమాహారం ఈ పుస్తకం. రచయిత్రి డా|| కె. అరుణావ్యాస్‌ పరిశీలనాత్మక ఆలోచన లతో చదువరులు కూడా ఇమిడిపోయే తీరులో ఒక్కో వ్యాసం ఆసక్తిగా చదివింపజేస్తుంది.

వస్తు రూపేణా చూస్తే అన్ని అంశాలు నిత్య జీవితంలో అందరికీ ఎదురయ్యే సాధారణ విషయాలే! అయినా కూడా కాలానుగుణంగా ఆయా అంశాలలో సంభవిస్తున్న మార్పులను స్పృశిస్తూ కొనసాగిన వ్యాసాలన్నీ, వేటికవే చదువరులను ఆసాంతం చదివింపజేస్తాయి. సామాజికాంశాలు, కుటుంబ బాంధవ్యాలు, వ్యక్తిగతమైన బుద్ధులు, ఇలా అన్ని అంశాలపట్ల విశ్లేషణలందిస్తూ కొనసాగిన వ్యాసాల తీరు ప్రశంసనీయం.

యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతః అనే వ్యాసంలో స్త్రీల సామాజిక కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల గురించి వివరిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటన తదితర అంశాలను పేర్కొన్నారు.

మరో వ్యాసంలో ‘కొంపకూల్చు పనులు కూడవనుచు’ పొగాకు వలన కలిగే అనర్థాలను గణాంకాలతోసహా వివరించారు. అహింసాపరమో ధర్మ: అనే వ్యాసంలో మహాత్ములను మననం చేసుకుంటూ బౌద్ధం గురించి సంక్షిప్తంగానే అయినా సంపూర్తిగా అర్థమయ్యేటట్లు వివరించారు. ఇలా సందర్భానుసారంగా వచ్చే వివిధ అంశాలైన, పెళ్ళి, కొత్త సంవత్సరం, పుస్తక పఠనం, రోజువారి నిద్ర, నవ్వు గురించి చక్కని వివరణలతో అక్కడక్కడా చక్కటి పద్యాలను జోడిస్తూ విరచించిన ఈ వ్యాసాలన్నీ విశ్లేషణా సదృశ్యాలని చెప్పవచ్చు.

– ఎంకె

Other Updates