విశ్వమంతా విత్తన విప్లవం రావాలి. ప్రపంచం ఆకలి తీరాలి. ఆహార భద్రతతో మానవాళి సంతోషంగా మురవాలి. విత్తనం పుట్టుక మొదలు అభివృద్ధి వరకు సమగ్ర చర్చ జరగాలని రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సు ముగింపు సమావేశానికి హాజరయిన ఆయన సదస్సును ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. వ్యవసాయంలో విత్తనం చాలా కీలకం అని, కల్తీ విత్తనం అమ్మడం అంటే ఆత్మహత్యకు కారణం అయినట్లేనని, తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టంతో కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపామని ఆయన తెలిపారు. తగ్గుతున్న నేలలు, నీటి వనరులు, కరంటు సదుపాయం నేపథ్యంలో ప్రపంచ మానవాళి భవిష్యత్‌ ఆహారభద్రతకు విత్తన విప్లవం రావాలని కోరారు.

గ్రామీణ రైతులు పట్టణాలకు వలస వెళ్తే ఆకలి తీర్చేదెవరు ? పట్టణాలకు గ్రామాల నుండి వస్తున్న వలసదారులకు ఉపాధి కల్పన ఎలా సాధ్యం ? నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయానికి అనువైన వాతావరణంతోనే రైతులను గ్రామాలలో ఉంచగలం అని, ‘ఇస్టా’ లాంటి సదస్సుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా సంతోష బీజాలు (Seeds of Happiness) వెల్లి విరియాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆకాంక్షిం చారు. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పారిశ్రామీకరణ తప్పనిసరి అని, అదే సమయంలో వ్యవసాయ వనరులు తరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, నాణ్యమయిన విత్తనమే దీనికి పరిష్కార మార్గమని అన్నారు. విత్తనం పుట్టుక మొదలు అభివద్ధ్ది వరకు సమగ్ర చర్చ జరగాలని, భూమిలో ఏది నాటితే అదే దిగుబడిగా అందుతుందని, కాబట్టి నాణ్యతపై సంపూర్ణ పరిశోధన జరగాలని సూచించారు. నాణ్యమైన విత్తనం, క్షేత్రం, సాగు, పంటకోత, సంతోషం ఒక చక్రంలా పనిచేస్తాయని అన్నారు.

ఈ సదస్సు నిర్వహణ ఫలితాలు, సదస్సు నిర్ణయాలు రైతుల పొలాలలో అనువయించుకునేలా ఉపయోగపడాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

రైతు అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి

రైతు అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని, రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాల వనరులను ఉపయోగించుకుని ప్రణాళికలు సిద్దం చేస్తోందని, ‘ఇస్టా’ సదస్సు నేపథ్యంలో తెలంగాణ నాణ్యమయి న విత్తనోత్పత్తికి చిరునామా కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది శిక్షణ పొందిన విత్తనోత్పత్తిదారులు ఉన్నారని, రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలలో ఇప్పటికే విత్తనాల ఉత్పత్తి జరుగుతోందని, ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు దిగుబడి వస్తుందని, దేశంలోని పది రాష్ట్రాలకు తెలంగాణ నుండి విత్తనాలు సరఫరా అవుతున్నాయని నిరంజన్‌ రెడ్డి అన్నారు.

విత్తనరంగ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇస్టా – భారత విత్తన పరిశ్రమ కలిసి పనిచేయాలని, భవిష్యత్‌లో విత్తనరంగంలో నిపుణత కలిగిన దేశంగా భారతదేశం ఎదగాలని నిరంజన్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో విత్తన కల్తీని నివారించేందుకు సీడ్‌ ట్రేసబులిటీ(విత్తన గుర్తింపు) టెక్నాలజీతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దీంతో విత్తనాల నాణ్యత మెరుగవడమే కాకుండా రైతులు మోసపోకుండా అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విత్తనమే ప్రధాన పథకం అని, దానికోసం ఎక్కడా రాజీపడకుండా ప్రణాళికలు, పాలసీలతో విత్తనరంగాన్ని బలోపేతం చేస్తున్నామని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనే పంటల సాగు, విత్తన సాంకేతికతపై పనిచేస్తున్న అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అనుకూల వాతావరణం ఉన్న కారణంగా ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణ విత్తనరంగానికి చిరునామాగానే ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో ఇస్టా ఛైర్మన్‌ క్రెగ్‌ మెక్‌ గ్రిల్‌, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్ధసారధి, వ్యవసాయ శాఖ కమీషనర్‌ రాహుల్‌ బొజ్జా, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వర రావు, సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు తదితరులు హాజరయ్యారు.

Other Updates