otherసుమారు 3 కోట్ల మంది భారతీయులు బయటి దేశాలలో పనిచేస్తున్నారు. వీళ్ళలో 10 లక్షల మంది తెలంగాణ వారే వున్నారు. దుబాయ్‌, కతార్‌, గల్ఫ్‌ లాంటి దేశాలలో తెలంగాణ కార్మికులకు మంచి డిమాండ్‌ వుంది. అయితే రాష్ట్రం నుండి దుబాయ్‌, గల్ఫ్ తదితర దేశాలకు ఉపాది నిమిత్తం వెళ్ళే కార్మికులు తప్పుడు వీసాలు, ఇతర మోసాలకు గురవుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా ఆలోచించి తెలంగాణ ఓవర్‌ సీస్‌ మాన్‌పవర్‌ కంపెని లిమిటెడ్‌ను Tomcom ప్రారంభించారు. ఈ కంపెనీని చట్టప్రకారాం రిజిస్ట్రేషన్‌ చేయటమేకాక విదేశాలలో వుండే కార్మికులకు అసౌకర్యం జరుగకుండా ఉండే విధంగా, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇతర అధికారులతో మాటాడ్లటం జరిగిందని ”కార్మిక, ఉపాది, హోమ్ శాఖల మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.

ఇటీవలె కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, ఎంపి కవితలు దుబాయ్‌కి వెళ్ళి తెలంగాణ కార్మికులకు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కూడా కోరారు. దుబాయ్‌ అధికారులతో పాటు అక్క డవుండే స్థానిక అసోసియేషన్లు, కార్మికులతో మాట్లాడి ‘టామ్‌కామ్‌’ ద్వారా ఈ సంవత్సరం 759 మంది కార్మికులను అక్కడికి పంపేందుకు 3 కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకున్నారు. కార్మిక శాఖ ద్వారా రూపొందించబడిన వెబ్‌ పోర్టల్‌ www.tomcom.telangana.gov.in ను మార్చి 1న సచివాలయంలో హోం, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఇక నుండి తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్ళే కార్మికులు ‘టామ్‌కామ్‌’ ద్వారానే వెళ్ళాలని ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా విదేశాలకు వెళ్ళి మోసాలకు గురి కావద్దని ఆయన కోరారు. ‘టామ్‌కామ్‌’ ద్వారా వెళ్ళే వారికి తెలంగాణ ప్రభుత్వం సహాయంగా వుంటుందని, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా వుండి అక్కడి ఎంబసీతో మాట్లాడుతుందని తెలిపారు. ఇక్కడి నుండి వెళ్ళే కార్మికులు టామ్‌కామ్‌తో ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగి వుండాలని, ఆన్‌లైన్‌ ద్వారా వారి వివరాలన్ని పంపిస్తే వీసాలు ఇప్పించడంలో సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. పరిస్థితులు బాగుంటే వచ్చే సంవత్సరం 5 వేల మందిని దుబాయ్‌కి  పంపాలనే ఆలోచనతో వున్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడి నుండి వెళ్ళే కార్మికులకు దుబాయ్‌ నుండే నేరుగా వీసాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించిందని, దీని వల్ల కార్మికులు మోసాలకు గురికాకుండా వుండవచ్చని అన్నారు . కార్మిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘టామ్‌కామ్‌’ ద్వారా వెళ్ళే కార్మికులు ఎటువంటి మోసాలకు గురికాకుండా వుండవచ్చని అన్నారు. హోం శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాజీవ్‌త్రివేది మాట్లాడుతూ ‘టామ్‌కామ్‌’ ద్వారా వెళ్ళే కార్మికులకు భద్రతతో పాటు రక్షణ వుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో టామ్‌కామ్‌ జి.ఎం. కె.భవాని తదితరులు పాల్గొన్నారు.

Other Updates