తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్య నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాము.
విద్యుత్ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నది. వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాము. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన,
విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం..
విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్ష నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.
కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థ పనితీరును గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాము. విద్యుత్ సమస్యల పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నది. వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాము. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాల తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
‘‘కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం ఏర్పడింది. ఓపి పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది. అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. దోపిడీ ఆగిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘ప్రస్తుతం అనాథ ఆడపిల్లల పదవ తరగతి వరకు కస్తూరి బా పాఠశాల్లో చదువుతున్నారు. తర్వాత వారి చదువుకు కావల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఈ విషయంలో త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి ఈ క్రింది నిర్ణయాు తీసుకున్నారు:
- విద్యావ్యవస్థ పవిత్రత (Academic Sanctity)ను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలి.
- ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలి.
- విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
- రాష్ట్రంలో పాఠశాల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది.
అధ్యాపకునికి అభినందనలు
విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కె. చంద్రశేఖర రావు అన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. హృదయ పూర్వకంగా అభినందించారు.
‘‘సదాశివయ్య గారు మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హృదయ పూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్లుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్ఫూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సిఎం కేసీఆర్ సదాశివయ్యతో అన్నారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీహరి, శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు.