తెలంగాణ రాష్ట్రం విద్యా, పరిశోధన హబ్ గా మారుతోందని ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి సవిత జీ అనంత్ ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్‌లు వెంకట రమణ, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై వినోద్ కుమార్ వారితో చర్చించారు. బిల్డింగ్ భారత్ బోస్టన్ బయో సైన్స్ ( బీ4 ) స్ఫూర్తి ని ఇచ్చే కార్యక్రమం అని అన్నారు. వైద్య రంగంలో పలు అంశాలపై పరిశోధనలు జరిపేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ త్వరలోనే హైదరాబాద్ లో కేంద్రాన్ని ప్రారంభించడానికి సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో తలసేమియా వంటి వ్యాధులు ప్రబలుతున్నందున అలాంటి వ్యాధులపై పరిశోధనలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని వినోద్ కుమార్ పేర్కొన్నారు.