రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగిన అనేక దుష్ప్రచారాలకు తెరదించి నాణ్యమైన కరెంటు సరఫరాలో తెలంగాణను ముందువరసలో నిలబెట్టిన చరిత్ర విద్యుత్ ఉద్యోగులదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ఖ్యాతిని సానుకూల దిశగా నిలిపిన మొట్టమొదటిశాఖ విద్యుత్ శాఖ అని ముఖ్యమంత్రి అన్నారు.
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల పట్ల మానవీయకోణంలో స్పందించిన ముఖ్యమంత్రి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగులపట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకుగాను హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్ ఉద్యోగసంఘాల నేతలు డిసెంబర్ 5న ముఖ్యమంత్రిని ‘ప్రగతి భవన్’లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సింగరేణి, విద్యుత్ తదితర ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికున్నదని.. తాను విద్యుత్ ఉద్యోగుల పక్షపాతినని సిఎం తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ పాత్ర ఎంత ముఖ్యమయినదో అందులో పనిచేసే ఉద్యోగుల పాత్ర అంతే ముఖ్యమయినదని తెలిపారు.
రైతులు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసేందుకు ఇరువై నాలుగు గంటలు అలుపెరుగని అత్యవసర సేవలందించే విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం అన్నారు. ‘ప్రభుత్వంతో ఉద్యోగులు అప్పుడప్పుడు పలు డిమాండ్ల కోసం కొట్లాడుతరు. అయితే తెగేదాన్క లాగే విధానం మంచిది కాదు. పని బందుజేసి కూసుంటమంటె ఎట్ల? యిప్పుడే తెలంగాణ అందరితోని మంచి పేరు తెచ్చుకుంటాంది. అభివృద్ది పథాన ముందుకు పోతున్నది. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని మరింత పెంచుకోవాలె గాని పని బందుచేసి పాడు చేసుకుంటమా? వొక్క సారి కాక పోతె పది మాట్ల చర్చించుకోవాలె… సమస్యలను పరిష్కరించుకోవాలె’…అని అన్నారు.
‘రాజకీయ పార్టీలు వస్తయి పోతయి.. అధికారం శాశ్వతం కాదు… కాని తెలంగాణ రాష్ట్రం శాశ్వతం… ప్రజలు శాశ్వతం…వారికి సేవలందించడం ఉద్యోగులుగా మన ధర్మం…కింది నించి పై అధికారి దాకా ఈ విషయాన్ని గుర్తెరిగి సమన్వయంతో పని చేసిన నాడు తెలంగాణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’..అని అన్నారు.
గత ప్రభుత్వాల సమయంలో అన్ని శాఖలను నిర్లక్ష్యం చేసినట్టే విద్యుత్ శాఖను కూడా ఆగం చేసిన్రని తెలిపిన సిఎం కరెంటుకోసం, ధర్నా చౌకుల్లో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన సంగతిని గుర్తు చేశారు. కరెంటు అడిగిన పాపానికి రైతులను పిట్టల్లా కాల్చి చంపిన గత చరిత్రనుంచి తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుని నిలదొక్కుకున్న వైనాన్ని సిఎం సోదాహరణంగా వివరించారు. ‘తెలంగాణల నేడు కరెంటు వుంటే గాదు..ఎప్పుడన్నోసారి కరెంటు పోతె వార్తయితున్నది.. అని అన్నారు.
తెలంగాణ సాధనకోసం పధ్నాలుగేండ్లు కొట్లాడి ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత కూడా తాను తెలంగాణ భావితరాల కోసం తన్లాడుతున్నానని…ఆ బాధ్యత ప్రతీ ఉద్యోగిమీదున్నదని తెలి పారు. తెలంగాణ రాష్ట్రం 85 శాతం బడుగు బలహీన వర్గాలతో నిండివున్నదని, వారికి సేవ చేయడంలో విద్యుత్ ఉద్యోగులు ముందుండడం హర్షనీయం అన్నారు. గత పాలకులు ఉద్యోగుల సమస్యలను తేలికగా చూసి గోటితో పొయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చి మరింత జటిలం చేసే వారని, ప్రతి ఉద్యోగ సంఘంతో కొట్లాట కొనితెచ్చుకునే సాంప్రదాయాన్ని తాము వ్యతిరేకిస్తామని సిఎం అన్నారు. ‘వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న మనమంతా సహచరులం.. రాష్ట్ర ప్రగతి సంక్షేమాన్ని లక్ష్యం చేసుకుని మనందరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరమున్నది’ అని సిఎం అన్నారు.
తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు, ఆర్టీసి ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఆశించిన దానికన్నా ఎక్కువే పెంచినానని సిఎం తెలిపారు. హోం గార్డులు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచిన సంగతిని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. ‘ఉద్యోగులకు కడుపునిండ పెట్టాలె.. ఆడుతు పాడుతూ సంతో షంతో పనిచేయించుకోవాలె’.. అనేది తమ ప్రభత్వ ఉద్దేశ్యం అని అన్నారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే దిశగా విధి విధానాల రూపకల్పనలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు చొరవ చూపాలని సిఎం సూచించారు. ‘నేను మీ మీద మానవీయ కోణంలో రెగ్యులరైజ్ చేస్త… పడనోల్లు ఆ వంక ఈ వంక పెట్టి అడ్డంకులు సృష్టించి ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తరు. అట్లా కాకుంట పకడ్బందీగా విధి విధానాలను రూపొందించు కుందాం. అందుకు యూనియన్ నేతలు చొరవ తీసుకోవాలె”.. అని సిఎం అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే దిశగా మార్చి నెలాఖరులోపు విధానాల రూపకల్పన ప్రక్రియ ముగియాలని సిఎం సంబంధిత అధికారులకు తెలిపారు. అందుకు ప్రభుత్వ అధికారుల నుంచి సలహాలు సూచనలను తీసుకోవాలని సంఘాల నేతలకు సిఎం సూచించారు.
విద్యుత్ శాఖలో నెలకొన్న కఠిన నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరముందని సిఎం మంత్రికి, ఉన్నతాధికారులకు సూచించారు. మిస్ బిహేవియర్ పేరు మీద ఇప్పటికే ఎవరినయినా ఉద్యోగులను సస్పెండ్ చేసిన కేసులుంటే మానవతా దృక్పథంతో వ్యవహరించి వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని జెన్ కో, ట్రాన్స్ కో ఉన్నతాధికారులకు సూచించారు. ఉద్యోగి మెడ మీద కత్తిపెట్టి పనిచేయించుకోవడం కంటే సంతోషంగా నవ్వుకుంట పనిచేసినపుడు మాత్రమే ఎక్కువ పని జరుగుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటన పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమ లుపరుస్తదని సిఎం వివరించారు. అయితే తాము ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినపుడు ప్రజలకు విసుగురాకుండా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల దేనని సిఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు, 1104 సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ పద్మారెడ్డి, ఆర్. జనార్దన్ రెడ్డి, కో ఆర్డినేటర్ కె.శ్రీనివాస్ రెడ్డి, 327 సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఇ. శ్రీధర్, ఎస్. రామకృష్ణారావు, టిఆర్ వికెఎస్ అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ రావు, ప్రకాష్, ఎఐటియుసి ఉపాధ్యక్షుడు దుర్గా అశోక్, టిఎన్‌టియుసి అధ్యక్షుడు మహేందర్, తదితర హోదాల్లో పనిచేస్తున్న నేతలు పలువురు హజరయ్యారు. సిఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, జెన్ కో సిఎండీ ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్సీడిసీఎల్ సిఎండీ రఘుమారెడ్డి, ఎన్పిడిసిఎల్ సిఎండీ ఎ. గోపాల్ రావు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.