శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంపై సి.ఐ.డి విచారణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. ఈ ప్రమాదానికిగల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు వెలుగులోకిరావాలని సి.ఎం స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు సి.ఐ.డి అడిషినల్‌ డి.జి.పి గోవింద్‌ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రమాదంపై పూర్తి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సి.ఐ.డి దర్యాప్తు ప్రారంభమైంది.

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపట్ల ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులుకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు సత్వరం కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు.

ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థికసహాయం ప్రకటించారు. మరణించిన డి.ఇ. శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, మిగతావారందరి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరణించినవారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని, ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని వెల్లడించారు.

Other Updates