తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభంలో వుంది. నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలు, పరిశ్రమల మూతలు, కావల్సినంత కరెంటు అందుబాటులో లేక అనేక అగచాట్లకు గురికావల్సి వచ్చింది. మరోవంక విభజన చట్టం ప్రకారం విద్యుత్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేసింది.కానీ, ఆ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం చాలా తొందరగా తేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మచీకట్లే మిగులుతాయని శాపాలుపెట్టిన వారికళ్ళు తెరిపించేలా కోతలు లేకుండా ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. తాము అధికారంలోకి వస్తే సంవత్సర కాలంలో విద్యుత్ కోతల సమస్యను పరిష్కరిస్తాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినా, అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాలలోనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేయడం జరిగింది. ఇక భవిష్యత్తులోనూ విద్యుత్ కోతల అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి 2013-14, 2014-15 సంవత్సరాలతో పోల్చిచూస్తే, 2015-16 నాటికి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16 శాతం పెరిగింది. విద్యుత్ శాఖపై కొంతభారం పడినప్పటికీ , ప్రజలపై అదనపుభారం మోపకుండా ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోంది. గతంలో పవర్ హాలీడే ప్రకటించిన రోజుల్లో పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు డీజిల్ వినియోగానికి వ్యయపరచ వలసి వచ్చేది.
ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చిన వెనువెంటనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధానంగా విద్యుత్ సమస్యపై దష్టి సారించడం వల్లనే త్వరితగతిన విద్యుత్ సక్షేభం నుంచి రాష్ట్రం బయట పడగలిగిందని విద్యుత్ శాఖామంత్రి జి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనాగ్హం.
భగభగమండే మండువేసవిలో కూడా నిరంతర విద్యుత్ సరఫరా జరగటంపట్ల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కూడా విరామం లేకుండా రోజుకు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరాకు, రాగల రోజుల్లో 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది .
రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తోంది. కొత్తగా దిగువ జూరాల, పులిచింతల, జల విద్యుత్ ప్రాజెక్టులు, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఇవి 6160 మెగావాట్ల విద్యుతును ఉత్పత్తి చేయగలవు.
తెలంగాణలోని పలుచోట్ల మొత్తం 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంగల థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ విమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 680 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.
సౌరవిద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం
సంప్రదాయిక ఇంథన వనరులతోపాటు సాంప్రదాయేతర ఇంథన వనరులను కూడా విస్తారంగా వినియోగించు కోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పాదనకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని , సౌరవిద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పేవారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సౌరవిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలనే వారికి ఏకగవాక్ష విధానంలో అనుమతులు మంజూరు చేయడం జరుగుతోంది. సోలార్ ప్లాంటు నెలకొల్పేందుకు కొనే భూమిపై చెల్లించిన స్టాంపుడ్యూటీని, ప్లాంటుకు అవసరమైన సాంకేతిక సామగ్రి కొనుగోలుకు చెల్లించిన వ్యాటును నూటికి నూరు శాతం తిరిగి ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
2017-18 సంవత్సరం నాటికి 5,000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల భయంకరమైన కరెంటు కోతలువున్న తెలంగాణ రాష్ట్రం తక్కువ సమయంలోనే సమస్యను అధిగమించ గలిగింది. విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పథకాలు రచించింది. రూ.91,500 కోట్ల పెట్టుబడితో జెన్ కో, సింగరేణి కాలరీస్, ఎన్.టి.పి.సి, సోలార్ యూనిట్ల ద్వారా ఈ లక్ష్యం నెరవేరబోతోంది.