కాళోజీ పేరే విప్లవం. ఆయన మాటల్లోనే
”నా గురించి చెప్పు కోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తు వచ్చిన, అన్ని ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న, ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని ధిక్కరిస్తూ గేయమో, కథో రాసిన. నా గేయాలలో తొంభై ఐదు శాతం ఉద్యమాలపై రాసినవే. అవన్నీ గేయ రూపంలో ఉన్న స్టేటుమెంట్లే.”
కాళోజీ మహావీరుడు. వీరకవి. అతనికి భయం అనేది లేదు. తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచాడు. ఎన్నో సార్లు నిజాం ప్రభుత్వం కాళోజీని వరంగల్లు నుంచి బహిష్కరించింది. అతడు అక్కడ వుంటే తిరుగుబాటు వస్తుందని హడలి పోయింది ప్రభుత్వం.
కమ్మని చకిలాలోక చోట – గట్టి దవడలింకొక చోట
వాసన పానీయాలొక చోట – మాసిన తలలింకొక చోట
అంత సులభమైన శైలిలో సామాజిక వ్యత్యాసాలను గూర్చి చెప్పడం కాళోజీ ప్రత్యేకత.
తెలుగులో మాట్లాడితే అవమానంగా, అగౌరవంగా భావించి ఉర్దూలోను, ఇంగ్లీషులోను సాటి తెలుగువాడితో మాట్లాడే అంధ్రుడంటే కాళోజీకి మంట.
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకు రా
అంటూ సాటి సంస్కృతిపై అతడు రాసిన గేయాలు ప్రజల నాల్కల మీద పలికాయి. ప్రజల హృదయాలలో నిలిచాయి.
నల్లగొండలో నాజీ శక్తుల నగ్ననృత్య మింన్నాెళ్ళు
పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ బొందెదెన్నాళ్ళు?
ఇంకానా ఒకపై సాగదనే రీతిలో గర్జించాడు కాళోజీ. ఆ సాహసం, ఆ ధైర్యం ఆ రోజుల్లో మరొకరికి లేదు. వరంగల్లులో కోట మొగలయ్య అనే కాంగ్రెసు కార్యకర్తను రజాకార్లు హత్య చేశారు. ఈ ఉదంతం పరిశీలించడానికి అప్పటి ముఖ్యమంత్రి మీర్జా ఇస్మాయిల్ వరంగల్లు పర్యటనకొచ్చాడు. అప్పటి కాళోజీని వరంగల్లు నుంచి ఆరు నెలలు బహిష్కరించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన ముఖ్యమంత్రికి గేయరూపంలో ఒక లేఖ తెలుగులో రాసి పంపించాడు.
మొగలయ్య మాతతో, మొగలయ్య భార్యతో
మొగమాటమును లేక ముచ్చటించితివా..
బజారులోపల పసిబాలకుని బట్టి
బల్లెంబుతో పొడుచు బద్మాషునేమైన పసికట్టినావా?
మన లేఖా సాహిత్యంలో ఈ లేఖ ఉత్తమ శ్రేణికి చెందినది. ఇంగ్లీషులో లార్డ్ చెస్టర్ ఫీల్డ్‌కు డాక్టర్ జాన్సల్ రాసిన లేఖవంటిది.
బ్రిటీష్ ఇండియాలో పోరాటం ప్రభుత్వం తోటే కాని, తెలంగాణాలో పోరాటం అది పెత్తందార్లతోటి, సనాతన చాదస్తులతోటి, గ్రంథాలయ పరంగా భాషా పరంగా, భాషకు సంబంధించి ూడా పోరాడవలసివచ్చింది. తొమ్మిదో ఆంధ్ర మహాసభ హన్మకొండ సమీప గ్రామంలో జరిగింది. వేలాది మంది వచ్చి అక్కడ చాపల మీద ూర్చున్నారు. ఖమ్మంలోని హరిజన బాలికల పాఠశాల నుండి విద్యార్థినుల్ని పిలిపించి ఈ సభలోని వారికి నీళ్ళు ఇప్పించారు. దీని మీద చాలా గొడవ జరిగింది. సనాతన వాదులు ఈ చర్యని వ్యతిరేకించారు. ఆ రోజుల్లో ఏ అభ్యుదయ పని చేపట్టినా ఇబ్బందులు ఎలా కలిగేవో చెప్పడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు. ఇలాంటి సంఘటనలు జరగడం నిజాం ప్రభుత్వానికి ఇష్టమే.
వెట్టి చాకిరీ నిర్మూలన, సర్‌బరాహి (ఉచిత సరఫరా) రద్దు – ఆంధ్ర మహాసభ చేపట్టిన మొదటి కార్యక్రమాలు. ఈ వెట్టి చాకిరీ మీదనే పెత్తందారీ తనం ఆధారపడి ఉండేది. వీటికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుండే కాళోజీ గళం విప్పాడు. రజాకారు అంటే స్వచ్ఛంద సేవకుడు. (వాలంటీరు) కాని వారు చేసే సేవ. హత్యలు, మాన భంగాలు, ప్రాచీన శిల్పాలను వికృతం చేయడం. బ్రిటిష్ వారు సాహిత్య సభలకు, మత పరమైన ఉత్సవాలకు అడ్డు తగిలేవారు కారు. కాని నిజాం ప్రభుత్వం సాహిత్య సభ జరుపుకోవడానికి సైతం ముందుగా అనుమతి తీసుకోవాలని ఒక కట్టుబాటు చేసింది. కానీ, అనుమతి పొందినా సంఘవిద్రోహశక్తులు, సభల్ని జరుగనిచ్చేవికావు. గణేశ్ ఉత్సవాలు జరుగుతుంటే రజాకార్లు గలాభాలు చేసి హత్యలు దాకా వెళ్ళేవారు. మొదటి నుంచి కాళోజీ వ్యవహారమంతా ఏ ఉద్యమం నడిస్తే ఆ ఉద్యమంలో కలిసిపోయి పని చేయడం. ఒకసారి ఆర్య సమాజ్ ఉద్యమంలో హవనం చేస్తున్న కాళోజీ దగ్గరికి సబ్ ఇన్ స్పెక్టరు వచ్చి ఏమిటది! గణేశ్ ఉత్సవాల్లో నువ్వే ఉంటవ్. ఆర్య సమాజ్ లో నువ్వే ఉంటవ్. దసరా ఉత్సవాలలో నువ్వే ఉంటవ్, అసలు నువ్వేమిటి? అని అడిగాడు.
ఏముందీ పౌర హక్కుల కోసం నేను పని చేస్తా అన్నాడు కాళోజీ, మొత్తంలో కాళోజీ మూడు సార్లు జైలుకు పోయాడు. ఒకసారి వరంగల్లు బహిష్కరణ శిక్ష అనుభవించాడు. వేలం ఇజాలతో సంబంధం పెట్టుకోక ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ అక్షర యుద్ధం ప్రకటించాడు కాళోజీ.
ఇంతటి విప్లవమూర్తి అయిన కాళోజీకి పోలీసు చర్య అనంతరం ూడా కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ పోరాటం సాగించడం ఇష్టంగా ఉండలేదు. నిజాంను, భారత ప్రభుత్వాన్ని ఒ త్రాసులో పెట్టి తూచిన పద్ధతిని ఆయన నిరసించాడు. ప్రభుత్వం చేబట్టనున్న ప్రజాస్వామ్య పాలన విధానాన్ని పరీక్షించకుండానే నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన పద్ధతిలోనే భారత ప్రభుత్వాన్నీ, దాని సైన్యాన్ని ఎదుర్కోవాలన్న నిర్ణయం సరి అయినది కాదని ఆయన అభిప్రాయం.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో పశ్చిమ తెలంగాణ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ప్రతినిధిగా ఎన్నికైన కాళోజీ రెండేళ్ళు ఆ పదవిలో ఉన్నాడు. కాళోజీ జాతీయవాది. ఎన్నో అవార్డులు పొందాడు. 1972 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే తామ్ర పత్రం అందుకున్నాడు. ‘నా గొడవ’ అనే ఆయన గ్రంథానికి లిటరరీ అవార్డు లభించింది. ఉత్తమ అనువాదకుని అవార్డు, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డులను ఆయన స్వీకరించాడు. రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారంతో సంత్కరించింది.
నా గొడవ అంటూ జనం గొడవను గానం చేసిన ప్రజాకవి కాళోజీ, ప్రేమను పంచడంలో సదా బాలకునిగా, అన్యాయాన్ని ఎదురించడంలో నిబద్ధ యోధుడుగా జీవించిన కాళోజీ ఆజన్మాంతరం తెలంగాణ ఆత్మగా జ్వలించాడు. చాలా కాలం విరసం సభ్యుడుగా కొనసాగాడు. కవిగా, రచయితగా, ఉద్యమకారుడుగా అన్యాయాన్ని ఎదిరిస్తూ జీవించిన కాళోజీ బూటకపు ఎన్ కౌంటర్లను ఎంత తీవ్రంగా నిరసించాడో, ప్రజల వోటును కాలరాస్తూ పీపుల్స్ వార్ ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడాన్ని అంతే తీవ్రంగా వ్యతిరేకించాడు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్లులోని వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టి ఆ మహనీయుడి సేవలను ఆ విధంగా గౌరవించడం ఎంతో సముచితమైనది.
”కాలం వ్యర్ధం చేయక కళయని రాసిన కవితలు చాలింక కలం చేత కదలింపకున్నచో కాళోజీ కాయమే చాలింక.” అని తన భవితను చెప్పుకున్న కాళోజీ 2002 సంవత్సరంలో ఏప్రిల్ 12న 88 వ ఏట తనువు చాలించాడు. ఇంకా రెండేళ్ళు జీవించి ఉంటే తన చిరకాల స్వప్నం కనిపించినందుకు ఆయన ఎంతగా మురిసిపోయేవాడో.!
కాళోజీ నారాయణరావు
1914 సెప్టెంబరు 9న బీజాపూరు జిల్లాలోని రట్టెహళి గ్రామంలో జన్మించారు. ఆయన తన పసితనంలో కొంతకాలం మహారాష్ట్రలోని సాయారం గ్రామంలో, తెలంగాణలోని ఇల్లెందు తాలూక కారేపల్లి గ్రామంలో గడపవలసివచ్చింది. ఈ విధంగా అప్పటి నిజాం రాష్ట్రంలోని మూడు భాషల సంస్కారం ఆయనలో నిబిడీకృతమై ఉండేది. 1917 నుంచి ఆయన జీవితం వరంగల్లులోనే గడిచింది. ‘మూడు సంవత్సరాల గైర్ ముల్కీని’ నేను అని తన మీద తానే జోక్ చేసుకునేవాడు కాళోజీ. కాళోజీ ప్లీడరీ పరీక్ష ప్యాసై కొంత కాలం లా ప్రాక్టీసు చేశాడు.