తెలంగాణలోని పట్టణ ప్రజలకు మెరుగైన విమానయాన సౌకర్యాన్ని కల్పించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది.ఆ దిశలో భాగంగా జనవరి 11న ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యాలయంలో పౌరవిమానయానశాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖమంత్రి కేటీఆర్‌ల సమక్షంలో కేంద్ర విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి ఉషాపధీ, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఛైర్మన్ గురుప్రసాద్ మహాపాత్రలు ఈ ఒప్పందపత్రంమీద సంతకాలు చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ గత అక్టోబర్‌లో ప్రారంభించిన ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యమయ్యింది. ఈ పథకం ద్వారా సమీప భవిష్యత్తులో జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే అవకాశం లభించనుంది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కూడా విమానాశ్రయాలు నెలకొల్పడంతోపాటు విమాన ప్రయాణాన్ని సామాన్యుల చెంతకు తీసుకురావడానికి వీలవుతుంది.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఆర్థికంగా, సాంకేతికంగా అనువుగా ఉన్న విమానాశ్రయాలను వినియోగంలోకి తీసుకొచ్చి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ద్వారా విమాన సర్వీసులను చిన్న పట్టణాలకు కూడా అందించేందుకు వీలుపడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో, ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త విమనాశ్రయాలను నెలకొల్పడం, లేక నిరుపయోగంగా ఉన్న విమనాశ్రయాలను అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకం ద్వారా కొత్తగూడెం, వరంగల్‌లాంటి దాదాపు తొమ్మిది విమానాశ్రయాలను వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలోని నాలుగు హేంగర్లను స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా అకాడమికి లీజు ప్రాతిపదికన ఇవ్వాలని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మాట్లా డుతూ.. ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకంద్వారా చిన్న పట్టణాల్లో సైతం విమాన సర్వీసులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదీ ఆహ్వానించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంపై కేంద్ర ప్రభుత్వం నిశితమైన దృష్టి పెట్టిందని, భవిష్యత్తులో ఈ విధానంద్వారా చాలామందికి
ఉపాధి అవకాశాలు వస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకంలో చేరామని అన్నారు. ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలనుబట్టి చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలను నిర్మించి సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణ కూడా అందులో భాగస్వామ్య మవ్వాలనే ఆలోచనతో ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పట్టణాల్లో సైతం విమాన సర్వీసులను తీసుకురావాలన్న ఆలోచన అతి ముఖ్యమైనది. ఈ ఒప్పందంవల్ల తెలంగాణలోని సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి వస్త్తుందని ఆశిస్తున్నామన్నారు. గతంలో కొత్తగూడెం విమానాశ్రయంకోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సానుకూలంగా స్పందించి సాంకేతికపరమైన అనుమతులు ఇచ్చారని అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
పెండింగ్ సమస్యలపై చర్చలు
అనంతరం మంత్రి కె. తారకరామారావు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై చర్చించారు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి అనంత్ గీతేని, అటవీ, పర్యాటకశాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తోసహా కలిసి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ (సీసీఐ) పునరుద్ధరణ అంశంపై చర్చించారు. ఆదిలాబాద్‌లో మూతబడిన సీసీఐ ప్లాంట్ తిరిగి ప్రారంభమయ్యే విధంగా చూడాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. ఈ పరిశ్రమ 1998లో మూత పడిందని, సుమారు 2వేల మంది కార్మికులు పరిశ్రమ మూతపడడంవల్ల అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, అవసరమైతే రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టిన తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఆయనకు తెలిపారు. ఈ విషయంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో సమావేశమయ్యి తెలంగాణ వేదికగా జాతీయ జౌళి సమ్మేళనం ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.
ఈ సమ్మేళనంలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై సానుకూలంగా ప్రకటన చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు వాడాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రమంత్రి అభినందించారని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా చేనేత వస్త్రాలు వాడాలన్న ఆలోచన చేస్తోందని కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు నిధులు కేటాయించేలా ఆర్థికశాఖకు సూచించాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కోరామని ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్ లావాసాను కలిసి రానున్న బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్ద పీట వేయాలని కోరామన్నారు. అదే విధంగా సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నీతి ఆయోగ్ సూచించిన దాదాపు 20వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో విడుదల అయ్యేలా చూడాలని అశోక్ లావాసాను కోరామని మంత్రి తెలిపారు.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమై దేశంలో అన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నీతిఆయోగ్‌ది ముఖ్య పాత్ర అయినందున రాష్ట్రంలో తీసుకువస్తోన్న నూతన ఆవిష్కరణలను ఆయనతో పంచుకున్నామని మంత్రి కే. తారకరామారావు తెలిపారు.