-మంగారి రాజేందర్
పోలీసులు, కోర్టులు నిష్పక్షపాతంగా వుండాలి. ఆ విషయానికి వస్తే ఎవరైనా నిష్పక్షపాతంగా వుండాలి. ఈ నిష్పక్షపాతం అనేది అందరిపట్ల వుండాలి. వాళ్ళు ముద్దాయిలు కావొచ్చు. బాధితులు కావొచ్చు. చాలా నేరాలు అనేవి సమాజానికి వ్యతిరేకంగా జరిగినవి కాబట్టి సమాజం పట్ల కూడా పోలీసులు, కోర్టులు నిష్పక్షపాతంగా వుండాలి. క్రిమినల్ కేసుల విచారణ నిష్పక్షపాతంగా వుండాలని అందరూ కోరుకుంటారు. రాజ్యాంగంలోని అధికరణ 21 చెబుతున్నది కూడా ఇదే. 21 ప్రకారం శాసన ప్రకారం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ లేక వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు.
మనదేశంలో అడ్వర్సరీ సిస్టమ్ అమల్లో వుంది. ప్రతికూల వ్యవస్థ అన్నమాట. ఈ పద్ధతిలో న్యాయమూర్తి ఇరుపక్షాలకి నిష్పక్షపాతంగా వుండాలి. అతను కేసుల విచారణలో సాధారణంగా చురుకుగా పాల్గొనకూడదు. ఈ పద్ధతి ఎక్కువగా ‘కామన్ లా’ దేశాల్లో వుంది. ఈ పద్ధతిలో ఇరుపక్షాలు వుంటాయి.
ముద్దాయి పక్షం ఒకటి. ప్రాసిక్యూషన్ పక్షం మరొకటి. కేసుని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ పై వుంటుంది. ఈ పద్ధతిలో ముద్దాయి సాక్ష్యం పెట్టాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. అదే విధంగా అతని ప్రాసిక్యూటర్ (అభియోక్త) ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ ముద్దాయి తనని తాను విచారించుకోవడానికి అతనికి విచక్షణాధికారం వుంది. ఆ విధంగా అతను నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అతని అభియోక్త క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం వుంటుంది. అలాంటి సందర్భాలలో తప్పుడు సాక్ష్యం ఇస్తే అతణ్ణి శిక్షించడానికి అవకాశం వుంటుంది. అదే విధంగా కేసు దర్యాప్తులో వున్నప్పుడు మౌనంగా వుండే అవకాశం కూడా ఉంది.
ఈ ప్రతికూల పద్ధతిలో న్యాయమూర్తి అనే వ్యక్తికి చురుకుగా పాల్గొనే అవకాశాలు తక్కువగా వుంటాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో న్యాయమూర్తి విచారణ క్రమంలో చురుకుగా పాల్గొనే అవకాశం కల్పించే నిబందనలు కొన్ని వున్నాయి. కొన్ని నిబంధనలు అపారమైన అధికారాలని కూడా న్యాయమూర్తికి ఇచ్చాయి. అందుకు ఉదాహరణే భారతీయ సాక్ష్యాధారాలు చట్టంలోని సెక్షన్ 165. ఈ నిబంధన కేసు విచారణ క్రమంలో సంబంధం వున్న, సంబంధం లేని ప్రశ్నలని న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం వుంది. అయితే ఈ నిబంధనని ఉపయోగిస్తున్న న్యాయమూర్తులు చాలా అరుదుగా కన్పిస్తారు.
ఈ నిబంధననే కాకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కూడా చాలా నిబంధనలు వున్నాయి. ఈ అడ్వర్సరీ సిస్టంలో ఇరుపక్షాల న్యాయవాదులు ఇరుపక్షాల సాక్షులని ప్రశ్నించే అవకాశం వుంటుంది. అయితే ముద్దాయి సాక్షులని విచారించినప్పుడు ప్రాసిక్యూషన్‌కి ఆ అవకాశం లభిస్తుంది.
ఇక ఇన్క్విస్టోరిల్ సిస్టమ్‌లో చాలా చురుకైన పాత్ర పోషించేది న్యాయమూర్తి / విచారణలో సాక్ష్యాలను విచారించేది న్యాయమూర్తే. ఈ పద్ధతి ఉద్దేశ్యం ఏమంటే సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తి పై వుంటుంది.
అడ్వర్సరీ సిస్టమ్‌లో నేరం నిరూపణ అయ్యేంతవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణిస్తారు. ఇన్క్విస్టోరియర్ సిస్టమ్‌లో ముద్దాయి నేరం చేశాడన్న భావనలో కోర్టులు వుంటాయన్న అభిప్రాయంతో చాలా మంది వున్నారు. అతను నిరపరాది అన్న విషయం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతనిపైనే వుందని కూడా చాలా మంది అనుకుంటారు. ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కాదు. ఉదాహరణకి ఫ్రాన్స్ దేశాన్నే తీసుకుందాం. అక్కడ ఇన్క్విస్టోరియల్ సిస్టమ్ గత వంద సంవత్సరాలకు పై బడి వుంది. ఆ దేశంలో నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ పైనే వుంది. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి.
అంతర్జాతీయ సివిల్, రాజకీయ హక్కుల ఒప్పందంలోని అధికరణల ప్రకారం నేరం నిరూపణ అయ్యేసరికి నిరపరాదిగా పరిగణించాల్సి వుంటుంది. ఈ సూత్రానికి అనుగుణంగానే ఇన్క్విస్టోరియల్ పద్ధతిని యూరోపియన్ దేశాలు పాటిస్తున్నాయి.
ఈ రెండు పద్ధతులకి ప్రధానమైన భేదం ఒక్కటుంది. అడ్వర్సరీ సిస్టమ్‌లో ముద్దాయిని అతను అనుకున్నప్పుడు తప్ప మరో సందర్భంలో ప్రాసిక్యూషన్ విచారించే అవకాశం లేదు. సాక్ష్యం ఇవ్వాలని అతణ్ణి ఒత్తిడికి గురిచేసే అవకాశం లేదు. రాజ్యాంగం అదే విధంగా ఇతర శాసనాలు ముద్దాయికి ఈ హక్కులని ప్రసాదించాయి. ఇదే పద్ధతి ఈ ఇన్క్విస్టోరియల్ పద్ధతి అవలంభిస్తున్న దేశాల్లో వుంది.
ఇన్క్విస్టోరియల్ సిస్టమ్‌లో కూడా దాదాపుగా ఇదే పద్ధతి వుంటుంది. దర్యాప్తు క్రమంలో, కేసు విచారణ క్రమంలో ముద్దాయి మాట్లాడమని ఒత్తిడి చేసే అవకాశం లేదు. ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారన్న అభిప్రాయం చాలా మందిలో వుంది. దానికి కారణాలు రెండు.
ముద్దాయి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ప్రాసిక్యూషన్ పరిశోధనని సోదాలని నిర్వహిస్తుంది. అదే విధంగా విచారణ సమయంలో ముందుగా ముద్దాయిని న్యాయమూర్తి విచారిస్తారు. ముద్దాయి కథనం తెలుసుకోవడానికి న్యాయమూర్తి జరిపే ప్రక్రియ అది. కేసుకి సంబంధించిన కాగితాలు ముద్దాయికి అందజేసి ముద్దాయి కథనం గురించి న్యాయమూర్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా అతని మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దీన్ని బట్టి ఈ ఇన్క్విస్టోరియల్ సిస్టమ్‌లో (పరిశోధన పద్ధతి)లో ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారన్న అపప్రద ఏర్పడింది.
విరోధి పద్ధతి (అడ్రెసరీ సిస్టమ్) ముద్దాయికి అనుకూలంగా వుందని దాని వల్ల చాలా మంది శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ నేరన్యాయ వ్యవస్థని దగ్గరగా చూసిన వ్యక్తుల అభిప్రాయం వేరుగా వుంటుంది. లోప భూయిష్టమైన దర్యాప్తు, సాక్షులు సహరించకపోవడం, దర్యాప్తు విచారణలో జాప్యం లాంటి కారణాలు ఎన్నో.
కేసు నిరూపణ అయ్యేంతవరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న అభిప్రాయం ‘విరోధి పద్ధతి’లో వుండటం వల్లే కేసులు వీగిపోతున్నాయని దీన్ని మార్చాలని చాలా మంది వ్యాఖ్యానిస్తూ వుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. రెండు రకాలైన వ్యవస్థలకి ఇది వర్తిస్తుంది.
మన దేశంలో అభివృద్ధి చెందిన జ్వాలిన్ ప్రుడెన్స్ ప్రకారం అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తి పై ఎలా వుందో, అదే విధంగా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తిపై వుంది. అయితే నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయిని నిరపరాధిగానే భావించాల్సి వుంటుంది. నేర నిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ పై వుంటుంది. ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వున్నాయి. బాధితులకి, సమాజానికి కష్టం, నష్టం కలిగించే విధంగా ఈ నిబంధన వుందని చాలా మంది వాదిస్తూ వుంటారు.
ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ని సాక్ష్యాధారాల చట్టాన్ని ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చే విధంగా తయారు చేయలేదు. అందరికీ మరీ ముఖ్యంగా సమాజానికి తగు న్యాయం జరిగే విధంగా తయారు చేశారు. నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్ పై వుండకూడదని, నేరం తాను చెయ్యలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిపై వుంచాలన్న వాదన తరచూ వస్తూ వుంది. మరీ ముఖ్యంగా తీవ్రమైన నేరాలు, హీనమైన నేరాలు జరిగినప్పుడు ఈ వాదన వస్తుంది. ఏమైనప్పటికీ ఈ వాదనతో ఏకీభవించలేం.
ఎందుకంటే మనదేశంలోని నేరస్తులు ఎక్కువ మంది నిరుపేదలు. దిక్కూ దివాణం లేని వ్యక్తులు. వాళ్ళు తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో న్యాయమూర్తి వాళ్ళకి శిక్ష విధించాల్సి వస్తుంది. దానివల్ల అమాయకులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తనపై మోపిన నేరాలని ఎదుర్కొనే శక్తి ఇంకా మన దేశంలోని ప్రజలకి రాలేదు. ఇక రాజ్యం విషయానికి వస్తే రాజ్యానికి ఎన్నో వనరులు వున్నాయి. పోలీసులు, ప్రాసిక్యూషన్ లాంటి అంగాలు రాజ్యం వద్ద వున్నాయి. మామూలు ప్రజల వద్దనే డబ్బున్న వాళ్ళ దగ్గర కూడా లేదు.
అందుకని నేరం నిరూపణ అయ్యేంతవరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న సూత్రానికి ఎంతో ఆవశ్యకత వుంది. అది ముద్దాయిలకి డాలుగా ఉపయోగపడుతుంది. శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కోవడానికి అది కవచంలా ఉపయోగపడుతుంది. ఈ రెండింటికి మధ్య సమతూకాన్ని చూడాల్నిన బాధ్యత న్యాయమూర్తిపై వుంటుంది.