గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎం.సి) కు ఫిబ్రవరి రెండున జరిగిన ఎన్నికలు అన్నివిధాలా గత రికార్డులను తిరగ రాశాయి.
హైదరాబాద్ కార్పొరేషన్ చరిత్రలో ఏకపక్షంగా, వందకు సమీప సంఖ్యలో మున్సిపల్ డివిజన్లలో ఒక పార్టీకి విజయాన్ని చేకూర్చి అధికార పీఠం అప్పగించిన అరుదైన సంఘటన ఇది. గతంలో ఏ ఒక్కపార్టీ 52 స్థానాలకు మించి గెలుచుకో లేదు. అంతేకాదు, తొలిసారిగా 50 శాతం డివిజన్లు మహిళలకు కేటాయించి, బల్దియా పాలనలో మహిళలకు పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించడం కూడా ఈ సారి ఓ రికార్డే.
విభిన్నమతాలు, జాతులు, రాష్ట్రాల ప్రజలు కలసిమెలసి సహజీవనం సాగించే హైదరాబాద్ మహానగర ప్రజలు ఈ ఎన్నికలలో విలక్షణ తీర్పునిచ్చారు. గంగా – జమునా తెహజీబ్ సంస్కృతిని మరోసారి నిరూపించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బల్దియాకు తొలిసారి జరిగిన ఈ ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టి.ఆర్.ఎస్) 99 స్థానాలు కైవసంచేసుకొని సంపూర్ణ ఆధిక్యత సాధించింది. మహానగర ప్రజలు ఆ పార్టీపై ఓట్ల వర్షం కురిపించి పట్టం కట్టారు. మరేపార్టీ మద్ధతు అవసరం లేకుండానే టి.ఆర్.ఎస్ ప్రతినిధులు మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దాదాపు కోటి జనాభా కలిగిన బల్దియా ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే భావించాయి. ఎన్నికల ముందు అన్ని పార్టీలు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేయడం కూడా సహజం. కానీ, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, మురికివాడలు లేని నగరంగా అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్ళను నిర్మించి ఇస్తామని, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, మెరుగైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణలతో పాటు హైదరాబాద్ నగర సమగ్ర, సుస్థిర అభివద్ధికి టి.ఆర్.ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలపట్ల మహానగర ప్రజలు విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో గత 20 మాసాలుగా టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలలో ఈ విశ్వాసాన్ని పాదుకొలిపాయనడంలో సందేహం లేదు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పేర్కొన్నట్టు ఇది ప్రజ లు ఇష్టపడి ఇచ్చిన తీర్పు. బల్దియా లో కొత్తగా ఎన్నికైన పాలక వర్గం ప్రజల ఆకాంక్షలకు ధీటుగా, సరికొత్త ఒరవడిలో పాలన సాగించాలి. అప్పుడే, హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం త్వరితగతిన నెరవేరుతుంది. సంకల్ప బలం వుంటే సాధించలేనిది ఏముంటుంది.!!