ప్రజల ఆశీస్సులతో పొందిన అధికారాన్ని వారి సేవలో పండించు కోవాలనే అంకిత భావానికి రాష్ట్ర ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. గత సెప్టెంబరు 6న శాసన సభ రద్దయిన తర్వాత డిసెంబరు 7న పోలింగ్‌ రోజు వరకూ సాగిన పరిణామాలను మౌనంగా వీక్షించి విలక్షణ తీర్పును తమ ఓటు ద్వారా వెలువరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పేద, బడుగు వర్గాల సంక్షేమం, ఆయారంగాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాలుగున్నర సంవత్సరాల పాలనను ప్రజలు ఆశీర్వదించారు. అంచనాలకందని ఘన విజయాన్ని అందించి, అప్రతిహతంగా ముందుకు సాగిపోవాలని దిశానిర్దేశం చేశారు.

‘సద్ది తిన్నరేవు తల్వాలె’, ‘తనను చూసినోల్లను ఆమడ సూడాలె’ అనే సామెతలు గ్రామాల్లో జనం నోళ్ళలో నానుతుంటాయి. ‘నియ్యత్‌’కు నిలువెత్తు నిదర్శనాలుగా జనం వీటిని ప్రస్తావిస్తుంటారు. ప్రభుత్వ కార్యాచరణకు మానవీయ కోణాన్ని అద్ది, సామాన్యుడే తమ సర్కారుకు మాన్యుడుగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు, ఆయన ప్రస్థానాన్ని విజయ తీరాలకు చేర్చాయి. నిన్నటి అనుభవాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని రేపటి దిశగా అడుగేయడం విజ్ఞుల లక్షణం. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూనే, నిరంతరం అభివృద్ధి, సంక్షేమాల దిశగా ముందుకు సాగిన తీరు ముఖ్యమంత్రి దార్శనికతకు అద్దం పడుతుంది. నాటి నిరంతర విద్యుత్‌ సరఫరా నుంచి నిన్నటి కంటివెలుగు దాకా మూస పథకాలకు భిన్నంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా అమలైన పథకాలే ఇందుకు రుజువు.

సుదీర్ఘ కాలంగా ప్రజా ప్రాతినిధ్య రంగంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి తొలినాళ్ళ నుంచే తన విలక్షణ విధానాలతో ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే సమష్టి శ్రమదానంతో నంగునూరు మండలంలోని అవతలి గ్రామాలకు రహదారిని నిర్మింపజేసి ఎర్రబస్సు సదుపాయం కల్పించగలిగారు. సమస్యల తీవ్రతను గుర్తించడం. వాటిని అలవోకగా అధిగమించడం, సవాళ్ళను స్వీకరించడం, వాటికి పరిష్కార మార్గాలు నిర్ధారించడం, ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్య. మరికొన్నాళ్ళలో రాష్ట్రం మొత్తానికీ మంచినీరు అందించే ‘మిషన్‌ భగీరథ’, కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్న నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాలు ఆయన అవగాహనా స్థాయికి దృష్టాంతాలు. నిరంతరం ప్రజలతో మమేకమై వ్యవహరించడం, అన్నివేళలా రాష్ట్రాభివృద్ధి, జనక్షేమం ఆకాంక్షించడం దిశగా సాగుతున్న ఆయన ప్రస్థానం ఇకపై జాతీయ స్థాయికి చేరనుంది. ఈ గమనంలో తన ప్రత్యేక తరహా వ్యవహారశైలితో అఖండ విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!

Other Updates