విలక్షణ-బడ్జెట్‌బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ఇది తొలి అడుగు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ అన్ని విషయాలలో ప్రత్యేకతను, విలక్షణతను సంతరించుకుంది.

ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ నవంబరు 5న రాష్ట్ర శాసనసభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014`15 ఆర్థిక సంవత్సరంలో 10 మాసాల కాలానికి మొత్తం 1,00,637.96 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు గత బడ్జెట్‌ మొత్తం దాదాపు లక్షా 60వేల కోట్ల రూపాయలు. కాగా, ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణకు, అదీ 10 మాసాల కాలానికి లక్ష కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌ ప్రతిపాదించడం విశేషం.

ఒకప్పుడు ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఉమ్మడి రాష్ట్ర పాలకులు అహంకార ధోరణి ప్రదర్శించిన సభలోనే ఇప్పుడు ఇంతటి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోగలగడం గర్వకారణం.
బడ్జెట్‌ రూపకల్పనలో కూడా ప్రజలకు భాగస్వామ్యం కల్పించి ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన జరగాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయం మేరకు ‘మన ఊరు`మన ప్రణాళిక’ అనే కార్యక్రమంలో ప్రజాభిప్రాయం సేకరించారు. గ్రామస్థాయినుంచి ప్రజలు వ్యక్తంచేసిన ప్రాధాన్యతల ప్రాతిపదికగా ఈ బడ్జెట్‌ రూపకల్పనచేయడం నూతన ఒరవడికి నాంది పలికినట్లయింది.

బడ్జెట్‌ కేటాయింపులలోనూ ఓ ప్రత్యేకత కానవస్తుంది. తెలంగాణ ఏయే రంగాలలో ధ్వంసం చేయబడిరదో ఆ రంగాలను మళ్ళీ చక్కదిద్దే ప్రయత్నం జరిగింది.

తెలంగాణ పల్లెలకు ప్రాణాధారమైన చెరువుల పునరుద్ధరణకు రూ. 2,000 కోట్లు, ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించేందుకు ఉద్దేశించిన ‘వాటర్‌గ్రిడ్‌’ పథకానికి రూ. 2,000 కోట్లు ప్రతిపాదించారు.

ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి., మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమానికి కూడా భారీగా నిధులు కేటాయించడం ఆయావర్గాల అభివృద్ధిపట్ల ప్రభుత్వానికిగల చిత్తశుద్ధిని వెల్లడిస్తోంది. గతంలోకంటే మైనారిటీల సంక్షేమానికి రెట్టింపు నిధులు రూ. 1,030 కోట్లు కేటాయించడం చారిత్రక నిర్ణయం.

ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం భవిష్యత్తులో అమలుచేసి చూపుతుందన్న విశ్వాసాన్ని కల్గించే విధంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. ఇందుకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రశంసించడం సమంజసమే కదా!

Other Updates