1969తో పోల్చితే 1970వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ ఉధృతి బాగా తగ్గింది. 1969 జనవరి నుండి జూలై మూడో వారం దాకా ప్రధాని ఇందిర, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ మద్యమాన్ని హింసను ప్రయోగించి అణగద్రొక్కే ప్రయత్నాలు, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ముఖ్యనాయకులందరినీ జైళ్ళో పెట్టి ఉద్యమకారులకు నాయకత్వ కొరతను సృష్టించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ఎంపిల, ఎంఎల్‌ఏల ఓట్లు పొందడం కోసం బ్రహ్మానంద రెడ్డి చే రాజీనామా డ్రామా నడిపించారు. న్యాయస్థానాలు జైలు నుండి నేతలను విడిచి పెట్టడంతో రాజీ బేరానికి దిగిన ప్రధాని, డా|| చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్‌లకు బంగ్లాదేశ్‌ సమస్యను, కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ముందుపెట్టి తెలంగాణ సమస్య పరిష్కారానికి తనకు కొంత గడువు కావాలని, అప్పటిదాకా తాత్కాలికంగా ఉద్యమాన్ని నిలిపి వేయాలని అభ్యర్థించారు. ఆమె మాటలను నమ్మిన నేతలు ఉద్యమానికి తాత్కాలిక విరమణ ప్రకటించి విద్యార్థులను తిరిగి పాఠశాలలకు, కాలేజీలకు వెళ్ళమని కోరినారు. ఈ పరిణామం తెలంగాణ ఉద్యమ నేతల మధ్య తీవ్రమైన విభేదాలకు దారి తీసింది. కొండా లక్ష్మణ్‌ – చెన్నారెడ్డి – సదాలక్ష్మీ ఇలా తలో గ్రూపుగా చీలిపోయారు.

కొన్ని నెలల తర్వాత డా|| చెన్నారెడ్డి తిరిగి ఎంత ప్రయత్నించినా గతంలో వలె ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టలేదు. తన అనుచరులు, కొందరు ప్రజా ప్రతినిధులు, కొందరు కరడు గట్టిన ఉద్యమ కారులు కేవలం వందల సంఖ్యలోనే డా|| చెన్నారెడ్డి పిలుపుకు స్పందించి, ఆందోళనల్లో పాల్గొనడం కన్పించింది. సరిగ్గా ఇదే సమయంలో ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యన్థి నాగం కృష్ణ గెలుపు తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయాల వైపు మళ్ళించి, లక్ష్యం పట్ల మరోసారి ఆశలను చిగురింప చేసింది.

ప్రజల నాడీని పసిగట్టిన డా|| చెన్నారెడ్డి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చి లక్షల సంఖ్యలో సభ్యులను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సిద్ధిపేట శాసనసభకు ఉప ఎన్నిక వచ్చింది.

తెలంగాణ ప్రజా సమితి పరిస్థితిని గమనించిన ప్రభుత్వాధినేతలు ప్రజల దృష్టిని ‘అభివృద్ధి’ వైపు మళ్ళించే ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణా రీజనల్‌ కమిటీకి మరిన్ని అధికారాలు ఇవ్వడం, పోచంపాడు ప్రాజెక్టుకు అధిక నిధులు సమకూర్చడం, స్థానికులకు

ఉద్యోగాలివ్వాలనే వాంఛూ కమిటీ సిఫార్సులను అమలు చేయడం, తెలంగాణ ఫ్రంట్‌లోని శాసనసభ్యులను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకోవడం వంటి ఎత్తుగడలకు పూనుకున్నారు. ఈ క్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు (ఏ పత్రికా ఆ ప్రతినిధి పేరును వెల్లడించలేదు). ”అష్ట సూత్ర కార్యక్రమం క్రింద తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి” జరుగుతున్నదని పత్రికలకు వెల్లడించారు. దీనిపై ఆంధ్రప్రభ (1970 ఆగస్టు 30) కథనం యథాతథంగా…

”ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని సబార్డినేట్‌ సర్వీసులకు ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌ వికేంద్రీకరణ కై కేంద్ర ప్రభుత్వం నియమించిన వాంఛూ కమిటీ చేసిన సిపార్సులను ప్రాంతీయ సంఘంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు నేడు వెల్లడించారు.

”అప్పటి వరకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరిధి కింద వున్న ఎల్‌.డి.సిలు, టైపిస్టులు వంటి నాలుగవ గ్రూపు సర్వీసులకు ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌ను, వాంఛూ కమిటీ నివేదిక అందక ముందే రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరించినదని ఆయన వివరించారు.

”స్థానిక ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజీలు పంపిన స్థానిక అభ్యర్థులను ఎన్నిక చేయడానికి వీలుగా అట్టి ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పుడు అప్పగించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ చర్య ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో స్థానిక ప్రజలకు ఉద్యోగాలను సమకూర్చడానికి అవకాశం కలిగినదని ఆయన అన్నారు.

”తెలంగాణలో అభివృద్ధి చురుకు గతిని సాధించే విషయంలో ప్రధాని అష్టసూత్ర కార్యక్రమం విజయవంతమైనదని ఆయన అన్నారు.

”తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయకుండా వున్న మిగులు నిధులు రూ. 28.34 కోట్లుగా భార్గవా కమిటి నిర్ణయించింది. మిగులు నిధులను చాలా కాలం పాటు వినియోగించకుండా వున్నందున తెలంగాణా అభివృద్ధి కొంత వరకు వెనుకబడిన దృష్ట్యా తెలంగాణ అభివృద్ధికై 1968 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి నాల్గవ ప్రణాళిక ఆఖరు వరకు రూ. 45 కోట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సలహాఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధి వ్యయంలో, తెలంగాణకు మామూలుగా లభించే వాటాకు ఈ మొత్తం అదనంగా ఖర్చు చేయాలని కేంద్రం సలహా నిచ్చింది. 1969-70 కాలంలో తెలంగాణలో అదనంగా తొమ్మిది కోట్ల రూపాయలను ఖర్చు చేయటం జరిగింది. ఇందుకు సమానమైన మొత్తాన్ని 1970-71 కాలంలో కూడా ప్రత్యేక తెలంగాణా అభివృద్ధి పథకానికి కేటాయించటం జరిగింది.

”అష్ట సూత్ర కార్యక్రమం క్రింద కార్యక్రమాల అమలును సమీక్షించి అవసరమని భావించిన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహానివ్వడానికి ఈ క్రింది రెండు ముఖ్యమైన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

1. ముఖ్యమంత్రి అధ్యక్షత క్రింద మంత్రిత్వ స్థాయిలో ఏర్పాటైన

ఉన్నతాధికార కమిటీ

2. ప్లానింగ్‌ కమీషన్‌ సలహాదారు ఛైర్మన్‌గా అధికార స్థాయిలో ప్రణాళిక అమలుకై నియమింపబడిన కమిటీ

ఈ రెండు ముఖ్యమైన కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై, తెలంగాణలో అభివృద్ధిని సమీక్షించి, తెలంగాణ అభివృద్ధికై దీర్ఘకాలిక పథకాలను రూపొందించడానికి సంబంధించి అనేక సిఫారసులు చేశాయి.

”గత ఏడాదిలో తెలంగాణలో అభివృద్ధి వ్యయంలో గణనీయమైన పురోగతి వున్నట్లు ఆ సమీక్షలో విదితమైంది. అంతే కాకుండా తెలంగాణా ప్రాంతంలో మొత్తం వ్యయం – నిష్పత్తి రాష్ట్ర సరాసరి వ్యయం కంటే మెరుగ్గా వున్నట్లు సమీక్షలో వెల్లడైనది.

”1969-70 సంవత్సర కాలంలో గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించిన భారీ కార్యక్రమం క్రింద 817 గ్రామాలకు విద్యుదీకరణ చేయటం జరిగింది. ఫలితంగా తెలంగాణలో విద్యుదీకరణ చేయబడిన గ్రామాల శాతం 25కు పైగా హెచ్చింది. ఇదే విధంగా తెలంగాణా ప్రాంతంలో పంచాయతీ రాజ్‌ సంస్థలు 270కి.మీ. సిమెంట్‌, తారు రోడ్లను, 383 కి.మీ. కంకర రోడ్లను నిర్మించడం జరిగింది.

”ఇరిగేషన్‌, రూరల్‌ ఇరిగేషన్‌, రుణ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మున్నగు ముఖ్యమైన రంగాలలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక పథకాలను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనితోపాటు తెలంగాణ ప్రాంతం అభివృద్ధికై దీర్ఘకాలిక బృహత్తర పథకాన్ని రూపొందించాలని సంకల్పించటం జరిగింది.

సర్వీసులు :

వివిధ కేటగిరీలకు చెందిన గెజిటెడ్‌ అధికారుల సమస్యల పరిశీలనకై యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఛైర్మన్‌ నాయకత్వాన కేంద్ర సలహా సంఘం ఇటీవల హైదరాబాద్‌ సందర్శించి సముచితమైన సిఫారసులను కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖకు సమర్పించింది. వివిధ శాఖలకు చెందిన 876 మందికి పైగా గెజిటెడ్‌ అధికారులు, 2722 మంది నాన్‌-గెజిటెడ్‌ అధికారులు కేంద్ర సలహా సంఘానికి, రాష్ట్ర సలహా సంఘానికి తమ కోర్కెలను తెలియజేశారు. ఈ సలహా సంఘాల సిఫార్సుల ప్రాతిపదికగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందినవి. భారత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయటానికై సెక్రటేరియట్‌లోని వివిధ అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్టుమెంటులకు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వానికి చెందిన జాయింట్‌ సెక్రటరీల బృందం ఇంతవరకు ఆరుసార్లు హైదరాబాద్‌ సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి, భారత ప్రభుత్వ నిర్ణయాలు అమలు విషయంలో తమ సలహాలను అందజేయడం జరిగింది. ఈ నిర్ణయాల అమలుకు సంబంధించి నివేదికలను జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతున్నది.

గ్రేడేషన్‌ జాబితాలు :

రాష్ట్రంలో విలీనీకరణ చేయవలసియున్న 3612 మంది గెజిటెడ్‌ ఆఫీసర్లు, 16180 మంది నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లలో, 2390 మంది గెజిటెడ్‌ ఆఫీసర్లు, 16097 మంది నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లకు సంబంధించిన గ్రేడేషన్‌ జాబితాలు ఇప్పటికే ప్రచురింపబడినవి. ఇంకా 1222 మంది గెజిటెడ్‌ ఆఫీసర్లు 83 మంది నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లకు సంబంధించిన జాబితాను ప్రచురించవలసి వుంది. అవి ఇప్పుడు పూర్తయ్యే దశలో వున్నవి.

”ప్రాంతీయ సంఘం

అధికారాల విస్తరణ :

తెలంగాణా ప్రాంతీయ సంఘం ఆధికారాలను విస్తృతం గావించే చర్యలో భాగంగా యూనివర్సిటీ విద్య, చిన్నతరహా, భారీ తరహా పరిశ్రమలు, సబార్డినేట్‌ సర్వీసులకు రిక్రూట్‌మెంట్‌ పద్ధతులు, తెలంగాణా ప్రజలకు తగినంతగా ఉద్యోగావకాశాల సాధన తదితర అంశాలను, 1958 ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ సంఘం ఉత్తర్వును సవరించడం ద్వారా ప్రాంతీయ సంఘానికి అప్పగించటం జరిగింది.

”తెలంగాణా ప్రాంతం ఆదాయ, వ్యయాలకు సంబంధించి వార్షిక బడ్జెట్‌పై ప్రాంతీయ సంఘం ప్రత్యేక చర్చ జరపడానికి వీలుగా ప్రాంతీయ సంఘం అధికారాలను విస్తరించడం జరిగింది. తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి వార్షిక ఆర్థిక ప్రకటనలో వివరాలను చూపడానికి ఇది అవకాశాన్ని ఏర్పరుస్తున్నది. ఈ నిర్ణయాన్ని దృష్టిలో వుంచుకుని ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ఆదాయ, వ్యయం వివరాలను ప్రప్రథమంగా వేర్వేరుగా చూపడం జరిగింది.

”తెలంగాణా ప్రాంతం అభివృద్ధికై పథకాలను రూపొందించే విషయంలో ప్రాంతీయ సంఘానికి ఇతోధికాధికారం వుండడానికి వీలుగా, తెలంగాణా ప్రాంతీయ సంఘానికి చెందిన చట్టబద్ధమైన అధికారాలను ఆ విధముగా విస్తృతంచేయడం జరిగింది.

తెలంగాణపై 250 మంది ఎంపిల విజ్ఞప్తి

శుభారంభం – ప్రజా సమితి

తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సమావేశమైంది. ‘తెలంగాణ సమస్య పరిష్కారంపై ఒక కొత్త సూచన చేస్తూ 250 మంది పార్లమెంట్‌ సభ్యులు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి ఒక వినతిపత్రం సమర్పించటం శుభారంభం’ అని టి.పి.ఎస్‌. తీర్మానం చేసింది.

‘250 మంది ఎం.పి.లు తెలంగాణ సమస్యలో శ్రద్ధ తీసుకోవడం శుభారంభ’మని డా|| చెన్నారెడ్డి అన్నారు.

కె.వి. రంగారెడ్డి మృతికి విచారం వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానాన్ని కూడా కార్యవర్గం ఆమోదించింది.

”ప్రత్యేక తెలంగాణ వల్లనే

సమస్యల పరిష్కారం సాధ్యం”

వచ్చే సంచికలో…

Other Updates