శ్రీ విళంబి నామ సంవత్సరంలో మేఘాధిపతి శుక్రుడు అయినందువలన అతివృష్టి. స్సుభిక్షంచసస్యవృద్ధిర్నిరామయ:| క్షీరప్రదాస్సదాగావ: శుక్రే మేఘాధిపే సతి||
వానలు అధికముగా ఉండును, కరువు లేకుండును, పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. జనాలకు రోగబాధలు ఉండవు, పశువుల వృద్ధి కలుగుతుంది. సస్యాధిపతి చంద్రుడు అయినందువలన
జలధాన్యాని సర్వాణి స్థల ధాన్యానియానిచ| వృక్ష సస్యాభివృద్ధిస్యాచ్చంద్రే సస్యాధిపేసతి||
జలపంటలు అయిన వరి మొదలయినవి, మెట్టపంటలు, తోటలు అన్ని కూడా చక్కగా ఫలిస్తాయి. ఈ సంవత్సరము రైతులకు పాడి పంటల సమృద్ధి కలుగుతుంది.
ఆర్ఘాధిపేయదా శుక్రే సర్వధాన్యార్ఘ వృష్టికృత్| శ్వేతధాన్యం సుఫలితం సుభిక్షం స్యాచ్చ భూతలే||
శుక్రుడు అర్ఘాధిపతియైన అన్ని ధాన్యాల వెలలు పెరుగుతాయి. తెల్లని ధాన్యము బాగా ఫలించును. దేశము క్షేమముగా ఉండును.
మేషరాశి
ఈ రాశి వారికి సంవత్సర ఆది నుంచి గురువు సప్తమ స్థానంలో ఉన్నందున చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. గతంలో పూర్తి కాని కొన్ని పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారులవల్ల మేలు జరుగుతుంది. అవసరానికి తగిన సహాయ సహకారాలు అందుతాయి. నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసే దిశగా ఆలోచనలు చేయండి. కీలక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మాట పట్టింపులకు పోకండి. కుటుంబ సభ్యులతో, వ్యాపార భాగస్వాములతో, అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితు లలో ఓర్పు కోల్పోరాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాది రంగాలలో మీదైన ప్రతిభను కనబరుస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్టోబర్ నెలనుండి గురువు అష్టమంలో సంచరిస్తున్నందున కోపం పెరిగి, కఠినం గా మాట్లాడుతారు. కాబట్టి, శాంతం చాలా అవసరం. అలసట ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు గుర్తెరిగి ముందుకు సాగాలి. ప్రతి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితులలో కూడా కుల దేవతను మరువరాదు. నేత్ర, హృదయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్ర హ్మణ్యస్వామిని ఆరాధించడంవలన ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో గడుపుతారు.
ఆదాయం: 14; వ్యయం: 11; రాజపూజ్యం: 5; అవమానం: 7
వృషభం
వృషభ రాశి వారికి సంవత్సర పూర్వార్థంలో షష్ఠి గురువు, అష్టమ శని సంచారంవలన సుఖపడేందుకు కావాల్సిన అన్ని వ్యవస్థలు ఉండి కూడా సుఖంలేని పరిస్థితి. తల్లికి అనారోగ్య సూచనలు, దగ్గరివాళ్లు దూరం కావడం, అకారణంగా విరోధాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రులవల్ల ధన వ్యయం జరుగుతుంది. మిత్రులుగా నటించేవారు తారసపడతారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు చాలా వరకు మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు. నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. సంవత్సర ఉత్తరార్థంలో గురువు సప్తమ స్థాన సంచారంవలన మొదలుపెట్టిన పనులు చకాచకా పూర్తి అవుతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు పొందుతారు. వృత్తి, విద్యా, ఉద్యోగ, రాజకీయ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన సూచనలు గోచరిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా గొప్ప ఆలోచనా విధానంతో హుషారుగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధన, కనక, వస్తు, వాహన, భూలాభాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ ఆరాధనవలన శ్రేయస్సు లభిస్తుంది.
ఆదాయం: 8; వ్యయం: 5; రాజపూజ్యం: 1; అవమానం: 3
మిథునం
మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పూర్వార్థంలో గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నందున, వ్యవసాయం చేసుకునేవారికి లాభాలు, వాహన లాభం, నూతన స్థలాలు, ఇండ్లుకొనే అవకాశాలు, సంతాన వృద్ధి, విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థాన స్థితి శని సంచారంవలన ఆర్థికంగా అభివృద్ధి ఉన్నా మానసికంగా ఆందోళనలు కలుగుతాయి. కార్యాకార్య విచక్షణ కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ నా అనుకున్న వాళ్ళు, మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు, కుటుంబ సభ్యులు, మనను అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బలమైన ప్రయత్నంతో పనులను పూర్తి చేస్తారు. ఆటంకాలు అధికమవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు చేదాటిపోయే అవకాశం ఉంది. మొహమాటంతో ఇబ్బందులు పెరుగుతాయి. కానీ దత్తాత్రేయస్వామి, దక్షిణామూర్తి ఆరాధన వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలవారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. మీరు ఊహించినదానికంటే అధిక ధన లాభమును పొందుతారు. సొంతింటి నిర్మాణ పనులలో ముందడుగు పడుతుంది. భవిష్యత్తును గుర్తు పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ముందడుగు వేస్తారు. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఉన్నత స్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి, రాజకీయరంగం వారికి అధికార ప్రాప్తి సూచనలు గోచరిస్తున్నాయి.
ఆదాయం: 14; వ్యయం: 2; రాజపూజ్యం: 4; అవమానం: 3
కర్కాటకం
కర్కాటక రాశివారికి ఈ విళంబి నామ సంవత్సరంలో గురు బలం, శని బలం నిండుగా ఉన్నాయి. శని షష్ఠ స్థానంలో ఉన్నందువలన చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీరు వేసే భవిష్యత్ ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, చేపట్టిన పనులు స్వల్ప ప్రయత్నంతోనే పూర్తి అవుతాయి. కానీ సంవత్సర ఆదిలో గురువు చతుర్థంలో సంచరిస్తున్నందువలన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఊహించని ఇబ్బందులు వచ్చి పడతాయి. కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సహకారంతో, పట్టుదలతో ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. ముఖ్య విషయాల్లో సమష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సంవత్సర ఉత్తరార్థంలో గురువు పంచమ స్థానంలో మిత్ర క్షేత్ర స్థితిలో సంచరించే కాలంలో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకొని గొప్ప ఫలితాలు పొందుతారు. బంగారు భవిష్యత్తుకై మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో వ్యవహారములలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, విద్యా క్షేత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పని మీపై అధికారులను, పెద్దలను మెప్పిస్తుంది. నూతన వాహనయోగం ఉంది. అనారోగ్యాన్ని నిర్లక్షించకూడదు. దుర్గాదేవిని ఆరాధించడంవలన సకల శుభాలు కలుగుతాయి.
ఆదాయం: 8; వ్యయం: 14; రాజపూజ్యం: 7; అవమానం: 3
సింహం
సింహం రాశి వారికి సంవత్సర ఆదినుండి రాహు వ్యయంలో ఉండుటచే చేపట్టే పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి, కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు, ఆర్థికంగా బాగా ఆలోచించి ఖర్చు పెట్టాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే సత్ఫలితాలను అందుకుంటారు. కొన్ని కీలక విషయాలలో మీ ఆలోచనా ధోరణికి సమాజం నుండి ప్రశంసలు పొందుతారు, ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, ఆర్థికంగా మీకు అనుకూల నిర్ణయాలు వస్తాయి. మీకన్నా చిన్న వాళ్ళు మిమ్ములను మించిపోతారు. మీనుండి ఉపకారం పొందిన వారితో మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవాన్ని కాపాడుకోవాలి. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం ఫరవాలేదు అనిపిస్తుంది. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంవల్ల తర్వాత ఇబ్బందులు పడతారు. తొందరపడి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి. సంవత్సర ఉత్తరార్థంలో మీరు పనిచేసే రంగంలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీదే పైచేయి అవుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన మంచిది.
ఆదాయం: 11; వ్యయం: 11; రాజపూజ్యం: 3; అవమానం: 6
కన్యారాశి
కన్యారాశి వారికి గురువు ద్వితీయంలో సంచరిస్తున్నందున ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మంచి పనులు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. మీ పరిధిలో మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఆర్థికంగా శుభకాలం. స్థిరాస్థిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అనవసర ప్రయాణాలు చేస్తారు. కొన్ని విషయాల్లో మీరు ఆశించిన ఫలితములు రాకపోవచ్చు. కవులకు, విద్యావేత్తలకు విద్యారంగం వాళ్ళకు మంచి కాలం. మీరు చేసే స్వధర్మాచరణ మిమ్ములను కాపాడుతుంది. సంవత్సర ఉత్తరార్థంనుండి గురువు తృతీయంలో సంచరించుటవలన మాట విలువను కాపాడుకోవాలి. బంధువులతో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టిస్తే కానీ సానుకూల పరిస్థితులు కనపడవు, అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగలేదని కుంగిపోకండి, ఆర్థిక సమస్యలతో జాగ్రత్త. చతుర్థంలో శని ఉన్నందున వాతంలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించండి. సంతానంతో గొడవలు పడకుండా ఓర్పుగా వ్యవహరించండి, నీలాపనిందకు అవకాశం ఇవ్వకండి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంత మేలు జరుగుతుంది. మహా విష్ణు నామస్మరణ మంచి చేస్తుంది.
ఆదాయం: 14; వ్యయం: 2; రాజపూజ్యం: 6; అవమానం: 6
తుల
తులారాశి వారికి సంవత్సరాదినుండి గురువు జన్మలో ఉన్నందువలన అధికారులతో జాగ్రత్త. మాట విలువ కాపాడుకోవాలి. పనుల్లో ఆటంకాలు వస్తాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, శని తృతీయస్థానం గోచారంవలన విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి, స్థిరాస్తి కొనుగోళ్ళు లాభాన్ని ఇస్తాయి. తలపెట్టిన ప్రతి పనిలో తోటివారి సహాయ, సహకారాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు, పెద్దల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు, ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. క్రమంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు, మానసికంగా దృఢంగా ఉంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. అభివృద్ధివైపు అడుగులు వేస్తారు, చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి, వ్యాపారులు లాభాలను పొందుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి తగిన ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. కుల దేవతా ఆరాధన వలన సంవత్సరం మొత్తం అనుకూలకరంగా ఉంటుంది.
ఆదాయం: 8; వ్యయం: 5; రాజపూజ్యం: 2; అవమానం: 2
వృశ్చికం
వృశ్చికరాశి వారికి సంవత్సరాది నుండి వ్యయంలో గురువు ద్వితీయంలో శని సంచారం వలన, ధనవ్యయం అధికం అవుతుంది. స్థాన చలనాలు, స్థాననాశాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఏలిననాటి శని దోషం వలన చెడు పనులకు దూరంగా ఉండాలి. ఆలోచించి మాట్లాడాలి. పనులను ఒకటి రెండుసార్లు ఆలోచించి ఆరంభించాలి, మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టే వారుంటారు, అనవసర విషయాలకు స్పందించకండి. ఆగ్రహావేశాలకు గురికాకండి, మీ ఆత్మాభిమానాన్ని అహంకారంగా, మీ ఓర్పును చేతకానితనంగా భావించేవారు. మీ మంచితనాన్ని దురుపయోగం చేసుకోవాలి అనుకునేవారు అధికం అవుతారు. ఎవరితో వ్యవహారం చేయాలి, ఏఏ పనులు చేయాలి అనే ప్రణాళిక ఉండకపోవడం వలన ఆటంకాలు తప్పవు. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితచి వ్యవహారం చేయండి, బంధువుల వ్యవహారంలో అతి చొరవ తీసుకోవద్దు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాహన గండాలు ఉంటాయి. బాగా ప్రయత్నం చేస్తే పనులు పూర్తి అవుతాయి, మీమీ రంగాలలో స్పష్టత లోపించకుండా జాగ్రత్త తీసుకోవాలి, డబ్బును, మాటను పొదుపుగా వాడాలి. చండీమాతను ఆరాధించడంవలన, కష్టాల సముద్రంనుండి బయటపడతారు.
ఆదాయం: 5; వ్యయం: 5; రాజపూజ్యం: 4; అవమానం: 5
ధనస్సు
ధనస్సు రాశి వారికి సంవత్సరాదినుండి గురు లాభ స్థాన స్థితి వలన గత కొంతకాలంగా పరిష్కారంకాని కొన్ని పనులు వెంటనే పరిష్కారమవుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. అన్నింటా మీదే విజయం. ఆనందకర వాతావరణము ఉంటుంది. అధికారుల సహకారంతో అనుకున్న పనులను అనుకున్న సమయంలోగా పూర్తి చేయగలుగుతారు. ధైర్యే సాహసే లక్ష్మీ అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. ఆర్థికంగా ఎదుగుతారు. పెద్దల సలహాలు తీసుకోండి, తోటివారిని లుపుకోండి. విభేదాలకు తావివ్వకండి, కొన్ని సంఘటనలు బాధ కలిగించినా, మానసికంగా ధృఢంగా ఉంటారు, మీమీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది, కీలక విషయాలలో అవగాహన పెంచుకోవాలి, సంవత్సర ఉత్తరార్థం మిశ్రమ ఫలదాయకంగా ఉండి, ఆర్థిక లాభాన్ని, స్థల, గృహ, వాహన లాభాలను ఇచ్చి, బంధుమిత్రులతో మన:స్పర్థలను, అపకీర్తిని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. దారిలోపోతున్న సమస్యలను ఇంట్లోకి తెచ్చిపెట్టుకోకూడదు. స్వయంకృతాపరాధాలకు అవకాశం ఇవ్వకూడదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకుసాగితే శుభ ఫలితాలు అందుకుంటారు, మీ పట్టుదలే మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం, కుల దేవతారాధన దత్తాత్రేయస్వామి ఆరాధన వలన అన్నిరకాల శుభాలు కలుగుతాయి.
ఆదాయం: 11; వ్యయం: 2; రాజపూజ్యం: 11; అవమానం: 5
మకరం
మకర రాశివారికి గురువు దశమంలోఉండటం ఏలినాటి శనిదోషం వలన సంవత్సర పూర్వార్థంలో అదృష్టం దూరం అవుతుంది. కాలం సహకరించదు. విజయం సాధించడంలో విఘ్నాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. పరిస్థితుల ప్రభావం వలన పనులు ఆలస్యం అవుతాయి. వృధా సంచారాలు చేయాల్సి వస్తుంది, ఆలోచించి మాట్లాడాలి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడరు. కొన్ని సందర్భాలలో ఒకటనుకుంటే ఇంకోటి అవుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. కొత్త వారిని తొందరగా నమ్మకండి. లక్ష్యంపట్ల అవగాహన పెంచుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. ఎవ్వరితోనూ మాట పట్టింపుకు పోరాదు. కీలక సమస్యలను పరిష్కరించి విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా అంత అనుకూలమైన కాలం కాదు. స్వంత ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. అపార్థాలకు తావివ్వకుండా, ఆగ్రహావేశాలకు ఆమడ దూరంలో ఉండడం చాలా మంచిది. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి, అవసరానికి మించిన ఖర్చులుంటాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి, అవకాశాలు తొంగిచూస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో కూడా బద్ధకించకండి. కుటుంబంలో చిన్నపాటి కలహాలు కూడా రాకుండా జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఆరోగ్యం ఫరవా లేదనిపిస్తుంది. అనవసర విషయాలతో కాలహరణ చేయకుండా ఈశ్వర ఆరాధన చేస్తూ రావాలి. గురు, శని జపాలు చేయడం మంచిది.
ఆదాయం: 14; వ్యయం: 11; రాజపూజ్యం: 5; అవమానం: 2
కుంభం
కుంభ రాశివారికి ఈ సంవత్సరాదినుండి లాభ స్థాన స్థిత శని, నవమ గురువుల సంచారంవలన ధనలాభం, వాహన, గృహ లాభం, ఆస్తిని వృద్ధి చేసుకుంటారు, ఆచార సంప్రదాయాలతోపాటు గౌరవ మర్యాదలు పొందుతారు, విందు, వినోదాలతో సంతోషంగా గడుపుతారు, చేపట్టే పనులలో విజయాన్ని సాధిస్తారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. నూతన బాధ్యతలుచేపడతారు, వ్యాపారంలో అదృష్టం పండుతుంది. స్పష్టమైన ఆలోచనలతో సంపదలు పెరుగుతాయి. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు శుభకాలం. కీలక వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు, మీమీ రంగాలలో సత్ఫలితాలు పొందుతారు, అదృష్టవంతులు అవుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. చైతన్యవంతమైన ఆలోచనలు ముందుకు నడిపిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శతృవులు మిత్రువులు అవుతారు. ఇలాంటికాలం మళ్ళీ రావాలంటే చాలా సమయం వేచి చూడాలి. స్థిరాస్థి వ్యాపారం బాగా కలసివస్తుంది. దైవబలం రక్షిస్తుంది. కాలం ప్రశాంతంగా గడుస్తుంది. లక్ష్మీనారాయణ ఆరాధన చాలా మంచిది.
ఆదాయం: 5; వ్యయం: 5; రాజపూజ్యం: 7; అవమానం: 5
మీనం
మీనరాశి వారికి సంవత్సర ఆదిలో అష్టమ గురు ప్రభావంవలన వృత్తి, వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించకముందే బాగా ఆలోచించి ముందడుగు వేయాలి, గతంలో నిర్లక్ష్యం చేసిన సమస్యలు ఇప్పుడు బాధపెడుతాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. నా అనుకున్న వాళ్ళు కూడా మనకు సహాయ, సహకారాలు అందించరు. సరైన మార్గదర్శనం లేక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు సమస్యలు వస్తాయి. విజయం సాధించాలి. అంటే యుద్ధం చేయక తప్పదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆటంకాలు అధికమవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. అనవసర ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడాలి, అధికారుల దగ్గర అణిగిమణిగి ప్రవర్తించాలి, కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఉత్తరార్థంలో గురువు నవమి సంచారకాలంలో విజయసిద్ధి ఉన్నది. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాలలో అధికారులు లేదా పెద్దల మన్ననలను పొందుతారు. అంకిత భావంతో ముందుకుసాగి ఉద్యోగ, వ్యాపారాలలో సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు, ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక విషయాలు అనుకూలకరంగా ఉంటాయి. దత్తాత్రేయస్వామిని ఆరాధించడంవలన సకల విధమైన శుభాలు పొందుతారు.
ఆదాయం: 11; వ్యయం: 2; రాజపూజ్యం: 3; అవమానం: 1
– విరివింటి ఫణిశశాంక శర్మ