వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇది ప్రింటర్. ఈ యంత్రం ఇ.వి.ఎంకు అనుసంధానం చేసి ఉంటుంది. ఈ రెండూ కూడా ఓటర్ క్యాబిన్‌లోనే ఉంటాయి. ఓటర్ తాను ఓటు వేసిన అభ్యర్థికే ఆ ఓటు పడిందా లేదా అని తనిఖీ చేసుకోవడానికి వీలుగా దీనిని రూపొందించారు. ఇది ఓటు వేసిన తక్షణమే తనిఖీ ఫలితం చూపుతుంది.
ఓటరు తన ఓటు వేయడానికి ఇ.వి.ఎం యంత్రంలోని బ్యాలటింగ్ యూనిట్ లో తాను ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌ను నొక్కినప్పుడు…..ఇవిఎం లో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఎర్రబల్బు వెలుగుతుంది…అదే సమయంలో ఇవిఎం పక్కనే ఉన్న ఇవిఎం ప్రింటర్(వివిప్యాట్) లో ఒక స్లిప్ ప్రింట్ అవుతుంది. దానిలో సీరియల్ నంబరు, ఓటు దక్కించుకున్న అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నం ఉంటాయి. దానిని ఓటరుకు మాత్రమే కనబడేవిధంగా అమరుస్తారు. ఆ సమయంలో ఓటరు అప్రమత్తంగా ఉండి ఏడు సెకన్ల వరకు మాత్రమే కనిపించే ఆ స్లిప్‌ను చూడవచ్చు. తరువాత దానంతట అదే కట్ అయి కింద సీలువేసి ఉన్న డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది
ఆ స్లిప్‌ను చూసి ….మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, క్రమసంఖ్య, అభ్యర్థి ఎన్నికల చిహ్నం కూడా మీ ఎంపిక ప్రకారమే నమోదయిపోయాయని నిర్ధారించుకోవచ్చు.మీరు వేసిన ఓటు మీరు ఎంచుకున్న అభ్యర్థికి మాత్రమే పడింది…అనడానికి ఇది సాక్ష్యం. అంతే కాదు, మీరు ఎవరికి ఓటు వేసినది కూడా మరొకరు చూసే అవకాశం లేదు, కాబట్టి మీ గోప్యత హక్కుకు భంగం కలగదు. ఈ యంత్రాలు కేవలం ఎన్నికల అధికారుల నియంత్రణలో మాత్రమే ఉంటాయి. తాము ఓటు వేసిన వారికి కాకుండా మరొకరికి పడిందనేటటువంటి ఫిర్యాదులు, అభ్యంతరాలొచ్చినప్పడు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.
వివిప్యాట్ సామర్ధ్యం
వివిపిఏటిలను ఇప్పటివరకు 255 శాసనసభ నియోజకవర్గాలలోనూ, 9 లోక్‌సభ నియోజక వర్గాలలోనూ జరిగిన ఎన్నికలలో వాడడం జరిగింది. 2017లో జరిగిన హిమాచల్, గుజరాత్ ఎన్నికల నుండి ఇప్పుడు ప్రతి ఎన్నికలలో వాటిని వాడుతున్నారు.