”శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే / భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత / లక్ష్మీనసింహ మమ దేహి కరావలంబమ్”
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఉంది. ఈ క్షేత్రం అతి ప్రాచీనతను గూర్చి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు. ఎప్పుడు, ఏ రాజు కాలంలో నిర్మించబడిందో తెలియదు కానీ ఋష్యశంగ మహర్షి, శాంతల పుత్రుడైన యాదమహర్షి కోరిక మేరకు నరసింహస్వామి ఆలయ శిఖరంపైన షట్కో ణాకారంలో సుదర్శనచక్రం రూపంలో భక్తులను కాపాడుతానని వరమిచ్చాడు. యాదమహర్షి తపస్సుకు మెచ్చి అక్కడ లక్ష్మీనరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదనే ఆయన పేరుమీదుగానే ఆ కొండ యాదగిరిగా ప్రసిద్ధి పొందింది. స్వామి ప్రత్యక్షమైంది కూడా కొండ కింద ఉన్న పాత లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.
ఇంకో ఐతిహాసిక కథనం ప్రకారం యాద మహర్షి నరసింహస్వామిని ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో ఆంజనేయస్వామి అనుజ్ఞతో తపస్సు చేయగా నరసింహస్వామి ఉగ్రరూపంలో దర్శనమిచ్చాడట. కానీ యాదర్షి శాంతరూపంలో కొండపై లక్ష్మీసమేతుడై కొలువు ఉండమని కోరగా స్వామి లక్ష్మీనరసింహుడుగా కొలువైనాడు. యాద మహర్షి కోరిక మేరకే స్వామివారు జ్వాల, యోగ, నంద, గరడ భేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి క్షేత్రంలో స్వయం వ్యక్త రూపాలుగా వెలసి భక్తులను కాపాడుతున్నాడు. అందుకే ఈ క్షేత్రం పంచ నారసింహక్షేత్రంగా భక్తులచే పిలువబడుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత ఆలయాల నిర్వహణ అంత గొప్పగా లేదు. నిరాదరణకు గురైనాయి. క్షేత్రాల్లో అభివద్ధి కార్యక్రమాలు జరగాల్సినవిధంగా జరగలేదు. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి ఆలయాలను అభివద్ధి పర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
”తనయుడు చెఱువును గావ్యం
బు నిధానము గుడి వనంబు భూదేవస్థా
పనమును నను నియ్యేడును
జను శాస్త్రములందు సప్త సంతతులనఁగన్”
అప్పకవీయంలో చెప్పబడిన ఈ పద్యం సప్త సంతానములలో ఏ ఒక్కటి చేసినా వంశంలో తరతరాల వారు చేసిన దోషాలు నివారింపబడి ముక్తిని పొందుతారని తెల్పుతుంది. పూర్వకాలంలో రాజులు ప్రజా పరిపాలన కొనసాగించేటప్పుడు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేవారు. అందులో భాగంగానే తన తర్వాత రాజ్యమేలేందుకు పుత్ర సంతానాన్ని కాంక్షించేవారు. ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు, పంటలు పండేందుకు చెరువులు త్రవ్వించేవారు. ఆధ్యాత్మిక చింతనతో గుడులను నిర్మించి, అందులో వారి ఇష్టదైవాలను ప్రతిష్టించేవారు. అంతేకాదు కవులను ఆదరించి వారి కావ్యాలను అంకితం తీసుకొని వారికి కానుకలు సమర్పించి గౌరవాన్ని కల్పించేవారు. బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసేవారు. ఇవన్నీ లోకంలో సప్త సంతానాలుగా ప్రసిద్ధి చెందినాయి.
ఆధునిక కాలంలో రాజ్యాధికారం ఉన్నవారు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే కాబట్టి వారు ప్రజలకు అనుకూలమైన, వారి అభీష్టం మేరకు పరిపాలన కొనసాగించాలి. ఆ పరంపరను కొనసాగిస్తున్నవారు మన ముఖ్యమంత్రివర్యులు.
ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి తగిన ఆర్థిక వనరులను ప్రభుత్వం ప్రతి ఆర్థిక బడ్జెట్‌లో విడుదల చేసింది. ఆలయనిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉండాలనే ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆలయ రూపకర్తలు, స్థపతులు దీన్ని కాకతీయ వాస్తుశిల్పకళకు దగ్గరగా ఉండేవిధంగా శిల్పాలను, గోపురాలను స్తంభాలను చెక్కాలని నిర్ణయించుకుని ఆ దిశగా పనులు సాగించారు.
రాష్ట్రప్రజలందరు వారి సంతానమే కాబట్టి అందరికీ పుణ్యం కలగాలనే ఆలోచనతో ఆధ్యాత్మికచింతన, దైవభక్తి, ప్రజా సంక్షేమ ఆలోచనలు కలిగిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రథమంగా తెలంగాణలో ప్రముఖ క్షేత్రమైన యాదగిరిగుట్టను ఒక ‘టెంపుల్ సిటీ’గా తీర్చిదిద్ది తెలంగాణకే తలమాణికంగా నిలబెట్టాలని సంకల్పం చేసుకున్నారు.
ఈ సంకల్పబలం సత్వర కార్యరూపం దాల్చింది. దానికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ‘యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని నియమించింది. ఈ అథారీటీ ముఖ్య లక్ష్యం యాదగిరిపల్లి, సైదాపూర్, మల్లాపూర్, దాతార్‌పల్లి, గుండ్లపల్లి, రాయగిరి, బసవపురం గ్రామాలతో కలిపి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్క తికంగా యాదగిరిగుట్టను ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడం.
ఈ అథారిటీలో ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ కిషన్‌రావుగారు వైస్ ఛైర్మన్‌గా, ఇంకా భువనగిరి పార్లమెంట్ సభ్యులు, ఆలేరు, భువనగిరి శాసనసభ్యులు ఇంకా 13 మంది సభ్యులుగా ఉన్నారు. 2015లో ఈ అథారిటీకి రూపకల్పన జరిగింది.
పాంచరాత్ర ఆగమశాస్త్ర, వాస్తుశాస్త్రాల ప్రకారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ చినజీయర్ స్వామివారి సూచనలను పాటిస్తూ, ప్రధాన స్థపతి సుందరరాజన్ బందం మహోత్క ష్ట, అద్భుత శిల్పకళాశోభితమైన దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను, నిర్మాణ విధానాన్ని ముఖ్యమంత్రి సమర్పించారు. మే 30, 2015లో ఈ మహత్కార్యానికి శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి, గౌరవ తెలంగాణ గవర్నర్ నరసింహంగారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావులు శంకుస్థాపన చేసినారు.
యాదగిరి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు 14 ఎకరాలకు సంబంధించిన ప్రణాళిక మార్చి 18న 2016 న అథారిటీ అంగీకరించింది. ఈ ప్రణాళికలో 12 భాగాలుగా అంచెలవారీగా నిర్మాణ క్రమం కొనసాగుతుంది. అందులో
1. మొత్తం నిర్మాణానికి సంబంధించి అడ్డగోడను నిర్మించడం
2. మొదటి ప్రాకార నిర్మాణం
3. రెండవ ప్రాకార నిర్మాణం
4. మొదటి ప్రాకార మండపంలో స్ట్రాంగ్‌రూం, వాహన మండపం, దేవతా వస్త్రాల గది, అష్టోత్తర మండపం, పూజాసామాగ్రిని ఉంచే గది, పేష్కర్ ఆఫీస్, సిబ్బంది గది, ఆంజనేయస్వామి, ఆకుపూజ మండపం, పూలు, పూలదండలు ఉంచే గది డిజైన్ చేయబడ్డాయి.
5. రెండవ ప్రాకార మండపంలో అద్దాల మండపం, కల్యాణ మండపం, అర్చకుల భోజన శాల, రామానుజకూటం, పోటు, పోటుకు సంబంధించిన గది, నిత్య అష్టోత్తరం, ప్రవచన మండపం, హోమగుండం, యజ్ఞశాల, దీపాలంకార మండపం, ఉత్సవ మండపం ఉంటాయి.
ముఖమండపంలో ఆళ్వారు ఆలయం, ఆండాల్ ఆలయం, లక్ష్మీఅమ్మవారి ఆలయం, గరుడ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి.
ప్రధాన ఆలయానికి నాలుగు దిశల్లో ఐదంతస్తుల గోపురాలు, పడమర వైపు ఏడంతస్తుల మహారాజగోపురం, దక్షిణదిశ ప్రవేశంలో మూడంతస్తుల గోపురం, ఐదంతస్తుల విమానగోపురం ప్రణాళికలో ఉన్నాయి.
ఇంకా మాడవీధి, బ్రహ్మూెత్సవం జరిపే స్థలం, 108 అడుగుల కాంస్య ఆంజనేయ విగ్రహం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్ ఆఫీస్, వి.వి.ఐ.పిలకు గెస్ట్‌హౌస్‌లు నిర్మాణ ప్రణాళికలో భాగం.
నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడానికి భక్తుల దర్శనార్థం ఆలయం మూసివేసి 21.4.2016లో బాలాలయాన్ని నిర్మించినారు. అప్పటి నుండి భక్తులు స్వామిని ఈ ఆలయంలోనే దర్శించుకుంటున్నారు.
ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి తగిన ఆర్థిక వనరులను ప్రభుత్వం ప్రతి ఆర్థిక బడ్జెట్‌లో విడుదల చేసింది. ఆలయనిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉండాలనే ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆలయ రూపకర్తలు, స్థపతులు దీన్ని కాకతీయ వాస్తుశిల్పకళకు దగ్గరగా ఉండేవిధంగా శిల్పాలను, గోపురాలను స్తంభాలను చెక్కాలని నిర్ణయించుకుని ఆ దిశగా పనులు సాగించారు. అంతేకాదు ఏండ్లకొద్ది ఆలయం నిలిచి, అందలి దైవతం భక్తులకు ఆశీస్సులు అందించాలనే ఆకాంక్షతో ఈ నిర్మాణంలో గ్రానైటును మాత్రమే ఉపయోగించారు. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. రాజ ప్రాకారాలు, గోపురాలు అన్నీ గ్రానైటు నిర్మాణంలో జరిగినాయి. ఇది చాలా కష్టసాధ్యమైనది కూడా. రాళ్ళను చెక్కి వాటిని అందమైన శిల్పాలుగా మలచడం అంత సులువైనది కాదు. దీనికై సుమారు వందల సంఖ్యలో శిల్పులు, స్థపతులు నిరంతరం శ్రమించాలి, శ్రమిస్తున్నారు. ఇందుకు కావలసిన శిలల సేకరణ ప్రకాశంజిల్లాలోని గురుజపల్లెనుండి చేసినారు. మొత్తం 2.5 లక్షల టన్నుల రాయి అక్కడినుండి యాదాద్రికి చేరుకుంది.
నిర్మాణ దశలో ప్రధాన స్తపతులు, ఉప స్తపతులు, శిల్పులు, ఇతర పరిచారక సిబ్బంది చాలా నియమబద్ధంగా పనిచేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలవారు ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములై స్వామి సేవలో నిమగ్నమైనారు. అద్భుత శిల్పకళాశోభితమైన సింహాలతో కూడిన స్తంభాలు, లతలు, పూర్ణకుంభాలు ఇంకా అనేక చెక్కడాలతో కళ్ళు చెదిరేవిధంగా ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రాకారాలు, రాజగోపురాలు, ప్రధాన రాజగోపురం, ముఖమండపం, పన్నింద్దరు ఆళ్వారులు, వెలుపలి మండపం, శివాలయం. ఇంకా అనేక నిర్మాణాలు దాదాపు పూర్తి అయినవి. ఇంకా చిన్న చిన్న నిర్మాణాలు పూర్తి కావలసి ఉన్నాయి.
టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ 850 ఎకరాలలో కొన్ని నిర్మాణాలతో రెండు దశలుగా ప్రణాళికను రూపొందించుకొంది. 250 ఎకరాల్లో భక్తుల సౌకర్యం కొరకు డోనర్ స్కీం కింద కాటేజిల నిర్మాణం, ఇంకో 250 ఎకరాల్లో సకల సౌకర్యాలతో ఉద్యానవనాలు, రోడ్లు వంటివి నిర్మించడం. ఇవి నిర్మాణదశలో ఉన్నాయి.
రెండవ దశలో ఆధునిక విల్లాలు, కళ్యాణమండపాలు, ఫుడ్‌కోర్ట్‌లు, సెంట్రల్ పార్క్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హెలీపాడ్, సోలార్ ఎనర్జీ పవర్ సెంటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బస్ టర్మినల్, సెంట్రల్ పార్కింగ్….. ఇంకా అనేక నిర్మాణాలతో ఈ ప్రణాళిక రూపొందించబడింది.
ఇవేకాక కొన్ని సాధారణ అభివద్ధి పనులను కూడా వైటిడిఎ చేస్తుంది. అందులో యాదగిరి గుట్టను ముఖ్యంగా చేసుకొని భోనగిరికోట, కొలనుపాక జైన దేవాలయం, పెంబర్తి గ్రామం, వరంగల్ ఆలయాలను కలుపుతూ ఒక టూరిస్ట్ సర్క్యూట్‌ను అన్ని సౌకర్యాలతో రూపొందించే ప్రయత్నం చేస్తుంది.
రాయగిరి, రాజపేట, తుర్కపల్లి, వంగపల్లిల నుండి యాదాద్రికి నాలుగులైన్ల రోడ్లను ఆర్.బి.శాఖవారి సహకారంతో రూపొందిస్తుంది.8 మీటర్ల వెడల్పుతో 2.71 కి.మీ. మార్గాన్ని ఆలయ గిరిప్రదక్షిణకు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి అభయారణ్యాన్ని అటవీశాఖవారి ఆధ్వర్యంలో ప్రారంభించింది.మిషన్ కాకతీయ పథకం కింద నీటిపారుదల శాఖ వారి ఆధ్వర్యంలో మల్లాపూరు, పెద్దచెరువు, గండిచెరువుల, రాయగిరి చెరువులను పునరుద్ధరిస్తుంది. భారత ప్రభుత్వ సహకారంతో సమీప భవిష్యత్తులో సికింద్రాబాద్‌నుండి యాదాద్రికి ఎంఎంటిస్ రైలు కూడా ఏర్పాటు కానున్నది.ఆలయం సకల విద్యలకు నిలయమనే ఉద్దేశంతో ఇక్కడ ఒక వేదపాఠశాల, శిల్పకళాశాలను నెలకొల్పే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చాలా తక్కువ సమయంలో ఇంతటి అద్భుత నిర్మాణాలను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం యాదగిరి గుట్టను భారతదేశంలో అద్భుతమ్కెన ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నది.
డాక్టర్ భిన్నూరి మనోహరి