హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోంది. కిక్కిరిసిన జనాభాతో హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ జాంలు పెరిగిపోయాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఐటిఐఆర్ లాంటి ప్రాజెక్టులు కూడా వస్తుండటంతో హైదరాబాద్ నగరాన్ని మరింత సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దవలసిన అవసరం వుంది.
దాదాపు రెండు కోట్ల జనాభా నివసించేందుకు వీలుగా, భవిష్యత్ అవసరాలన్నీ తీర్చే విధంగా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనిపై అధికారులు సియంకు ఎప్రిల్ 29, 2015న నివేదిక అందజేశారు. నగరంలో 365 కి.మీ. మేర రోడ్లకు ఇరువైపుల చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆ నివేదికలో పొందుపర్చారు. కూరగాయల మార్కెట్ల నిర్మాణానికి 150 ప్రాంతాలను, మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్సుల కోసం 80 ప్రాంతాలను, బస్‌బేల ఏర్పాటుకు 136 అనుకూలమైన స్థలాలను ఎంపిక చేశారు. వీటికి సియం ఆమోదముద్ర వేశారు.ఇంకా 50 చోట్ల మల్టీ పర్పస్ హాల్స్, 250 చోట్ల పబ్లిక్ టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 36 శ్మశాన వాటికలను ఆధునీకరించాలని, అవసరమైన దోభీఘాట్లు నిర్మించాలని నిర్ణయించారు.
తెలంగాణ కళాభవన్ నిర్మాణం :
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ సమీపంలో 11 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ కళాభారతిభవన్ నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కళా ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు కళాకారులకు శిక్షణనివ్వడానికి కూడా ఈ కళాభవన్ వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ కళాభారతిలో నాలుగు ఆడిటోరియంలు నిర్మించే క్రమంలో డిజైన్ తయారు చేశారు. త్వరలో భూమి పూజ చేయనున్నారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
నగరం నడిబొడ్డున ఆకర్షణీయంగా కనిపించే హుస్సేన్‌సాగర్ దుర్గంధం వెదజల్లడం, కలుషితం కావడం వల్ల హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలనే తలంపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 2014 అక్టోబర్ 15న స్వయంగా నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలలోని నాలాలను పరిశీలించారు. పరిశుభ్రమైన సరస్సుగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, రెయిన్ వాటర్ తప్ప డ్రెయిన్ వాటర్ హుస్సేన్ సాగర్‌లోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్ లోని మురికి నీటిని చాలా వరకు ఖాళీ చేసి శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
నగరం నాలుగు దిక్కుల ఎక్స్ ప్రెస్ హైవేలు
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీని తట్టుకునే విధంగా, రాబోయే 20 నుంచి 40 సంవత్సరాల వరకు మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రహదారుల వ్యవస్థను మెరుగుపరచేందుకు గాను హైదరాబాద్ నాలుగు దిక్కుల ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించడంతో పాటు ఆకాశవీధులు (స్కైవే)లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇస్తాంబుల్ తరహాలో చరిత్రాత్మక కట్టడాలను పరిరక్షించుకుంటూనే రహదారుల వ్యవస్థను మెరుగుపరుస్తారు. పరెడ్ గ్రౌండ్, తూంకుంట, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్‌లలో ఎక్స్ ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, ఉప్పల్ నుండి హైటెక్ సిటి వరకు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నందున ఈ మార్గంలో హైవే నిర్మించాలని నిర్ణయించారు.
మొదటి దశలో కొన్ని మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో ఆకాశ వీధులు (స్కైవే) నిర్మిస్తారు. ఇప్పుడున్న ఫ్లై ఓవర్ల మాదిరిగా కాకుండా మల్టీ లేయర్ ఫ్లై ఓవర్లు, ఫ్లై ఓవర్స్ మధ్య ఉపరితలంపై ఆకాశంలోనే జంక్షన్లు నిర్మిస్తారు. రోడ్లతో పాటు భూగర్బ డ్రైనేజి, భూగర్బ కేబుల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న ఔటర్ రింగు రోడ్డులకు అవతల ప్రాంతంలో ఒక రీజినల్ రింగ్‌రోడ్డు కూడా వేసేందుకు నిర్ణయించారు. మొత్తం నగరంలో 135 కి.మీ. మేజర్ కారిడార్లు, 348 కి.మీ. మేజర్ రోడ్లు, 54 గ్రేడ్ సపరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు.
మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం మెట్రో రైలు మార్గాన్ని 72 కిలో మీటర్ల నుండి 200 కిలోమీటర్ల వరకు పొడిగించనుంది. అలాగే మూడు చోట్ల రైలు మార్గం అలైన్ మెంట్ మార్పు చేశారు. ఆ మార్పులకు అనుగుణంగానే పనులు ప్రారంభం అయ్యాయి. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మరింత వేగంగా జరిగేందుకు అవసరమైన భూసేకరణలు, కోర్టు వివాదాల పరిష్కారాలు, ట్రాఫిక్ నియంత్రణలు తదితర విషయాలపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని పనులు నిరాటంకంగా సాగిస్తున్నారు.
2017 ఏప్రిల్ నాటికి 72 కిలోమీటర్ల నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికే 19 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 49 కిలోమీటర్ల మేర ఫౌండేషన్, 45 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 36.5 కిలోమీటర్ల మేర వైడక్ట్ నిర్మాణం పూర్తయింది. మొదటి దశ నిర్మాణం తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వరకు లైన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధానిలో 2.10 లక్షలమంది నిరుపేదలకు ఇండ్లు
హైదరాబాద్ నగరంలో ఇండ్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని గుర్తించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గృహనిర్మాణ అధికారులతో ఎప్రిల్ 29, 2015న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇండ్లు లేని నిరుపేదలు ఎంత మంది ఉంటారో ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా నగరంలో 2.10 లక్ష్లల మంది నిరుపేదలకు సొంత డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కట్టించాలని నిర్ణయానికొచ్చారు. ఈ నిర్మాణాలు నగరం నడిబొడ్డునే బహుళ అంతస్తుల్లో కట్టించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణానికి 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించనున్నారు.