magaసుమారు 2100 కోట్లతో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు

రోడ్లకు రూ. 6700 కోట్లు, నీటి సరఫరా, మిషన్‌ భగీరథ రూ. 2926 కోట్లు, మూసీ అభివృద్ధి కోసం రూ. 1665 కోట్లు, ఏల్‌ఈడీ లైట్ల కోసం రూ. 400 కోట్లు, నాలాల విస్తరణ రూ. 230 కోట్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు 8225 కోట్లు మొత్తంగా 20,146 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి జీవనాడి అయిన హైదరాబాద్‌ మహానగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌ నగరాన్ని ‘విశ్వ నగరం’గా మారుస్తామన్న ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది.

ఈ విశ్వనగర సాధన దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఒకవైపు హైదరాబాద్‌లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల మేలు కలయికగా, దీర్ఘకాలికంగా హైదరాబాద్‌ నగరంలో మౌలిక వసతుల కల్పన పైన దృష్టి సారించింది. ఇందుకోసం సుమారు 20 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయనున్నది. విశ్వనగరం అంటే ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో నిర్మితం కాదంటూనే, ఈ కలను సాకారం చేసుకునేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల మేరకు పనులు చేపడుతున్నది. హైదరాబాద్‌ నగరాన్ని లవబుల్‌ అండ్‌ లివబుల్‌ సిటీగా మార్చడమే విశ్వనగర లక్ష్యమంటూ పలు సందర్భాల్లో తెలుపడం జరిగింది.

ఒకవైపు నగరంలో ప్రస్తుతమున్న మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు నగర పెరుగుదలను తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఆ మేరకు ప్రాజెక్టులను చేపడుతున్నది. ముఖ్యంగా రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణ, లైటింగ్‌ వంటి ప్రాథమిక అంశాలపైన ఈ ప్రాజెక్టులుండబోతున్నాయి. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, ఉన్న వాటిని మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.ఈ కార్పొరేషన్‌ ద్వారా 1500 కోట్లు ఖర్చు చేయనున్నది. వీటి ద్వారా సుమారు 300 కిలో మీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైట్‌ టాపింగ్‌ రోడ్ల నిర్మాణం జరగనున్నది. దీంతోపాటు ఎస్సార్డీపీ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌ కూడళ్ల అభివృద్ధి, నూతన రోడ్ల ఏర్పాటు పైనా పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నది. ఎస్సార్డీపి ద్వారా ఇప్పటికే 1700 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పూర్తయ్యి, పలు చోట్ల పనులు మెదలయ్యాయి. వీటిలో భాగంగా ఎల్‌.బి.నగర్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌, అయ్యప్ప సొసైటీ, దుర్గం చెరువు వంటి చోట్ల పనులు నడుస్తున్నాయి. మరో 100 కోట్ల రూపాయల పనులకు డీపీఆర్‌లు పూర్తి అయ్యాయి. మరో 2500 కోట్ల రూపాయాల పనులకు డీపీఆర్‌లు సిద్ధం అవుతున్నాయి.

రోడ్ల తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా నీటి సరఫరా అంశాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జలమండలి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులతో పాటు, మిషన్‌ భగీరథ అర్బన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఇందులో భాగంగా జల మండలి పరిసర(పాత) మున్సిపాలిటీలకు నీళ్లు అందించేందుకు సూమారు రూ. 1900 కోట్లతో పనులు నడుస్తున్నాయి. ఈ పనులు వచ్చే వేసవినాటికి పూర్తి అయ్యే అవకాశం ఉన్నది. దీంతోపాటు మిషన్‌ భగీరథ ద్వారా అవుటర్‌ రింగ్‌ రోడ్డులోపలి గ్రామాలకు రూ. 628 కోట్లు, రింగ్‌ మెయిన్‌ కోసం రూ. 398 కోట్లను ఖర్చు చేయనున్నారు. మెత్తంగా నీటి సరఫరా కోసం సుమారు రూ. 2926 కోట్లను ఖర్చు చేయనున్నారు.

సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో హైదరాబాద్‌ నగరంలోనే లక్ష ఇళ్లు నిర్మాణం కాబోతున్నాయి ఇందుకోసం సుమారు రూ. 8225 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యే దశలో ఉండగా, పలు చోట్ల పనులు సైతం ప్రారంభం అయ్యాయి. మెత్తం 109 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరగనుంది. దీంతోపాటు నగరంలో ఎల్‌ఈడీ లైట్లను వెలిగించేందుకు సుమారు రూ. 400 కోట్లతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీపావళి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంలో పనులు నడుస్తున్నాయి. నగరంలో వరద, మురికి నీటి నిర్వహణపైన ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించింది. ఇందుకోసం నాలాల విస్తరణ, అభివృద్ది కార్యక్రమానికి 230 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇక మూసీ నది అభివృద్ధి కోసం మూసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, రూ. 1665 కోట్లకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది.

పైన పేర్కొన్న నిధులకు అదనంగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు నగరానికి ప్రత్యేకంగా తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు కేశవాపురం వద్ద నిర్మించే తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ప్రాథమికంగా 7వేల కోట్ల రూపాయల అంచనాలు సిద్ధం అయ్యాయి. త్వరలోనే ఈ రిజర్వాయర్‌ డీపీఆర్‌ పూర్తి అవుతుంది.

ఈ నిధుల కోసం ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ అర్థిక సంస్ధలు, బ్యాంకులతో చర్చలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ తమ వనరులు ఉపయోగించుకుని, నిధుల సేకరణ చేసేందుకు ఉన్న మార్గాలపైన పలు సంస్దలతో చర్చలు చేస్తున్నది. ప్రారంభం అయిన పనులు, ప్రారంభం కానున్న పనులపైన పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు అనేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల అమలు కోసం ప్రత్యేకంగా ప్రతి సోమవారం శాఖాధిపతులుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Other Updates