ou1ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలలో రాష్ట్రపతి ప్రణబ్‌

విశ్వవిద్యాలయాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు పెరగాలంటే పరిశోధనలు పెరగాలని, యూనిర్సిటీల్లో పరిశోధనలు కొనసాగించుటకు కేవలం ప్రభుత్వమే కాక, పరిశ్రమలు కూడా ముందుకు వచ్చి నిధులను అందచేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు.

ఉస్మానియా యూనివర్సిటీ శాతాబ్ధి ఉత్సవాలను ఏప్రిల్‌ 26న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో కలసి జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, యూనివర్సిటీల్లో పరిశోధనల నిమిత్తమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న నిధులు సరిపోవడం లేదని, రీసెర్చి రంగంపై విద్యార్థులు దృష్టి సారించాలంటే పరిశ్రమలు యూనివర్సిటీలకు నిధులు అందచేయాలని ఆయన సూచించారు. ”రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌, ఇంటరాక్షన్‌ విత్‌ సొసైటీ” అనే మూడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినపుడే ఆ యూనివర్సిటీ స్ఫూర్తిదాయకమైన విద్యాకేంద్రంగా విలసిల్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పరిశోధనలపై పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టినప్పుడే ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా మనం వృద్ధి చెందగలమని ఆయన అన్నారు.

శాతాబ్ధాల క్రితమే భారతదేశం ఉన్నతవిద్యలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అతి పురాతనమైన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో ఎందరో గొప్పవారు విద్యను అభ్యసించారని అన్నారు. వందేళ్ళ క్రితం ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మేధస్సు నుంచి ఉద్భవించిన ఉన్నత విద్యాకేంద్రమే ఉస్మానియా యూనివర్సి టీయని, వందేళ్ళ ఈ చరిత్రలో విద్యార్థులకు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు.

ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్స వాల్లో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఈ యూనివర్సిటీలో తమ విద్యా భ్యాసాన్ని కొనసాగించిన వారందరికీ అభినందనలు తెలియ జేస్తున్నానని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తన ఈ ప్రయాణంలో మరెన్నో మైలురాళ్ళను అధిగమించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

విశ్వవిద్యాలయాలు మేధావులకు, కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని అంటూ భారతదేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీలతో సహా మొత్తం 757 యూనివర్సిటీలు ఉన్నాయ న్నారు. దేశంలో ఐఐటీల ఏర్పాటుతో వచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్థావిస్తూ రాష్ట్రపతి ఐఐటీల్లో విద్యార్థులకు వందశాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయని, వాటితో అధికశాతం విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారని అన్నారు. ఐఐటీలు దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని, భారతదేశంలోని ఎన్నో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐసీఆర్‌ సంస్థలు ఉన్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచి తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా ఆణిముత్యాల్లాంటి విద్యార్థులను, టీచర్లను దేశానికి అందిస్తున్నాయని అన్నారు. నాణ్యతాపరమైన విద్యను అందించే ఐఐటీలు, ఎన్‌ఐటీలు దేశంలో మరిన్ని అధికసంఖ్యలో ఏర్పాటు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ వందేళ్ళ అడ్మినిస్ట్రేటివ్‌, క్రీడా భవన నిర్మాణాలకు రాష్ట్రపతి శంకుస్థాపనగావించారు. సెంటినరీ ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో వెలువరించిన వందేళ్ళ ఉస్మానియానియా చరిత్ర అనే ప్రత్యేక సంచికను రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామాత్యులు కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో సహా అతిథులందరినీ వర్సిటీ అధికారులు సన్మానించారు.

తొలుత యూనివర్సిటీ ఉప కులపతి రామచంద్రం యూనివర్సిటీ వందేళ్ళ ప్రగతిపై నివేదికను సమర్పించగా, రిజిస్ట్రార్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి వందన సమర్పణ గావించారు. కార్యక్రమానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారధి రాష్ట్ర సంప్రదాయాలపై ప్రదర్శించిన కార్యక్రమాలు రచయిత సుద్దాల అశోక్‌తేజ వందేళ్ళ యూనివర్సిటీ చరిత్ర పై ప్రత్యేకంగా రూపొందించిన గేయాలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి.

విద్య అందరికీ అందుబాటులోకి రావాలి

విజ్ఞాన సముపార్జన జీవనోపాధికి బాటలు వేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. అందరికీ సర్వోన్నత విద్య అందించడం దైవ కార్యక్రమంగా భావించాలని బోధకులకు ఆయన సూచించారు.

గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ లో ఏప్రిల్‌ 26న ఆంగ్లం, విదేశీభాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పొల్గొని ప్రసంగించారు. సర్వేజనా సుఖినోభవంతు అనే ఆర్యోక్తిని విద్యా బోధనకూ వర్తింప చేసినప్పుడే అందరికీ విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విద్యాలయం ఆరు దశాబ్దాలుగా సేస్తున్న కృషి నూతన భారతావని ఆవిష్కరణకు దోహదం చేసిందన్నారు.

భాషాభివృద్ధిలో, మరీ ముఖ్యంగా ప్రపంచంతో అనుసంధానంచేసే ఆంగ్లాన్ని బోధించడంలో ఈ సంస్థ కృషి గొప్పదని ప్రణబ్‌ పేర్కొన్నారు. తొలి ప్రధాని నెహ్రూ ఏ లక్ష్యంతో ఈ విద్యాసంస్థను ప్రారంభించారో ఆ దిశగా ఇది ముందుకు సాగటం అభినందనీయమన్నారు.

అంతకుముందు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ సునైనా సింగ్‌ విశ్వవిద్యాలయాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహాన్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2016-17 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానంచేశారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను రాష్ట్రపతి అభినందించారు.

ఘన స్వాగతం- వీడ్కోలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతోత్సవాలతో సహా పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌ కు విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, స్పీకర్‌ మధుసూదనాచారి, శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, తదితరులు ఘన స్వాగతం పలికారు.

అదేరోజు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో బేగంపేట విమానాశ్రయం వద్ద గవర్నర్‌, ముఖ్యమంత్రి, తదితరులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఈ సదర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

Other Updates