డా|| శ్రీరంగాచార్య
వైదిక కార్యక్రమాల ఆరంభంలో స్మార్త సంప్రదాయంవారు ‘గణపతి’ పూజ చేసినట్టే శ్రీవైష్ణవ సంప్రదాయంలో విష్వక్సేనారాధన అనేది ఒక సంప్రదాయం. విష్వక్సేనుడు శ్రీమహావిష్ణువునకు సర్వసైన్యాధ్యక్షుడు. విష్ణువునకున్న పేర్లల్లో ‘విష్వక్సేనోజనార్దన:’ అనియు, విష్ణు సహస్రనామాల్లో యస్యద్విరదవక్త్రాద్యా:… శ్లోకంలో విష్వక్సేనస్తుతి ఉంది. పాంచరాత్రఆరాధనల్లో ‘విష్వక్సేనశ్చమర్బాహు:శంఖ చక్రగదాధర: శ్రీమాన్ సూత్రవతేనాధో గజాస్యముఖసేవిత:… ఇత్యాది కొన్ని ప్రార్థనా శ్లోకాలు అనుసంధానంలో వున్నాయి.
మన కవుల్లో శ్రీవైష్ణవాభిమానులైనవారు తప్పకుండా విష్వక్సేన ప్రార్థన చేసినారు. ఆముక్త మాల్యదలోని ‘పూనిముకుందు… పద్యం ద్వారా విష్వక్సేనుడు ధరించే దండ ప్రాముఖ్యం గొప్పగా వర్ణితమైనది. బాగా వ్యాపించిన సేన కలవాడు విష్వక్‌సేనుడు అని. విష్ణువువలెనే ఈయన వర్ణితుడైనాడు. స్తోత్ర, కావ్యాలయందు స్తుతి చేయబడిన విష్వక్సేనుని గూర్చి ఎవ్వరూ చెప్పని ఒక విశేష కథా ప్రబంధాన్ని ఇట్లా రచించిన ఆసూరి మరింగంటి వెంకటనరసింహాచార్య కవి సాహితీలోక చిరస్మరణీయుడు-బహువిధ కృతి నిర్మాతయైన ఈ గ్రంథకర్త (క్రీ.శ. 1780 ప్రాం) సహజ సంప్రదాయాభినివేశంతో 3 ఆశ్వాసాలు, 780 గద్యపద్యాలతో ‘విష్వక్సేన ప్రభాకరము’ పేర ప్రబంధ రచనమొనర్చి విష్ణు సైన్యాధిపతికి ప్రబంధ గౌరవం కల్గించిన వారిలో ప్రథముడు, ఈ కథను సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినది.
కథా విషయము: మహర్షియైన దుర్వాసుడు భయంకరమైన తపస్సు చేస్తుండగా దానిని భంగం చేయడానికి బ్రహ్మ’కుంతల’యనే పేరున ఒక స్త్రీని సృజించి పంపగా.. ముని కోపగించి ఆమెను ‘మానవాకృతిదాల్చి వన నిధిని పొందుదువుగాక’-అని శపించి పంపుటతో ఆమె మానవాకృతిని దాల్చి ‘సువర్చలా’నామంతో సముద్రుని పరిణయమాడుతుంది. వీరికి-తులారాశి పూర్వాషాఢా నక్షత్రంలో జన్మించిన శిశువే విష్వక్సేనుడు.
కొంత కాలానికి పురందరునికి ‘శశి’వలన కలిగిన కూతురు అందాలరాశి సూత్రవతిని జలంధరుడనే రాక్షసుడు హరించే యత్నం చేస్తే విష్ణువు, ఇంద్రుడు, విష్వక్సేనుడు కలిసి ఆ రాక్షసుని సంహరిస్తారు. తర్వాత సువర్చలా విష్వక్సేనుల వివాహం జరుగుతుంది. ఇది దీనిలోని ముఖ్య విషయం. కవి దీనికి మూలాధార విషయాన్ని తెల్పలేదు. విషయం చిన్నదేకాని వివిధ వర్ణనల కారణంగా మూడాశ్వాసాల ప్రబంధంగా చిత్రితమైంది.
దేవతలు-రాక్షసులకు మధ్యనగల వైరము దీనియందు స్త్రీ కారణముగ వృద్ధి చెంది సమరానికి దారితీసింది. విష్ణుభక్తులెవ్వరైనా వారిని సంరక్షించుట శ్రీమన్నారాయణుని విధియైనందున ఇంద్ర, సముద్ర, విష్వక్సేనులు రక్షింపబడినారు. కుంతల సువర్చలగా మారి సముద్రుని పరిణయమాడి విష్వక్సేన జననానికి కారణం కావడం ఒక ముఖ్య సన్నివేశం. ఇంద్రుడు ‘శశి’ని వరించగా, వారికి కలిగిన సంతానం సూత్రవతి. ఇట్లా దివ్యాదివ్యులతో కథ ముడిపడినది. కుంతల శాపం వరకే దుర్వాస ప్రసక్తియుండగా, దేవర్షియైన నారదుడు రెండు ముఖ్య సన్నివేశాలలో వచ్చి తన కలహ ప్రియత్వాన్ని నిరూపించుకుంటాడు. ‘ఇంద్రుడు’ సర్వం విష్ణుమయ’మని విశ్వసించినాడు. సువర్చలను గ్రహించడానికే సముద్రుడు మానవాకృతిని దాల్చగా.. విష్వక్సేనుడు దేవరాక్షస యుద్ధమునందు ఎవ్వరూ చంపలేని దనుజులను తన పావకాస్త్ర ప్రయోగంతో అంతమొందిస్తాడు.
తృతీయాశ్వాసం పూర్తిగా రాక్షస దుశ్చర్యలు-వాటి నివారణ కొరకు దేవతల పాట్లు, ‘విష్వక్సేనుని శక్తియుక్తులు మొదలగు వాని వర్ణనలతోనిండి తిక్కన సమరవర్ణనలను గుర్తు చేస్తున్నది.
ప్రబంధమంతా వర్ణనా ప్రాముఖ్యమై ‘వర్ణనానిపుణ: కవి:’ అనే విషయాన్ని నిరూపించింది. సాంఘికాచార విషయ ప్రవచనమంతా కవి కాలంలోని పరిస్థితులనే తెలుపుతుంది. కూతురు వివాహ నిమిత్తం తల్లిదండ్రులు పడే బాధలు, ఆలోచనలు బాగా తెలుపబడినవి. దీనిలోని విష్వక్సేన వివాహమంతా పరమ లౌకికంగానేవుండి ఎదుర్కోలు, మాంగల్యం, తలంబ్రాలు, అప్పగింతలు, సాగనంపటం, వడిబియ్యం, ఆచారం, అన్నీ వున్నాయి. కవి భోజనం ఎట్లా చేసి కాలం వెళ్లబుచ్చినారో కానీ ఈ ప్రబంధ భోజనం ఎంతో గొప్పగా వుండి పెండ్లి వారినే పరవశింపచేసింది. వీటన్నిటినీ మించి సూత్రవతీ విష్వక్సేనుల శోభన ఘట్టవర్ణన అతివేలమై ‘శృంగార గ్రంథ’రీతిని అధిగమించింది.
కవి ప్రబంధ ప్రారంభంలో 83 పద్యాలవరకు సంప్రదాయ పద్ధతి స్తుతులు, వంశవర్ణన మొదలైనవి చేసి, 84వ పద్యం నుండి ‘కథా ప్రారంభం’ చేసినా.. ఈ కథకేది మూలమో తెలుపలేదు. తాళపత్ర గ్రంథంలో వ్రాయసగాని పొరపాట్లు బాగా వుండడం వలన పద్యాల్లో గణ, యతి, ప్రాస భంగాలధికమైనాయి. కృతికర్త యిష్ట దైవమైన సిరిసెన గండ్ల నృసింహస్వామి స్వప్నంలో కన్పడి యిట్లా అన్నాడట.
శ్రీభారతాది ప్రసిద్ధ గీర్వాణాంధ్ర
భాషా మయశ్లోక పద్య పఠన-
మున, లేఖనమున, తన్ముఖ్యార్థ బోధన
మున, కావ్యసాహిత్యమున, తదుభయ
సమధిక ఛందోర్థ సంప్రదాయజ్ఞాన
మున, భాణనాటకములను, శబ్ద
శాస్త్ర ద్వయంబున, శబ్దార్థ భేదనా
నాలంక్రియా సమూహముల-మూల
మంత్రమంత్రార్థ గీతార్థ మార్గముల-స్వ
రూప సంపాదక గ్రంథరూఢి చింత
నముల భాషాద్వయ కవిత్వ విమలకల్ప
నాదులందెల్ల కడు నిపుణాతిమతిని (1-17)
ఇదంతా కవి ప్రతిభా పాటవాలను – గ్రంథ రచనా వైభవాన్ని తెలుపుతున్నా, ప్రబంధ రచన చేయవలసిన కవికి కావలసిన శక్తియుక్తులను, పాండిత్యాదులను ఈ పద్యం తెలుపుతున్నది.
కవి అప్పటికే 8 మహాప్రబంధములను రచించడంవలన నవరత్నమాలికాకృతిగ నవరసముల జొప్పించి ఈ విష్వక్సేన ప్రభాకరాన్ని రచించవలసిందిగా తన ఇలవేల్పు ఆజ్ఞాపించినాడు. అందుకే మూడాశ్వాసాల్లోనూ ఎన్నెన్నో వర్ణనలు-బహురస సమ్మిశ్రణ కవితలదు. దీని ఆశ్వాసాంతగద్యల్లో ‘షోడశమహా గ్రంథ బంధురాలంకార నిర్మాణపారీణుడ’నని తన యితర కృతులలోని గద్యము వలెనే చెప్పినాడు.
2-26లోని యుద్ధవర్ణన వచనం తిక్కన భారతవర్ణన పోలియున్నది. 3-125లో నారదుడు శ్రీమన్నారాయణుని ‘దండకం’లో స్తుతిస్తూ శ్రీవైష్ణవ సంప్రదాయాలను చెప్పడం ఒక విశేషం.
దుర్వాసుని తపో భంగానికి వెళ్లిన కుంతల-తన చెలికత్తెలతో కలిసి అనేక రాగాలను ఆలపించిన ఈ పద్యంలో కవి సంగీత కళారహస్య నిధిత్వం తెలుస్తున్నది.
‘శ్రీరాగ’మూహింపు కీర సన్నిభవాణి
‘పున్నాగ’ పాడవే సన్నుతాంగి
‘మాళవి’సేయవే మధురసుధాధరి
‘కాంభోజి’యనగదే కంబుకంఠి
‘భైరవి’ చేయవే పంకజదళ నేత్రి
‘భూపాల’ మూహింపు పువ్వుబోణి
‘మోహన’ పాడవే ముకుర గండస్థలి
‘హిందోళ’ యనగదే సుందరాంగి
‘మేఘరంజని బాడవే మించుబోణి
‘మలహరి’ని బల్కుహోయలుగాకల భయాన
‘ఘార్జ’రూహింపరాదటే కుందరదన
‘యలరి’కల్యాణి’యనరాదెహరిసు మధ్య
దీనిలో సం’గీతం’ దానికనువైన ‘స్త్రీ’పాత్ర చిత్రితం కావడం విశేషం.ఈ గ్రంథంలో పూర్వకవుల పద్యానుసరణలేగాక.. తన యితర రచనల పద్య భాగాలు కూడా కొన్ని చేరినవి. బహుగ్రంథ కర్తృతా విషయంలో ఇది సహజ పద్ధతియే!
సూత్రవతీ దేవి కుద్దీపన కల్గించిన వెన్నెలయిట్లున్నదట-
ప్రాక్‌కకు ప్ గిరి కన్యభ్రాంతి చేనఱుతను
ధరియించు మందార దామమనగ-
సంతరిక్షధ్యాంతమను సౌధమున గట్టు
జగజంపు ముత్యాల సరమనంగ
కలికి చీకటి లేమకైశికమందుల
తగగట్టు సంపెంగ దండలనగ-
యామినీకాంతి కటితటియందు మెరయు
జిలుగు బంగారు జిలిబిలి చేలముట్లు
పొందికలరెడు మల్లెపూ పందిరట్లు
కలిగి వెన్నెల గుంపులాక సము గప్పె – 3-283.
స్త్రీల మన: ప్రవృత్తిని ఇట్లా చిత్రించినాడు-
తన సుఖమె తనువు సుఖముగ
తన పేర్మియె తనకు ప్రియము తల పోయంగన్
తన మనసుకహితమైనది
తన తనువుకు హితమునౌనే దయితలికెందున్ 1-91
కవి ప్రబంధాన్ని శ్రీ సంప్రదాయానుసారంగా శేష-శేషి సంబంధ ప్రతీకగా రచించి – శేషాశనులైన విష్వక్సేనుల వారి పరాక్రమం, కల్యాణగాథలను చిత్రించటం వారికిగల సంప్రదాయాభిమానమే కారణము
దీనిలోని ఛందస్సు-పద ప్రయోగ విశేషాలు కవి యితర రచనల యందున్నట్లే గలవు. ఛందఃపరంగా తురంగ ఖురపుట (1-20) ఉత్సాహ-2-88, హంస నటన – 3-385, నాగబంధ చంపకం (2-186), మొదలనగునవి కలవు – గ్రంథకర్తయైన వెంకటనరసిహాచార్యులవారి అముద్రిత విశేష ప్రబంధాల్లో ఇది ఒకటి – ఇదే శీర్షిక – ఇదే పత్రిక (ఏప్రిల్ 2018)యందు కవి సంక్లిప్త పరిచయం కలదు.
జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః