వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 24న ప్రకటించారు. ప్రస్తుతం విఆర్‌ఎలు అన్ని విధాల కలిపి రూ. 6,500 వేతనం పొందుతున్నారు. ఈ వేతనాన్ని రూ. 10,500కు పెంచాలని సిఎం నిర్ణయించారు. దీంతో పాటు రూ. 200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ కూడా ప్రకటించారు. దీంతో ఒక్కో విఆర్‌ఎకు రూ. 4,200 వేతనం పెరుగుతుంది.
గ్రామంలోనే 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ విఆర్‌ఎకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1నుంచి అమలులోకి వస్తాయి. ప్రతీ విఆర్‌ఎకు తమ స్వగ్రామంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టివ్వాలని, దీనికోసం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటితో పాటు వి.ఆర్.ఓ, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వి.ఆర్.ఏ లకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. వెట్టి తదితర పేర్లతో పిలుస్తున్న వారందరినీ ఇకపై వి.ఆర్.ఎ.లు అని గౌరవంగా సంబోధించాలని సిఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల వారసత్వంగా విఆర్‌ఎలుగా పనిచేస్తున్న రాష్ట్రంలోని 19,345 మందికి మేలు కలుగుతుంది.
ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి వి.ఆర్.ఎ. లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం విధివిధానాలు తయారు చేయాలని టి.ఎస్.పి.ఎస్.సి. ఛైర్మన్ ఘంటా చక్రపాణి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి. గోపాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న రాష్ట్రంలోని 2,900 మంది నేరుగా నియమితులైన వి.ఆర్.ఎ.లకు మేలు కలుగుతుంది.
మంత్రి కె.టి. రామారావు సమక్షంలో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన రెండు కేటగిరీలకు చెందిన వి.ఆర్.ఏ. ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 24న ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు కె.టి. రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, టి.ఎస్.పి.ఎస్.సి. ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్, సిసిఎల్‌ఎ కార్యదర్శి కాళి చరణ్ తదితరులు పాల్గొన్నారు. విఆర్‌ఎ (డైరెక్ట్ రిక్రూటీస్) సంఘం అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు బాలామణి, విఆర్‌ఎ (డిపెండెంట్స్) సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లన్న, రాజయ్య, కార్మిక సంఘం నాయకులు జి. రాంబాబు యాదవ్, పి. నారాయణ తదితరులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.
”తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వి.ఆర్.ఎ.లది శక్తి వంచనలేని కృషి. గ్రామంలో 24 గంటల పాటు అందు బాటులో ఉండి ప్రభుత్వం తరుఫున ప్రతీ కార్య క్రమంలో పాల్గొంటున్నారు. వి.ఆర్.ఎ.లుగా పనిచేస్తున్న వారందరూ పేదలే. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వారే ఎక్కువ మంది ఉన్నారు. పేరుకు పార్ట్ టైం ఉద్యోగమైనా ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. ఇంత చేసినా వి.ఆర్.ఎ.లకు అందే జీతం తక్కువ. కనీస వేతనం కూడా దక్కడం లేదు. కేవలం రూ. 6,500 జీతంతో బతకడం చాలా కష్టం. వీరి జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీరు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ వి.ఆర్.ఎ.కు నెలకు రూ. 10,500 వేతనం, రూ. 200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ పెరుగదల 64.61 శాతం. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలి. ప్రతీ నెల 1వ తారీఖున మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికి కూడా వేతనం అందాలి. వేతనంతో పాటు వి.ఆర్.ఎ.ల గౌరవం కూడా పెరగాల్సి ఉంది. తరతరాలుగా ఈ కుటుంబాలు గ్రామసేవలో నిమగ్నమై ఉన్నాయి. అయినా వీరిని రకరకాల పేర్లతో పిలవడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. వెట్టి, మస్కూరి, కావల్ కార్, కాన్ దార్ తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇకపై అలా పిలవవద్దు. ఏ పని చేసే వారైనా సరే వి.ఆర్.ఎ. అని మాత్రమే పిలవాలి” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
”వారసత్వంగా వి.ఆర్.ఎ. ఉద్యోగం చేస్తున్న వారు తమ సర్వీసు కాలమంతా తమ గ్రామంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతీ వి.ఆర్.ఎ.కు ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తుంది. వారసత్వ విఆర్‌ఎలందరికీ ఇండ్లు మంజూరు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. ఇండ్ల నిర్మాణం కూడా ప్రారంభం కావాలి. పెరిగిన జీతం, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, పిలిచే పిలుపుతో వి.ఆర్.ఎ.ల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం పెరగడమే ప్రభుత్వ లక్ష్యం. వి.ఆర్.ఓ., డ్రైవర్, అటెండర్ లాంటి రెగ్యులర్ పోస్టుల నియామకం సందర్భంగా కూడా విద్యార్హతలున్న వారిని నియమించాలి. ఇందుకోసం 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించాం” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
‘వి.ఆర్.ఎ.లలో మరోరకం వారున్నారు. వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన పోటీ పరీక్ష ద్వారా ఎంపికైన వారున్నారు. వీరు కూడా తక్కువ వేతనంతోనే పనిచేస్తున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా పోస్టులు అవసరమవుతాయి. ఇంకా ప్రభుత్వంలో ఖాళీలను కూడా గుర్తించాలి. వీరందరినీ రెగ్యులర్ చేయాలి. ఇందుకోసం తక్షణం విధివిధానాలు రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.