బడ్జెట్‌ కోసం సమావేశమైన శాసనసభలో, సభ ప్రారంభం కాగానే పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన దాడి అత్యంత అమానుషమైనదని,సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. 40 మంది జవాన్లు మృతి చెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాదు.. మీ వెంట యావత్‌ జాతి ఉందన్న సందేశం ప్రస్ఫుటంగా పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు, వారి అమూల్యమైన ప్రాణాలను తిరిగి తేలేకపోయినా ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సయితం స్వాగతించాయి. అమరులైన జవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

Other Updates