— సూరి
‘‘ధర్మంకోసం పోరాడేటపుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి.. ఎట్టి పరిస్థితిలోనూ నమ్మిన ధర్మాన్ని వీడొద్దు’’ అంటూ మొహర్రం మాసం హితబోధ చేస్తుంది. ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌లో నూతన సంవత్సర ఆరంభమాసమే మొహర్రం. ఇస్లాం మత ప్రధాన ప్రవక్త మహ్మద్ సల్లల్లాహు అలైవ సల్లం మనవడైన ఇమామె హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ నెలలోనే వీరమరణం పొందారు. అందుకని వారి వీరత్వాన్ని స్మరిస్తూ వారి పేర్లలో పీర్లను ప్రతిష్టిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు, సంప్రదాయ బద్ధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇస్లాం మతస్థులు సంతాప సూచకంగా ఈ నెలను శోక మాసంగా భావిస్తారు.
ఇదీ నేపథ్యం…
61వ హిజ్రీ కాలంలో అప్పటి రాజు అమీర్ మౌలానా తన కుమారుడు యజీద్‌కు వారసత్వంగా రాజ్యాధికారాన్ని కట్టబెట్టారు. దీనిని ఇమామె హుసేన్ వ్యతిరేఖిస్తాడు. ప్రజాభిప్రాయం మేరకు రాజు ఎంపిక జరగాలని, అందుకు భిన్నంగా వారసులకు రాజ్యాధికారం అప్పగించడం ఇస్లాం మతానికి విరుద్ధమని పేర్కొంటూ ఆ విధానం రద్దు చేయాలంటాడు. దీంతో యజీద్ హుసేన్‌పై కక్ష పెంచుకుని అతన్ని నేటి ఇరాక్ ప్రాంతంలోని కర్బలా మైదానానికి రప్పిస్తాడు. తన బంధుమిత్రులు, అనుచరులు 72 మందితో కలిసి అక్కడికి చేరుకున్న హుసేన్‌ను యజీద్ సైనికులు ఆ మైదానంలోనే నిర్బందిస్తారు. వారికి కనీసం మంచినీరు కూడా దొరకకుండా కట్టడి చేస్తారు. ఈ క్రమంలో పది రోజుపాటు జరిగిన యద్ధంలో చివరి రోజు హుసేన్, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు వీరమరణం పొందుతారు.
పీర్ల ప్రతిష్ట
మొహర్రం సందర్బంగా గ్రామాల్లో, పట్టణాల్లో అషుర్ ఖానాల్లో పీర్లను ప్రతిష్టిస్తారు. అషుర్ ఖానాలు లేని చోట్ల తాత్కాలికంగా పందిళ్లు వేసి పీర్లను నిలుపుతారు. పీర్లకు దట్టీలు కట్టి, కుడుకలు, గాజు, పువ్వుతో సంప్రదాయబద్ధంగా అంకరిస్తారు. 10 రోజుల పాటు ముస్లింలతోపాటు హిందువులు సైతం భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహిస్తారు. పీర్లను ప్రతిష్టించిన అషుర్ ఖానా ముందు గుండ్రంగా అలావా నిర్మించి, అందులో అగ్ని గుండాలు ఏర్పాటు చేసి చుట్టూరా తిరుగుతూ పాటలు పాడుతూ అసైదులా ఆటలు ఆడతారు. సంతాప దినాలు ముగిసిన అనంతరం పీర్లను గ్రామంలోని ప్రధాన వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. చాలా గ్రామాల్లో పీర్ల ఊరేగింపు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ముస్లింలు , హిందువు కలిసి జరుపుకునే మొహర్రం పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిుస్తోంది.
ఉపవాసాలు…
ఇస్లాం మతం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామె హుసేన్‌కు పుణ్యం కలగాంటూ ముస్లింలు మొహర్రం మాసంలో 9, 10వ రోజు ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ నెలను శోకమాసంగా భావించడం వల్ల చాలా మంది ముస్లింలు ఈ నెముస్లింలులో శుభకార్యాలు తలపెట్టరు. కొత్త దుస్తులు, వస్తువులు వంటివి కొనుగోలు చేయరు.
షర్భత్… రొట్టెల పంపిణీ
కర్బలా మైదానంలో 10 రోజుల పాటు కనీసం మంచినీరు లేకుండా దప్పికతో అల్లాడిన పరిస్థితి ఎవరికి రాకూడదనేది ముస్లింల ఉద్దేశ్యం, దీనిని దృష్టిలో ఉంచుకుని మొహర్రం పండగ రోజున నీళ్లు లేదా పాలో బెల్లం, సోంపు కలిపి షర్భత్ తయారుచేసి అందరికి పంచుతారు. అలాగే ఆకలితో ఎవరూ మృతిచెంద కూడదని చెప్పి గోదుమ పిండి, చక్కెర, ఎండుఫలాతో రొట్టొ తయారుచేసి పంచుతారు. కొన్ని చోట్ల పెరుగు అన్నం తయారుచేసి దానం చేస్తారు.
మన దేశానికి వచ్చిందిలా…
మొగల్ చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలించే సమయంలో తైమూర్ రాజు కాలంలో ఆయన సైనికులు ప్రతి ఏటా మొహర్రం కోసం ఇరాక్ వెళ్లేవారట. అది గమనించిన ఆయన వ్యయ ప్రయాసలను తొలగించేందుకుగాను ఇక్కడే పీర్లను ప్రతిష్టించడం ప్రారంభించారు. అప్పటి నుంచి అది క్రమంగా మనదేశంలో ఆచారంగా మారిపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు ముఖ్యంగా తెలంగాణా జిల్లాల్లో మొహర్రం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మొహర్రం సందర్భంగా హైద్రాబాద్‌లో షియా తెగకు చెందిన ముస్లింలు సంతాప సూచకంగా రక్తం చిందిస్తారు.