వీర-తెలంగాణా-రుద్రావైడికూడునిజాం నిరంకుశపాలన, రజాకార్ల రాక్షసత్వం, దోపిడీలు, గృహదహనాలు, దారుణ మారణకాండలు చూసినవాడు దాశరథి కృష్ణమాచార్యులు.

అతివాదుల అభిప్రాయాలు, మితవాదుల మనస్థత్వాలు, ఆంధ్ర మహాసభ ఆంతర్యాలు, ప్రజ అభిప్రాయాలు, నాయకుల ఆరాటాలు అన్నీ చూసినవాడు దాశరథి. అంతర్జాతీయ ఆర్థికపరిస్థితులు, ప్రపంచయుద్ధాలు, దేశంపై ఒత్తిడులు, విదేశీయుల పాలన, పెట్టుబడిదారి వ్యవస్థ తీరుతెన్నులు అన్నీ చూసినవాడు దాశరథి. ఈ పరిస్థితులన్నీ గ్రహించి, విజృంభించింది అతని కవి హృదయం. స్వాతంత్రోద్యమం, తెలంగాణ పోరాటం, సాయుధపోరాటం, రైతాంగపోరాటం అన్నీ ఆయన కలానికి పదునుపెట్టినవే, పీడిత తాడిత ప్రజలే ఆయన వ్రాసిన పదాలకు అందిన బలం!

‘‘ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను!
కదంతొక్కి పదంపాడి ఇదే మాట అనేస్తాను;
జగత్తంత రగుల్తొన్న కృధా జ్వాల వృధాపోదు’’

అంటూ ఆనాడు దాశరథి నిజామాబాద్‌ సెంట్రల్‌ జైల్‌ నుండి గళమెత్తింది తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛా వాయువు పీల్చాలనే! నైజాం నెదిరిస్తూ, రజాకార్లను విమర్శిస్తూ వ్రాసిన కవిత్వం ఆనాటి ప్రజలకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పినవి! అవును! సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కవులు అక్షరాలను పువ్వుగా, కత్తులుగా వెదజల్లగలరు, విసిరేయగలరు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న దాశరథి కృష్ణమాచార్యులు ధైర్యంతో ‘‘మా నిజాం నవాబు జన్మజన్మాల బూజు’’ అని నిరసన గళమెత్తినందుకు చేతుకు బేడీలు వేయబడ్డాయి. మానుకోట బిడ్డగదా! పౌరుషానికేం తక్కువ? అవును! దాశరథి పుట్టింది తెలంగాణ మాగాణిలోనే! అదీ – వరంగల్‌ జిల్లా మానుకోట తాలుకాలోనే! ఆ ఊరే గూడూరు! 1927వ సంవత్సరం, జులై 22న.

ఖమ్మం జిల్లాలో చదువయిపోయాక హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో కాలుపెట్టి, ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పట్టా పొందాడు దాశరథి. ప్రాంతానికి ప్రాంతానికీ మధ్య ఉన్న తేడా, మనుషులకు మనుషులకు మధ్య ఉన్న తేడా చూస్తున్నప్పుడు సమాజం చెరిగిపోలేని ముద్రవేసింది. మెదడునిండా ఆలోచనల పరంపరలు సాగినవి. శరాలు సంధించగలిగే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు దాశరథి. యువరక్తం ఉరకలెత్తుతుంటే అక్షరాల్ని కత్తులుగా దూసి ‘అగ్నిధార’గా ‘రుద్రవీణ’గా ఎలుగెత్తి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ఒరవడి తెచ్చారు. తెలంగాణ రచయితల సంఘానికి దారిచూపిన దాశరథి అభ్యుదయ కవిత్వచ్ఛాయల్లో కవితను అద్భుతంగా ఆవిష్కరించి సమకాలీన కవులకు ఆనందమే పంచాడు.

విశిష్టాద్వైత మతస్థాపనకు శ్రీమద్రామానుజుల శిష్యుల్లో ఒకరైన దాశరథి పూర్వీకులు పూర్వం కాశ్వీర్థం భద్రాచలంలో స్థిరపడ్డారు. అప్పుడు రామదాసుగా కీర్తించబడిన కంచెర్ల గోపన్న రామాలయం కట్టించింది వీరి ప్రోద్బలంతోనేనని పెద్దలు చెప్తుంటారు. గోపన్న దాశరథీ శతకం వ్రాయడమే ఇందుకు నిదర్శనమంటుంటారు. దాశరథి తాతగారు, తండ్రి గారు మహాపండితులు. తల్లి సంస్కృతాంధ్రభాషల్లో విదుషీమణి. వీరి ప్రభావం దాశరథిపైబాగా పడిరదనడానికి వీరి రచనలే సాక్ష్యం. సాంప్రదాయ కవిత్వాన్ని వంటబట్టించుకున్నా సమాజ బాధను చూసి, ప్రభుత్వ అరాచకాలనూ, రజాకర్ల అకృత్యాలను చూసి దాశరథి ఊరుకోలేదు. ఛందోబద్ధమైన కవిత్వంలోనూ పలికించింది విప్లవాన్నే!

‘‘ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్‌ బడగొట్టి మంచి మా
గాణములన్‌ సృజించి ఎముకల్‌ నుసిజేసి పొలాలదున్ని భో
షాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలం

గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?’’

అని రాచరిక వ్యవస్థను నిరసించాడు దాశరథి. మనిషి తిండితినడం మొదలు పెట్టినప్పట్టి నుండి ఇప్పటివరకూ అందరిపొట్టలు నింపుతున్న రైతన్న పక్షాన నిబడ్డాడు దాశరథి. దొర పెత్తందార్ల చేతుల్లో బలైపోయే రైతులను, పీడితులను తన కవితా వస్తువుగా తీసుకొని కవిత్వీకరించాడు. అతని కవిత్వంలో కల్పనలూ, అవాస్తవాలూ ఏవీ లేవు. అందుకే అవి నేరుగా, సూటిగా గుండెలకు గుచ్చుకునేవి.

తెలంగాణ పల్లెల్లో పుట్టి, అక్కడి మట్టి వాసనను ఆస్వాదించిన దాశరథి వారిలో నిద్రాణమైన ప్రజాచైతన్యాన్ని పెల్లుబికించేలా వ్రాసిన కవిత్వాన్ని మన జాతీయ సాహితీ సంపదగా గుండెల్లో దాచుకోవాలి.

‘‘దేశంబొక్కటే భారతాఖండాసేతు హిమాచలోర్వర’’ అని చెప్పిన దాశరథి జాతీయ సామ్యవాద ఉద్యమాలను మేళవిస్తూ కవిత్వం వ్రాశాడు. ఒక నూతన సామాజిక నిర్మాణం కోసమే పరితపించింది అతని హృదయం.

దాశరథి మాటల్లో ఒక చిత్రకారుని గూర్చి –
‘‘పరుగెత్తే నదినైనా బంధించును చిత్రం
అంతటి ఆకాశమైనా ఇంతవును విచిత్రం’’

ఇదీ దాశరథి కవిత్వం! గుప్తతా, వ్యక్తతా రెండూ జీవన సాఫల్యానికి సమానావసరాలని చెప్పిన దాశరథి స్పష్టతను కోరే కవి. ఎట్లాంటి అయోమయత్వం ఉండదు. అందుకే అంతటి భావాల్ని రెండు వాక్యాల్లో చెప్పగలిగాడు దాశరథి. ఆనాటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితులు వీరి కవి హృదయాన్ని చలింపజేసినవి. దీనికితోడు విస్తృతంగా పుస్తక పఠనం చేసే అవాటు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదవడం వాటిపై విమర్శ చేసుకోవడం అలవాటున్న దాశరథి, మనిషిమీద, సమాజంమీద విశ్వాసం పెంచే విశాల దృక్పధాన్ని ఏర్పరిచే ఆలోచనలేకలిగి ఉండేవారట. అట్లా కలగడానికి బహుశా మార్క్సిజం ప్రభావం పడి ఉండొచ్చు. అందుకే ఆయన –
‘‘నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి’’ అని అనగాలిగాడనవచ్చు. అన్ని వేళలా అందరి అభివృద్ధి కోరుకున్న కవి దాశరథి. సంప్రదాయ చైతన్యధార, అభ్యుదయ భావధార, శాంతి పూర్వక విప్లవ హేల దాశరథి కవిత్వంలో కనిపిస్తుంది. అందుకే ఆయన కవిత్వం ‘తిమిరంతో సమరం’ చేసింది, కాని, సంప్రదాయాలను ఏనాడూ నిరసించలేదు. అభ్యుదయాన్నే ఆకాంక్షించాడెప్పుడైనా! ఈ వైరుధ్యభావ ప్రకంపనలు దాశరథి కవితల్లో గమనించవచ్చు – అదే ‘మస్తిష్కంలో లేబరేటరీ’!

దాశరథి సూఫీ కవిత్వాన్ని ప్రేమించాడనడానికి ఎన్నో ఉదాహరణలు. ‘గాలిబ్‌ గీతాలు’, గాలిబ్‌ గజళ్ళను తెలుగులోకి అనువాదం చేయడం ఈ కోవకు చెందిందే! మనిషికున్న జ్ఞానం మరో మనిషికి మంచి చేసే దిశలో సాగాలన్నదే వీరి అభిమతం. మనిషికీ సంఘానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రకృతితో కలిసి చేసే జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని రచన చేయడం దాశరథి రచనల్లో చూడవచ్చు.

‘‘వీరంగం వేస్తుంటే రాదు విప్లవం
తారంగం పాడుతుంటే రాదు సమరథం
అందుకే నేనంటాను
ఏ లేహ్యం తిన్నాగాని రాదు యౌవనం’’

అని తిరిగిరాని కాలాన్ని తరగిపోయే జీవితాన్ని బాగా గుర్తుచేస్తారు దాశరథి. సమస్యలు చుట్టూ చేరుతుంటాయ్‌. అందులో అనేక శక్తులుంటాయ్‌. అధికారదాహం, డబ్బు కాంక్ష, కీర్తికండూతి, తెలివికలవారిమన్న భేషజం, ఉన్నవారిమన్న గర్వం అన్నీ –  అన్నీ మనచుట్టూ ఉంటాయి. అవన్నీ దాటినప్పుడే ఆశయాన్ని చేరుకోగలం అంటారు. అందుకే…

‘‘కలపండోయ్‌ భుజం భుజం – కదలండోయ్‌ గజం గజం
అడుగడుగున యెడదనెత్తు – మడుగులుగా విడవండోయ్‌’’ అని ఎలుగెత్తిన దాశరథి మాటను మన మాటలుగా చేసుకోవాలి!

‘‘ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు?
రాక్షసినైనా మైత్రికి, రానిత్తును భయంలేదు’’

అని చెప్పిన దాశరథి అభిప్రాయాన్ని నేడు నడుస్తున్న చరిత్రకు అన్వయించుకున్నట్లైతే, ఎవరినైనా దగ్గరతీసి, ఆదరించే గుణంతో చాపకింద నీళ్ళలా చేరిన అవతలి వారి కుటిలత్వం అర్థం చేసుకోలేని మంచితనం ఉండే తెలంగాణ ప్రాంత స్వభావాల్ని తేటతెల్లం చేస్తుంది. తిమిరంతో సమరం, మహాంధ్రోదయం, కవితా పుష్పకం, పునర్నవం, దాశరథీశతకం, గాలిబ్‌ గీతాలు, ఆలోచనాలోచనాలు వంటివెన్నో రచనలు చేసిన దాశరథి ఒక సామాజిక రచయిత. ఆంధ్రవిశ్వవిద్యాయం నుండి డాక్టరేట్‌ను పొందారు. దాశరథి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన దాశరథి ఏనాడూ గర్వాన్ని దరిచేరనీయలేదు. అట్లాంటి గుణమున్న ఆయన రచనలు నేటి రచయితలకు స్ఫూర్తిదాయకాలు.

‘‘నీ నవాస్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టుమా’’! అని ఒక శ్రామికురాలి దైన్యాన్ని చూసి చలించి వ్రాసిన దాశరథి కవితలు సమాజమంతా చదవాల్సినవి. నిస్వార్థంగా, నిష్కళంకంగా ఉండే దాశరథి మనోభావాలను అద్దం పట్టేసే కవితలు తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రతిబింబంగా ఉన్న కవిత్వం అనడానికి ఉదాహరణ –

‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజుమాకెన్నడేని –
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ! కోటి రత్నాలవీణ’

అంటూ ప్రభుత్వాన్నెదిరించడానికి బొగ్గుతో జైలు గోడ మీద వ్రాసిన దాశరథి తన జీవితంలో ఎన్నో మజిలీలు చేసి, చివరికి 1987 నవంబర్‌ 5న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

‘‘ననుగని పెంచినట్టి కరుణామయి నాతెలంగాణ’’ అని పొంగిపోయి కవిత్వం వ్రాసి తెలంగాణకు తన ‘రుద్రవీణ’ కావ్యాన్ని అంకితమిచ్చి, తన అభిమానాన్ని చాటుకున్నాడు దాశరథి. జాతిమెచ్చే ఈ తెలంగాణ బిడ్డను మనస్ఫూర్తిగా స్మరించుకోవడమే మనమిచ్చే నివాళి.

(జులై 22 దాశరథి కృష్ణమాచార్య జయంతి)

Other Updates