ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని ఆవిష్కరించిన సి.ఎం కె.సి.ఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాతే కన్నుమూయాలని తపించి, తన జీవిత కాలంలోనే రాష్ట్ర సాఫల్యతను చూసిన జి.వెంకట స్వామి (కాకా) ధన్యజీవి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి , రాజకీయ కురువృద్ధుడు జి.వెంకటస్వామి 86వ జయంతి సందర్భంగా, అక్టోబర్ 5న ట్యాంక్ బండ్ పై వున్న సాగర్ పార్క్ లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన యాదగిరి రెడ్డి కూడా తెలంగాణ స్వరాష్ట్రాన్ని చూడాలని ఎంతో తపన పడ్డారని, కానీ వారికి ఆ అదృష్టం దక్కక పోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాకా ఎంతో తపించారని, ఒకసారి అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో వున్న కాకాను పరామర్శించేందుకు తాను వెళ్ళగా ‘ఆ సమయంలో.. ‘చంద్రశేఖర్… ఏమన్నగానీ తెలంగాణ చూసే పోదామనుకున్న. ఎట్లయినచేసి దాన్ని సాధించే ప్రయత్నం చేయండి, వీలైనంత తొందరలో తీసుకురండి’ అని అన్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. వెంకటస్వామి రాష్ట్రంలో ఎవరెస్టు శిఖరమంత ఎదిగిన నేత. ఈ రోజు నాకు చాలా ఆనందంగా వుంది. నిజమైన తెలంగాణ బిడ్డ, నిండుమనసుతో తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి, రాజకీయ భీష్ముడు, రాజీలేని పోరాటంచేసిన వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆవిష్కరించుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆనందం వ్యక్తంచేశారు.
తెలంగాణలో పరిచయం చేయాల్సిన అవసరంలేని వ్యక్తి వెంకటస్వామి అని, ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ దెబ్బతిని ఇబ్బందులు పడినా, రాజీలేని పోరాటం చేశారని సి.ఎం చెప్పారు. క్రింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి మనిషి ఎదగ గలడనడానికి కాకా జీవితమే మంచి ఉదాహరణ అని అన్నారు. ఆయన చేసిన పదవులకు లెక్కలేదు, అవకాశాలు కూడా అపారంగా వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పేదల పక్షాన నిర్భయంగా తన గొంతు వినిపించిన వ్యక్తి వెంకటస్వామి అన్నారు. ఆనాటి ప్రభుత్వంతో పోరాడి పెన్షన్ పథకం తెచ్చారని, పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ఒప్పించారని కె.సి.ఆర్ చెప్పారు.
ఆవిష్కరించిన కాకా విగ్రహం చాలా బాగుందని, విగ్రహాన్ని తయారుచేయించి ఇచ్చిన కాకా తనయులు వివేక్, వినోద్ లను ముఖ్యమంత్రి అభినందించారు. తండ్రి ఆశయ సాధనకు వారు కృషిచేయాలని కోరారు. తన తరఫున, ప్రభుత్వం తరఫున వెంకటస్వామికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఘనంగా నివాళులర్పించారు.
పూర్తిజీవితం ప్రజాసేవలోనే…
ఈ సందర్భంగా వెంకటస్వామి జీవితంలోని పలు కీలక ఘట్టాలు, జాతీయ నాయకులతో కలసివున్న చిత్రాలతో రూపొందించిన కాకా ఆత్మకథ ‘మేరా సఫర్’ పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. విద్యాలయాలు, పరిశ్రమలలో దళితులకు అవకాశాలు లేని రోజుల్లో జీవించి, వెంకటస్వామి ఈ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయమని దత్తాత్రేయ కొనియాడారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కార్మిక చట్టాలలో పెనుమార్పులు తీసుకు వచ్చారని అన్నారు.
శాసన సభ స్పీకర్ మధుసూధనా చారి మాట్లాడుతూ, సమాజాన్ని ప్రభావితంచేసిన అరుదైన వ్యక్తి వెంకటస్వామి అని, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి, ఢిల్లీ పెద్దలలో కదలిక తెచ్చిన వారిలో కాకా కూడా ఒకరని అన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆవిష్కరించడమంటే తెలంగాణ తనను తాను గౌరవించుకోవడమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ శాఖామంత్రి నాయిని నరసింహారెడ్డి, దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎం.పి. కేశవ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు డి.శ్రీనివాస్, వెంకటస్వామి కుటుంబ సభ్యులు వివేక్, వినోద్, శంకర్రావు, తదితరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.