తెలంగాణ రాష్ట్ర సాకారం నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్ష. దశాబ్దాలపాటు సాగించిన పోరాట ఫలితం. వందలాది మంది ప్రాణత్యాగాల ఫలం. ఈ నాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకుడు కె. చంద్రశేఖర రావు ప్రాణాలకు కూడా తెగించి, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే భీషణ ప్రతిజ్ఞతో సాగించిన పోరాట ఫలితమే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. ఒక వైపు పోరాటం, మరోవైపు సంప్రదింపులు సాగిస్తూనే, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజానీకం మొక్కని మొక్కులు లేవు, చేయని త్యాగాలు లేవు. కొత్త రాష్ట్రం ఏర్పడి, మనపాలన మనం సాగించుకుంటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ మొక్కులన్నీ ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తిరుమలేశునికి, కురవి వీరభద్రస్వామికి మొక్కులు చెల్లించారు.
ముఖ్యమంత్రి దంపతులు ఫిబ్రవరి 22న ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించి, ప్రభుత్వ పక్షాన తయారుచేయించిన బంగారు ఆభరణాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. దాదాపు గంటపాటు ఆలయంలో గడిపిన ముఖ్యమంత్రి ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కోరుతూ, ఉద్యమకాలంనాటి మొక్కులలో భాగంగా, శ్రీవారికి 14.2 కిలోల బంగారంతో తయారుచేయించిన సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారంతో తయారుచేయించిన కంఠెను ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు.
ముఖ్యమంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు , రాష్ట్ర మంత్రులతో కలసి శ్రీవారిఆలయ దర్శనానికి వచ్చి, క్షేత్ర ఆనవాయితీ ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడినుంచి బ్యాటరీ కారులో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు ప్రధానద్వారం ద్వారా ఆలయప్రవేశం చేశారు. బంగారు వాకిలి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ ఇ.ఓ సాంబశివరావు, జె.ఇ.ఓ శ్రీనివాసరాజులు ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. రంగనాయక స్వామి మంటపంలో ప్రవేశించిన కె.సి.ఆర్ స్వామివారికి ఆభరణాలు సమర్పించారు. బంగారు వాకిలినుంచి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రధాన అర్చకులు ఎ.ఎస్. నరసింహ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి సేవలో నిమగ్నమయ్యారు,
అనంతరం వకుళమాతను దర్శించి పూజలు నిర్వహించారు. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించి, హుండీలో కానుకలు సమర్పించారు. భాష్యకార్ల సన్నిధిలో , నర్సింహస్వామికి పూజలు నిర్వహించారు. రంగనాయక స్వామి మంటపంలో ముఖ్యమంత్రి దంపతులను వేదపండితులు ఆశీర్వదించి, ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా శ్రీవారికి సమర్పించిన ఆభరణాలను తయారుచేసిన కోయంబత్తూర్ కీర్తిలాల్ జ్యువెలర్స్ నిర్వాహకుడు మదుసూదన్‌ను, అమ్మవారి ముక్కు పుడకను తయారుచేసిన ముంజంపల్లి విద్యాధర్‌ను ముఖ్యమంత్రి సన్మానించారు. నువ్వు గింజపై కేసీఆర్ పేరు రాసి విద్యాధర్ సీఎంకి అందించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకంగా చేయించిన ముక్కుపుడకను సమర్పించారు. అమ్మవారి సేవ అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడినుంచి ముఖ్యమంత్రి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావు, ఎంపీలు కవిత, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, దేవాదాయ కమిషనర్ శివశంకర్, సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ట్రస్ట్‌బోర్డు మెంబర్ చింతల రామచంద్రారెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.
ఘన స్వాగతం
రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సతీసమేతంగా, కుటుంబ సభ్యులతో సహా ఫిబ్రవరి 21న సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఏపీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీఐజీ ప్రభాకర్‌రావు, తుడా మాజీ ఛైర్మన్ శంకర్‌రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం ఎదుట బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతించారు. కేసీఆర్ అభిమానులు వందలాదిమంది విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు.
రేణిగుంట నుంచి నేరుగా తిరుమల చేరుకున్న కేసీఆర్ దంపతులకు టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. గతంలో ఏరాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని ఈవో సాంబశివరావు అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, మైసూరు మహారాజులాంటివారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున శ్రీవారికి మొక్కులు చెల్లించడంతో కొత్త అధ్యాయం ప్రారంభమయిందన్నారు.
కేసీఆర్ బస చేసిన అతిథి గృహానికి వచ్చి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు స్వాగతం పలికారు. అతిథిగృహం వద్ద పెద్దఎత్తున తిరుమల భక్తులు గుమిగూడి కేసీఆర్‌ను ఆసక్తిగా చూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అధికారులు, ప్రముఖులు కూడా కేసీఆర్‌ను కలిశారు.