తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్‌ నరసింహన్‌ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన గవర్నర్‌ నరసింహన్‌తో తనకు అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని సీఎం అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులు ప్రతీ పండుగను గొప్ప వేడుకగా నిర్వహించేవారని, ఇప్పుడా నోరూరించే రుచులకు దూరం అవుతున్నామని చెప్పారు. నరసింహన్‌ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళతామని సీఎం చెప్పారు.

గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ఆత్మీయ వీడ్కోలు సభ ప్రగతి భవన్‌లో జరిగింది. వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గవర్నర్‌ తో తనకున్న అనుబంధాన్ని, ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ, ప్రోత్సహించిన విధానాన్ని చెప్పారు. తనకు ఓ పెద్దదిక్కులాగా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్‌ పదవీ విరమణ చేసి వెళ్లిపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ప్రసంగం మధ్యలో చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్వేగానికి గురయ్యారు.

”గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మొదట సమైక్య ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా, తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా, చివరికి తెలంగాణ గవర్నర్‌ గా నరసింహన్‌ మూడు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. నేను ఉద్యమ కారుడిగా, ముఖ్యమంత్రిగా రెండు రకాల బాధ్యతలు నిర్వర్తించాను. ఈ కాలంలో ఇద్దరి మధ్య అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపిఎస్‌ అధికారి అయిన నరసింహన్‌ గవర్నర్‌గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే ఆయన్ను కలిశాను. ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లు గా ఉద్యమం సజీవంగా ఉండడానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం కలిగిన గవర్నర్‌ తెలంగాణ ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్‌ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం నాకున్నదని నేను తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశాను” అని సీఎం గుర్తు చేసుకున్నారు.

”నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చింది. ఆయన హయాంలోనే టిఆర్‌ఎస్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. నేను తననో పెద్ద మనిషిలాగానే చూశాను. నన్ను కూడా ఆయన సీఎంలా కాకుండా, తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల మంచి, చెడులను ఎప్పటికప్పుడు చర్చించేవారు. పథకాల ఉద్దేశ్యాలను తెలుసుకునే వారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వాకబు చేసేవారు. కేసీఆర్‌ కిట్స్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, హరితహారం, మిషన్‌ భగీరథ లాంటి పథకాలు ఆయనకు ఎంతో బాగా నచ్చాయి. పేదలకు ఉపయోగ పడుతున్నాయని సంతప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా కొంచెం బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారు. ప్రజల మంచి కోసం పనిచేస్తున్నారు. మానవ ప్రయత్నం చేయండి. భగవంతుడి దీవెనలుంటాయ ని దీవించేవారు. తలపెట్టిన ప్రతీ పని విజయవంతం కావాలని తపన పడేవారు. స్ఫూర్తి నింపే మాటలు చెప్పేవారు. రాజ్‌భవన్‌ పోయిన ప్రతీసారి ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. అన్ని విషయాలు చర్చించే వారు. రాజ్‌భవన్‌ను ప్రజావేదికగా మార్చారు. ఎవరైనా వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుకలిగేది. రాజ్‌ భవన్‌ వెళ్లేవారిని గవర్నర్‌ దంపతులు తల్లిదండ్రుల్లా ఆదరించేవారు. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులకు కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గవర్నర్‌ వివరించేవారు. దానివల్ల మనకు మంచి ప్రశంసలు లభించేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి చొరవ చూపారు” అని ముఖ్యమంత్రి అన్నారు.

”యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్‌ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని మంచి పనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్‌ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనం చేసి పని ప్రారంభించాను. అది విజయవంతగా కొనసాగుతున్నది. నరసింహన్‌ గారు యాదాద్రి పనులు పూర్తయ్యాక మళ్లీ రావాలి. పూజలో పాల్గొనాలి. గవర్నర్‌ నరసింహన్‌ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండిపోతాయి” అని ముఖ్యమంత్రి అన్నారు.

”నరసింహన్‌కు ఇచ్చినట్లే వచ్చే గవర్నర్‌కు కూడా అదే గౌరవం ఇస్తాం. రాజ్‌ భవన్‌ ప్రాశస్త్యాన్ని కాపాడుతాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నా ముందు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, డిజిపి మహేందర్‌ రెడ్డి, పిసిసిఎఫ్‌ శోభ మాట్లాడారు.

ఆ సంస్కారం నాకెంతో నేర్పింది

తనకు జరిగిన ఆత్మీయ వీడ్కోలును ఉద్దేశించి, గవర్నర్‌ నరసింహన్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ”పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌లో నాకు కనిపించాయి. ఎప్పుడైనా ఫోన్‌ చేసినప్పుడు నమస్కారం చెపితే, పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నమస్కారం పెట్టకూడదు అనేవారు. ఆ సంస్కారం నాకు కూడా ఎంతో నేర్పింది. మా అమ్మ చనిపోయినప్పుడు కేసీఆర్‌ కేవలం 15 నిమిషాల్లో నా దగ్గరకి వచ్చారు. అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. అన్నట్లే అన్నీ చూసుకున్నారు. అస్తికలు కలపడానికి హెలిక్యాప్టర్‌ లో పంపారు. గుడుల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేసి మానవత్వం చూపారు. తెలంగాణ గవర్నర్‌ గా వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే కేసీఆర్‌ మాటిచ్చారు. అన్న విధంగా మాట నిలబెట్టుకున్నారు. నమ్మకం నిలబెట్టుకున్నారు. మా మధ్య మొదటి నుంచీ ఉన్నది పరస్పర నమ్మకమే” అని గవర్నర్‌ చెప్పారు.

”కేసీఆర్‌ తీసుకొచ్చిన అనేక పథకాల్లో మానవత్వం ఉన్నది. డబుల్‌ బెడ్‌ రూము ఇండ్లు, కేసీఆర్‌ కిట్స్‌, లాంటి పథకాల్లో మానవత్వం ఉంది. నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ లాంటి పథకాల్లో కేసీఆర్‌ విజనరీ కనిపించింది. తెలంగాణలో శాంతిభధ్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉంది. ప్రతీ స్కీము గురించి నాకు చెప్పేవారు. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించేవారు. డబ్బుందా అని అడిగితే, తెలంగాణ రాష్ట్రానికి ఢోకా లేదని, ధనిక రాష్ట్రమని ధైర్యంగా ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు దేశవ్యాప్తంగా చర్చ అయ్యేవి. ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసి, స్క్రీన్‌ పై పథకాల గురించి వివరించిన వైనాన్ని నేను ప్రధాన మంత్రికి కూడా చెప్పాను. కేసీఆర్‌ కు ప్రజల నాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. అందుకే మంచి పథకాలు తేగలిగారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇద్దరం గంటల తరబడి చర్చలు చేసేవారం. వాడీవేడి చర్చలు జరిగేవి. కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. ఎక్కడున్నా సరే, తెలంగాణ ఫలానా రంగంలో నెంబర్‌ వన్‌గా నిలిచింది, ఫలానా విషయంలో టాప్‌ గా ఉంది అనే వార్తలు చదివి సంతోషిస్తా. తెలంగాణ మొదటి గవర్నర్‌గా నా పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. దీన్నెవరూ మార్చలేరు” అని గవర్నర్‌ అన్నారు.

గవర్నర్‌ తన ప్రసంగంలో సంస్కత శ్లోకాలు చదివారు. చమత్కారాలతో గవర్నర్‌ ప్రసంగం సాగింది.

”చాలా మంది కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి మాట్లాడతారు. వారంతా కలవకుంట మాట్లాడతారు. నేను కలిసి మాట్లాడుతున్నాను” అని చమత్కరించారు.

”నా పేరు నరసింహన్‌ పేరుకు తగ్గట్టు పనిచేయాలి. లేకుంటే సార్థక నామధేయుడు అనరు. అందుకే అప్పుడప్పుడు నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చింది” అని అందరినీ నవ్వించారు.

ప్రగతిభవన్‌ చేరుకున్న గవర్నర్‌ దంపతులకు ముఖ్యమంత్రి దంపతులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు గవర్నర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. వీడ్కోలు సభ అనంతరం గవర్నర్‌ దంపతుల గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విందు ఇచ్చారు. గవర్నర్‌ గౌరవార్థం పూర్తి శాఖాహార భోజనం, అదీ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా పెడుతున్నాం అని అంతకుముందు సభలోనే సీఎం ప్రకటించారు. విందు తర్వాత గవర్నర్‌ దంపతులు రాజ్‌ భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ దంపతులను కారుదాకా వెళ్లి ముఖ్యమంత్రి దంపతులు సాగనంపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Other Updates