యానిమేషన్‌, గేమింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో నగరంలో వెయ్యి కోట్ల రూపాయలతో ‘ఇమేజ్‌ టవర్స్‌’ నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. 2022 నాటికి దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ”ఇండియా జాయ్‌ 2019” పేరిట ఏర్పాటు చేసిన గేమింగ్‌, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ వార్షిక సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 16లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్స్‌ను నిర్మిస్తామని తెలిపారు. అంతర్జాతీయంగా యానిమేషన్‌, గేమింగ్‌, విఎఫ్‌ఎక్స్‌ పరిశ్రమలకు తెలంగాణ హబ్‌గా మారుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక అనుకూలమైన విధానాలతో పాటు ఇక్కడ కల్పించిన ప్రపంచస్థాయి మౌలిక వసతులు, అపారమైన మానవ వనరుల కారణంగా ఇది సాధ్యమవుతుందని అన్నారు.

గేమింగ్‌ పరిశ్రమ ఏటా 25శాతం వృద్ధి సాధిస్తున్నదని మంత్రి తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌ల వాడకం పెరిగిపోవడంతో మొబైల్‌ గేమింగ్‌కు డిమాండ్‌ పెరిగిందన్నారు. టీవీ, ఓటీటీల కోసం తయారుచేస్తున్న స్థానిక యానిమేషన్‌ కంటెంట్లు, పాత్రలతో యానిమేషన్‌ ఐపీ ప్రొడక్షన్‌ విభాగం బాగా వృద్ధి సాధించిందన్నారు. 2010లో భారత్‌లో గేమింగ్‌ అంకుర సంస్థలు 25 ఉండగా ఇప్పుడు వాటిసంఖ్య 250 దాటిందని తెలిపారు. రూ. 2వేల కోట్లు విలువ చేసే కంటెంట్‌ హైదరాబాద్‌లోనే రూపుదిద్దుకుంటుందని తెలిపారు. బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన బాహుబలి, లైఫ్‌ ఆఫ్‌ ఫై, అరుంధతీ, మగధీర, ఈగ వంటి అనేక సినిమాలకు యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ హైదరాబాద్‌ కంపెనీల్లో జరగడం గర్వకారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉత్తమ యానిమేషన్‌ ఛోటాభీమ్‌ సైతం ఇక్కడ నుంచే వచ్చిందని చెప్పారు.

సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, తెలుగులో కూడా ఓటీటీ

ఉండాలనే ఆలోచనతో ఒక ఓటీటీ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటి నమ్రత శిరోద్కర్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates