అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌లో ఇప్పుడు డిజిటల్ విప్లవం విస్తరిస్తోంది. ఇచ్చోడ మండలం సమీపంలోని అకోలి గ్రామం కేంద్రంగా గిమ్మి గ్రామానికి చెందిన గజానన్ నీవాల్కర్ నిజమైన విప్లవానికి బాటలు వేస్తున్నారు.
ఒకప్పుడు విద్యరానివాడు వింత పశువు అనేవారు. ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత లేని వారినుద్దేశించి ఆ మాట అనే ప్రమాదం ఏర్పడింది. అదో అంతటి ప్రాధాన్యత డిజిటల్ లిటరీసీకి ఏర్పడింది. దాన్ని పసిగట్టిన గజానన్ తాను నివసిస్తున్న ప్రాంత గ్రామాల్లోని ప్రతి ఇంటిలో ఒకరినైనా డిజిటల్ అక్షరాస్యతలో భాగస్తుణ్ణి చేసి వారికి ప్రాథమిక అవగాహన కల్పించి విజయం సాధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచేత ‘శభాష్’ అనిపించుకున్నారు.
నగదు రహిత లావాదేవీలు పెరగడం, మొబైల్ పాలన విస్తరిస్తూ ఉండడంవల్ల జీవనం డిజిటల్ మయమవుతోంది. కొన్ని మాసాల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోనే కేస్లాపూర్ మండల కేంద్రంలో నాగోబా జాతర సందర్భంగా అధికారులు వైఫై (వైర్‌లెస్ ఫిజిలిటి) సౌకర్యం కల్పించారు. పాఠశాలలనుంచి పరిపాలన వరకు అంతటా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌ల వాడకం పెరగడంతో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ప్రజల్లో ఉన్నప్పుడే వారికి సాధికారత సిద్ధిస్తుంది.
ఒకప్పుడు భూమి, పరిశ్రమలు కేంద్రంగా సంపద సృష్టి జరిగింది. వర్తమానంలో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా సమాచార, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రంగా సంపద సృష్టి జరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అందుకే డిజిటల్ ఎకానమీ అన్న పేరు ఎక్కువగా వినబడుతోంది. విద్యార్థులు, యువకులు ఈ రంగంపై ఎక్కువ మక్కువ కనబరుస్తున్న విషయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
రాష్ట్ర ఐటీశాఖమంత్రి కె. తారక రామారావు ఐటీ విషయంలో ప్రపంచంతోనే పోటీపడుతున్నామని పలు సందర్భాల్లో చెప్పారు. తదనుగుణంగానే కార్యాచరణ కనిపిస్తోంది. ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్, ఒరాకిల్, ఆపిల్‌లాంటి కంపెనీలు తెలంగాణ యువతకు గొప్ప కలలుగనే అవకాశాలు కల్పిస్తున్నాయి.
దేశీయ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, టీసీఎస్‌లాంటివి కూడా హైదరాబాద్ కేంద్రంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. మైక్రోమాక్స్, సెల్‌కాన్‌లాంటి మరిన్ని సంస్థలు పని చేస్తున్నాయి. కేవలం ఐటీ రంగంలోనే నాలుగు లక్షలకుపైగా మంది ఉపాధి పొందుతున్నారు. అనుబంధ రంగాల్లో మరికొన్ని లక్షలమందికి ఉపాధి లభిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజిటల్ ఇండియా’ తరహాలో రూపకల్పన చేసిన ‘డిజిటల్ తెలంగాణ’ ప్రజల్ని సాంకేతిక పరిజ్ఞానం వైపు ఆకర్షిస్తోంది. తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్) ఔత్సాహికులకు శిక్షణ అందిస్తోంది. ఆంగ్ల భాషపై పట్టును సాధించేందుకు అవసరమైన శిక్షణ సైతం అందిస్తున్నది.
ఇప్పుడు గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్‌తోపాటు ఆటోమేషన్ అన్న పదం తరచూ వినిపిస్తోంది. ఈ ఆటోమేషన్ కారణంగా ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు ఊడిపోతాయని కొందరు… అలాంటిదేమీ ఉండదు, నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుని ఆధునిక టెక్నాలజీకి అప్‌డేట్ అవుతే ఉద్యోగాలు అభ్యర్థుల్ని వెతుక్కుంటూ వస్తాయని కొందరు చెబుతున్నారు.
ఏది ఏమైనా పరిస్థితి వేగంగా మారుతోందనేది యధార్థం.
ముఖ్యంగా కృత్రిమమేథ ఐటీరంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. అందులో భాగంగానే రోబోలు విస్తృతంగా కనిపించబోతున్నాయి. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో, విమానాశ్రయాల్లో, ఆసుపత్రుల్లో రోబోలు సేవలందిస్తున్నాయి. ఒకరకంగా మనిషికి ప్రత్యామ్నాయంగా రోబో సేవలు అందే రోజు ఎంతో దూరం లేదు. ఉత్పత్తిరంగంలో ఇప్పటికే పెద్దఎత్తున వాటిని ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో అవి సర్జరీలు చేస్తున్నాయంటే వాటి వినియోగం ఏ విధంగా పెరిగిందో ఊహించవచ్చు.
అలాగే డ్రైవర్‌లేని కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు రోడ్లపైకి త్వరలో రాను న్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ప్రక్రియ ఆధారంగా ఎన్నో పరికరాలను, వస్తువు లను స్మార్ట్‌ఫోన్‌కు, కంప్యూ టర్‌కు అనుసంధానం చేయ డంవల్ల పనులు ఎంతో సౌకర్యవంతంగా, సులభంగా జరిగే అవకాశ ముంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ పాశ్యాత్య దేశాల్లో వాడుకలో ఉంది.
నాల్గవతరం పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న ఈ తరుణంలో ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించగలదన్న విశ్వాసం రాజకీయ నాయకుల్లో, నిపుణుల్లో వ్యక్తమవుతోంది. దానికి అవసరమైన ప్రతిభ, నైపుణ్యం, మన దగ్గర పుష్కలంగా ఉందని వివిధ స్టార్టప్ సంస్థలు, కొత్త ఆవిష్కరణలు రుజువు చేస్తున్నాయి.
ఇంత విస్తృతంగా ప్రపంచం వెయ్యి రేకులుగా పుష్పిస్తున్న వేళ తెలంగాణ సైతం అందుకనుగుణంగా స్పందిస్తోంది.
అందుకు టి-హబ్ సాక్ష్యం.
ఉప్పల నరసింహం